Tuesday, September 17, 2024

నాదల్ కెరీర్ ముగిసినట్టేనా?

- Advertisement -
- Advertisement -

వెంటాడుతున్న గాయాలతో సతమతం

ఆ రికార్డును అందుకోవడం కష్టమే..
ప్రస్తుతం జకోవిచ్ ఖాతాలో 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న నాదల్ ఇప్పటి వరకు 22 గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు సాధించాడు. నాదల్‌తో పోల్చితే జకోవిచ్ ఫిట్‌నెస్ విషయంలో చాలా మెరుగ్గా ఉన్నాడు. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఇలాంటి స్థితిలో జకోవిచ్ రానున్న రోజుల్లో మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే పురుషుల టెన్నిస్‌లో జకోవిచ్ రికార్డును అందుకోవడం నాదల్‌కు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇప్పటికే కెరీర్ చరమాంకంలో ఉన్న నాదల్ పూర్వవైభవం సాధించి మళ్లీ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడం శక్తికి మించిన పనిగానే విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

మన తెలంగాణ/క్రీడా విభాగం: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ టెన్నిస్ కెరీర్ ముగిసిందా అంటే విశ్లేషకులు అవుననే అంటున్నారు. వరుస గాయాలతో సతమవుతున్న నాదల్ ఈ ఏడాది ఒకటి రెండు టోర్నమెంట్‌లలో మాత్రమే ఆడాడు. ఇటీవల ముగిసిన ఒలింపిక్స్‌లో నాదల్ స్పెయిన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఒలింపిక్ పతకం సాధించడంలో మాత్రం నాదల్ విఫలమయ్యాడు. సింగిల్స్‌లో చిరకాల ప్రత్యర్థి నొవాక్ జకోవిచ్ (సెర్బియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. పురుషుల డబుల్స్‌లో యువ సంచలనం అల్కరాజ్‌తో కలిసి బరిలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. గాయాలు నాదల్ కెరీర్‌పై బాగానే ప్రభావం చూపుతున్నాయి.

ఒకప్పుడూ ప్రపంచ టెన్నిస్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగిన నాదల్ కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్నాడు. మరోవైపు జకోవిచ్ వరుస గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో నాదల్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నాదల్ 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. నాదల్ మాత్రం రెండేళ్లుగా అంతర్జాతీయ టెన్నిస్‌కు దూరంగానే ఉంటున్నాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్‌కు దూరంగా ఉన్నాడు. తాజాగా యూఎస్ ఓపెన్‌లో పాల్గొనడం కూడా సందేహంగా మారింది. ఇలాంటి స్థితిలో నాదల్ ఇకపై అంతర్జాతీయ టెన్నిస్‌లో మళ్లీ పూర్వ వైభవం సాధించడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. స్పెయిన్‌కే చెందిన అల్కరాజ్ ప్రస్తుతం ప్రపంచ టెన్నిస్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. సెర్బియా యోధుడు జకోవిచ్‌కు గట్టిపోటీ ఇస్తూ అల్కరాజ్ ముందుకు దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం జకోవిచ్, అల్కరాజ్‌ల మధ్యే పోటీ నెలకొంది.

అలెగ్జాండర్ జ్వరేవ్, సిట్సిపాస్, బెర్రిటెని, హుర్కాజ్, రూనె, డానిల్ మెద్వెదేవ్ వంటి ఆటగాళ్లు నాదల్‌కు అందనంత ఎత్తులో నిలిచారు. వీరిని దాటుకుని నాదల్ ముందుకు సాగడం కష్టంతో కూడుకున్న అంశమనే చెప్పాలి. కొన్నేళ్ల వరకు ప్రపంచ టెన్నిస్‌లో నాదల్ ఎదురులేని శక్తిగా కొనసాగాడు. రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), జకోవిచ్‌లతో కలిసి పురుషుల టెన్నిస్‌లో హవా కొనసాగించాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఈ ముగ్గురి మధ్యే పోటీ ఉండేదు. ఈ త్రయం పోటీ పడి గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించేది. కానీ వయసు పెరగడంతో స్విస్ దిగ్గజం ఫెదరర్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించక తప్పలేదు. అతను తప్పుకోవడంతో జకోవిచ్, నాదల్ మధ్య పోరు కొనసాగింది. ఒక దశలో నాదల్ చిరకాల ప్రత్యర్థి జకోవిచ్‌పై ఆధిపత్యం చెలాయించాడు. గ్రాండ్‌స్లామ్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ సాధించిన ఆటగాడిగా నాదల్ నిలిచాడు. కానీ జకోవిచ్ పట్టు వదలకుండా పోరాడాడు. అసాధారణ పోరాట పటిమతో నాదల్‌ను వెనక్కినెట్టి అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా నయా చరిత్ర సృష్టించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News