Wednesday, January 22, 2025

టెన్నిస్ రారాజు నాదల్

- Advertisement -
- Advertisement -

Nadal won Australian Open Title 2022

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ టెన్నిస్‌లోనే స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ అత్యంత అరుదైన రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. ఐదున్నర గంటల సేపు ఉత్కంఠభరితంగా ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో నాదల్ చిరస్మరణీయ సాధించాడు. రష్యా స్టార్ డానిల్ మెద్వెదెవ్ నుంచి గట్టి పోటీ ఎదురైనా చివరి వరకు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆడి తన కెరీర్‌లోనే అత్యంత గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తొలి రెండు సెట్లలో ఓడినా మొక్కువోని ధైర్యంతో ఆడుతూ అసాధారణ గెలుపును దక్కించుకున్నాడు. ఈ విజయంతో పురుషుల గ్రాండ్‌స్లామ్ చరిత్రలో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ సాధించిన ఆటగాడిగా నాదల్ నిలిచాడు. ఈ క్రమంలో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్‌ల పేరిట సంయుక్తంగా ఉన్న 20 సింగిల్స్ టైటిల్స్ రికార్డును తిరగరాశాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 21 టైటిల్స్ సాధించి నాదల్ నయా చరిత్రను తన పేరిట లిఖించుకున్నాడు. 2009లో తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సాధించిన రఫెల్ సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది ఈ ట్రోఫీని దక్కించుకున్నాడు. అంతేగాక ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ రికార్డు స్థాయిలో 13 టైటిల్స్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఓ గ్రాండ్‌స్లామ్ చరిత్రలో ఇన్ని టైటిల్స్ సాధించిన ఏకైక ఆటగాడిగా రఫెల్ నిలిచాడు. అంతేగాక రెండు వింబుల్డన్, మరో నాలుగు యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను కూడా నాదల్ తన ఖాతాలో వేసుకున్నాడు.
పడి లేచాడు..
కొన్నేళ్ల క్రితం నాదల్ ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. జకోవిచ్, ముర్రే వంటి కొత్త ఆటగాళ్లకు తోడుగా చిరకాల ప్రత్యర్థి రోజర్ ఫెదరర్ నుంచి నాదల్‌కు గట్టి పోటీ ఎదురైంది. ఒకవైపు గాయాలు, మరోవైపు వ్యక్తిగత కారణాలతో నాదల్ కెరీర్ ప్రమాంలో పడినట్టు కనిపించింది. వరుస ఓటములతో నాదల్ ఆట రోజు రోజుకు తీసికట్టుగా తయారైంది. తనకు ఎంతో కలిసి వచ్చే ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా మూడేళ్ల పాటు టైటిల్ సాధించలేక పోయాడు. అయితే 2017 నుంచి నాదల్ అనూహ్యంగా పుంజుకున్నాడు. గాయాల నుంచి కోలుకున్న రఫెల్ రెండో ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించాడు. 2017లో ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. అంతేగా 2019లో కూడా రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించాడు. కిందటి ఏడాది మాత్రం ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా సాధించలేదు. తనకు తిరుగులేని రికార్డు ఉన్న ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ నిరాశ పరిచాడు. కానీ ఈ ఏడాది ఆరంభంలోనే ఆస్ట్రేలియా ఓపెన్ ట్రోఫీని సాధించి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకున్నాడు. రానున్న టోర్నీల్లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు ఇది దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు.
ప్రశంసల వర్షం..
మరోవైపు చారిత్రక రికార్డును సొంతం చేసుకున్న రఫెల్ నాదల్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియా వేదికగా వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులు నాదల్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. టెన్నిస్ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డును సాధించిన నాదల్‌ను టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెదరర్, అగాసి, సంప్రాస్, కొరియర్, మార్టినా నవత్రిలోవా, క్రీస్ ఎవర్ట్, స్టీఫెన్ ఎడ్‌బర్గ్, బోరిస్ బేకర్, మార్టినా హింగిస్ తదితరులు అభినందించారు. అంతేగాక చిరకాల ప్రత్యర్థిలు జకోవిచ్, ముర్రేలు కూడా నాదల్ విజయాన్ని కొనియాడారు. దీంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన టెన్నిస్ అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా నాదల్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.

Nadal won Australian Open Title 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News