Sunday, April 13, 2025

ప్రజలలో అనుసంధానం ఉండాలి

- Advertisement -
- Advertisement -

పూరి (ఒడిశా) : ప్రజలతో ఎలా అనుసంధానం కావాలో నేర్చుకోవాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని బిజెపి ఎంఎల్‌ఎలు, ఎంపిలను పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా శనివారం కోరారు. పూరిలో పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంపిల కోసం మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం నడ్డా ఈ విషయం విజ్ఞప్తి చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, కేంద్ర మంత్రులు జ్యుయల్ ఓరమ్, ధర్మేంద్ర ప్రధాన్, అశ్వనీ వైష్ణవ్, ఒడిశా బిజెపి అధ్యక్షుడు మన్మోహన్ సమల్, చాలా మంది పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంపిలు కార్యక్రమానికి హాజరయ్యారు. పార్టీ శాసనకర్తలను ఉద్దేశించి చేసిన 90 నిమిషాల ప్రసంగంలో నడ్డా బిజెపికి, ప్రజలకు సేవ చేయడంలో వారి బాధ్యతలు, కర్తవ్యాల గురించి వివరించారు. ‘పార్టీ అధ్యక్షుడు 14 అంశాలపై దృష్టి కేంద్రీకరించారు.

గ్రామాలను సందర్శించడం ద్వారా పెద్దలు, దళితులు, మహిళలు వంటి వివిధ వర్గాల ప్రజలతో సంబంధం పెట్టుకోవాలని, వారి జీవితాల్లో భాగం కావాలని సభికులను ఆయన కోరారు’ అని భువనేశ్వర్ ఎంపి అపరాజిత సారంగి విలేకరులతో చెప్పారు. శిక్షణ కార్యక్రమం కేవలం ఎంఎల్‌ఎలు, ఎంపిలకు అయినందున ప్రారంభ కార్యక్రమం ఫోటోలు తీసుకోవడానికి, వీడియోలు చిత్రించడానికి మినహా సమావేశం లోపలికి మీడియాను అనుమతించలేదు. 28 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల బిజెపి ఎంఎల్‌ఎలు, ఎంపిలు కార్యక్రమానికి హాజరయ్యారు. బిజెపి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని నడ్డా పేర్కొంటూ, 19 చోట్ల ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పాటైందని తెలియజేశారు. బిజెపి ఒక్కటే 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని పార్టీ అధ్యక్షుడు సభికులతో చెప్పారు.

జన బాహుళ్యం నమ్మకం పొందడానికి ప్రజలతో ఆయా ఎంఎల్‌ఎలు, ఎంపిలు మమేకం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. కేవలం మూడున్నర మాసాల వ్యవధిలో 13.5 కోట్ల మంది ప్రజలు ఐచ్ఛికంగా విజెపి సభ్యులు అయ్యారని నడ్డా వెల్లడించారు. ‘బిజెపి కేడర్ ఆధారిత పార్టీ. సొంత సూత్రాలు, సిద్ధాంతం ఉన్న పార్టీ. దీనిని శాసనకర్తలు అమలు చేయాలి’ అని ఆయన అన్నారు. నాయకులు అందరూ తమ అహం ఉంటే దానిని వీడి, సమష్టిగా పార్టీ కోసం పని చేయడానికి ముందుకు రావాలని ఆయన కోరారు. ‘చేయదగిన, చేయకూడని పనుల’ గురించి కూడా శాసనకర్తలకు నడ్డా తన ప్రసంగంలో వివరించారు. శుక్రవారం మొదలైన ఈ కార్యక్రమం ఆదివారం ముగుస్తుంది. శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నవారికి సంస్థాగత నిర్వహణ, పాలన, సైద్ధాంతిక స్పష్టత వంటి అంశాలపై నైపుణ్యాలు అలవరుస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News