కొత్తగూడెం భద్రాద్రి: దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బిజెపి అని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారు. మోడీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం మూడో సారి ఏర్పాటు చేస్తామని, విపరీతమైన ఎండలో కూడా బిజెపి సభకు తరలవచ్చిన ప్రజలను చూసి నడ్డా ఆశ్చర్యపోయారు. కొత్తగూడెంలో జరిగిన బిజెపి బహిరంగ సభలో నడ్డా మాట్లాడారు. కేంద్రం పదేళ్లుగా తెలంగాణకు అన్ని రకాలుగా సాయం చేశామని, తెలంగాణకు ఇచ్చే పన్నుల వాటా మూడు రెట్లు పెరిగిందని తెలియజేశారు. ఎంపి అభ్యర్థులు సీతారాం నాయక్, వినోద్ రావు గెలుపు ఖాయమన్నారు. అయోధ్యలో వందల ఏళ్ల రామమందిరం కలను మోడీ సాకారం చేశారని ప్రశంసించారు. మోడీ ప్రభుత్వం ఎంతో దైర్యంతో 370 ఆర్టికల్‌ను రద్దు చేసిందని నడ్డా కొనియాడారు.
బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనను కూడా చూస్తున్నామని, మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం సరికాదని సూచించారు. ఆయా పార్టీల వారసుల కోసమే ఇండియా కూటమి ఏర్పాటు చేశారని, ఇండియా కూటమి నేతలు అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని, అనేక మంది కూటమి నేతలు అవినీతి చేసి జైళ్లకు వెళ్లారని దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కూతురు ఢిల్లీ మద్యం కేసు కుంభకోణంలో జైల్లో ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంఘవ్యతిరేక శుక్తులన్నీ విజృంభిస్తాయని, కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు, అవినీతి కనపడుతోందని నడ్డా విమర్శలు గుప్పించారు.
“గిరిజనుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ 11 వ స్థానం నుంచి ఐదో స్థానానికి తీసుకవచ్చారు, రెండేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతోంది. మా పాలనలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. మేడిన్ ఇండియా ఔషధాలు ప్రపంచ దేశాలకు వెళ్తున్నాయి. ఒకప్పుడు ఫోన్లన్నీ మేడిన్ చైనా, కొరియా, జపాన్ అని ఉండేవి. మేకిన్ ఇండియా పేరుతో భారత్‌లోనే ఫోన్లు తయారవుతున్నాయి. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నాం, మరో ఐదేళ్లు కొనసాగిస్తాం. నాలుగు కోట్ల మందికి ఇళ్లు కటించి ఇచ్చాం, మరో మూడు కోట్ల ఇళ్లు కటిస్తాం. పిఎం మోడీ ఎప్పుడూ పేదలు రైతుల గురించే ఆలోచన చేస్తారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 70 ఏళ్లు పైబడిన వారికీ చికిత్స అందించాం, భవిష్యత్తులో పైపులైను ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేస్తాం” అని జెపి నడ్డా తెలిపారు.