Thursday, January 23, 2025

ఎన్‌డిఎ భేటీకి చిరాగ్ పాశ్వాన్‌కు నడ్డా ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పాతమిత్రులను కలుపుకొని పోయే దిశగా బిజెపి పావులు కదుపుతోంది. ఈ నెల 18న జరిగే జాతీయ ప్రజాస్వామ్య కూటమి( ఎన్‌డిఎ) సమావేశానికి రావలసిందిగా లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌ను బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఆహ్వానించారు. ఈ విషయాన్ని నడ్డా ఒక ట్వీట్‌లో తెలియజేశారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ శుక్రవారం రాత్రి వారంలో రెండో సారి చిరాగ్ పాశ్వాన్‌ను కలిసి ఈ సమావేశానికి ఆహ్వానిస్తూ నడ్డా రాసిన లేఖను ఆయనకు అందజేశారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో జరిగే ఎన్‌డిఎ సమావేశానికి మోడీ అధ్యక్షత వహించనున్నారు.కాగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఎల్‌జెపి (రామ్‌విలాస్) పొత్తు ఉంది.2021లో పార్టీలో చీలిక ఏర్పడడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ పార్టీకి కొత్త గుర్తును కేటాయించింది.

కేంద్రమంత్రి పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం రాష్ట్రీయ లోక్‌జనశక్తి పార్టీగా కొనసాగుతోంది.ఎల్‌జెపి(రామ్‌విలాస్)కి లోక్‌సభలో ఒక సీటు ఉంది. కాగా నడ్డా ఆహ్వానంపై చిరాగ్ స్పందిస్తూ, ఎన్‌డిఎ సమావేశానికి హాజరు కావడం, లోక్‌సభ ఎన్నికల్లో అధికార కూటమితో పొత్తు విషయంపై పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా అధికార పార్టీ దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్న మరి కొన్ని పార్టీలకు కూడా నడ్డా ఇలాంటి లేఖలే రాసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాంటి వాటిలో బిజెపి మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంఝి నేతృత్వంలోని హిందుస్థాన్ అవామ్ మోర్చా ఒకటి. కాగా తనకు కూడా నడ్డానుంచి ఆహ్వానం అందిందని, ఈ నెల 18న జరిగే సమావేశానికి తాను హాజరవుతానని జితన్ రామ్ మంఝి కుమారుడు సంతోష్ కుమార్ సుమన్ పిటిఐకి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News