Wednesday, January 22, 2025

నడ్డా ఇది కెసిఆర్ అడ్డా: జేపీ నడ్డా వ్యాఖ్యలపై మంత్రి వేముల ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  నడ్డా ఇది కెసిఆర్ అడ్డా, ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్ కర్నూల్ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌పై చేసిన అసత్య ఆరోపణలపై మంత్రి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కేంద్రం ఇచ్చిన గణాంకాలు నయా పైసాతో సహా వివరించినప్పటికీ కుక్కతోక వంకర అన్నట్లు పదేపదే అవే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. వచ్చిన ప్రతిసారి తెలంగాణ అభివృద్ధిపై విషం చిమ్మే మాటలే చెబుతున్నారని, గుజరాత్ గులాంలైన ఇక్కడి బిజెపి నాయకులు రాసిచ్చిన పాత స్క్రిఫ్ట్‌నే ఎన్నిసార్లు చదువుతారని మంత్రి వేముల నిలదీశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందనడానికి బిజెపి నాయకులకు సిగ్గుండాలన్నారు. సిఎం కెసిఆర్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర సర్కారు పైసలు ఇవ్వనప్పటికీ అవార్డులు ఇస్తుందని తెలుసా అని ఆయన వారిని ప్రశ్నించారు.

కేంద్రం ఇచ్చింది రూ.1200 కోట్లు మాత్రమే
రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం రూ.12వేల కోట్లు ఖర్చు పెడితే కేంద్రం ఇచ్చింది రూ.1200 కోట్లు మాత్రమేనని మంత్రి తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న 1,59,372 ఇళ్లకు, ఒక్కో ఇంటికి రూ.1.5 లక్షల చొప్పున రూ.2,390 కోట్లు ఆర్థికసాయం చేస్తామని చెప్పినప్పటికీ రూ.1,201 కోట్లు మాత్రమే విడుదల చేశారన్నారు. ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బులో ఇది కేవలం 10 శాతం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. నగరంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కో ఇంటిని రూ.8,65,000ల వ్యయంతో నిర్మిస్తుండగా పిఎంఏవై ద్వారా రూ.1.50 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు సగం నిధులు మాత్రమే విడుదల చేసిందని ఆయన గుర్తు చేశారు.

కేంద్రం నుంచి పలు అవార్డులు, పురస్కారాలు
కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తెలంగాణ డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని ప్రశంసిస్తూ ప్రధాన మంత్రి అవార్డు, హడ్కో ఎక్సలెన్స్ 2018, హడ్కో ఎక్సలెన్స్ 2019, నిర్మాణాల్లో నూతన టెక్నాలజీ ఉపయోగించినందుకు ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణకు 2020 సంవత్సరానికిగాను కేంద్ర గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖ ఎక్సలెన్స్ అవార్డు ఇలా పలు అవార్డులు, పురస్కారాలు అందజేసిందని ఆయన గుర్తుచేశారు.

కాగితాల మీదనే రూ.1.21 లక్షల కోట్లు మంజూరు
తెలంగాణలో జాతీయ రహదారుల కోసం మోడీ ప్రభుత్వం కాగితాల మీద రూ.1.21 లక్షల కోట్లు మంజూరు చేసి తొమ్మిదేళ్లలో ఖర్చు చేసింది మాత్రం రూ.19 వేల కోట్లేనని మంత్రి వేముల విమర్శించారు. అవి కూడా రాష్ట్ర ప్రజల నుంచి టోల్‌ట్యాక్స్, సెస్‌ల ద్వారా ముక్కు పిండి వసూలు చేసిన పైసలేనని మంత్రి స్పష్టం చేశారు. కాగితాల మీద మంజూరు లెక్కలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్న బిజెపి నాయకులు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

రైతుబంధును కేంద్రం కాపీ కొట్టింది
సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధును కాపీ కొట్టి పెట్టిన కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధిలో రైతులకు కండీషన్లు పెట్టి రైతుల సంఖ్యను తగ్గించడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో రైతుబంధు పథకం ప్రారంభించినప్పుడు 49 లక్షల మంది రైతులు ఉండగా, నేడు లబ్ధిదారుల సంఖ్య 70 లక్షలకు చేరిందన్నారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వమన్నారు. కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 29 లక్షల మంది రైతులకు ఇప్పటివరకు రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు ఈ సీజన్ వరకు రూ.72 వేల కోట్లు ఖర్చు చేసిందని మంత్రి వేముల వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News