జనసేన తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం జనసేన పార్టీ కార్యాలయం ప్రకటన జారీ చేసింది. సాధారణ ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుంచి జనసేన తరపున ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి ఇచ్చారు. పొత్తు కోసం సీటును త్యాగం చేశారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం పని చేశారు. ఆ తర్వాత రాజ్యసభ సీటు వస్తుందనే ప్రచారం జరిగింది. అందులో సీట్లు తక్కువగా ఉండటంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇద్దామని సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.
తాజాగా శాసనమండలిలో ఐదు స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో ఒక స్థానం జనసేనకు దక్కనుంది. ఇప్పుడు ఆ సీటుకు నాగబాబు పేరుని ప్రకటించారు. నాగబాబుకు కార్పొరేషన్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగినా తాజా పరిణామాలతో వాటికి అడ్డుకట్ట పడింది. మంత్రివర్గంలోనూ నాగబాబుకు చోటు కల్పిస్తామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. ఆ విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. జనసేన జారీ చేసిన ప్రకటనలో ఎమ్మెల్సీగా నాగబాబు పేరుని ఖరారు చేశారని నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. మంత్రి పదవి విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకే వదిలి వేసినట్లు తెలుస్తోంది.