నాగార్జున సాగర్ 14 గేట్లు ఎత్తివేత
మన తెలంగాణ/హైదరాబాద్/నాగార్జున సాగర్: నాగార్జున సాగర్‌లో కృష్ణమ్మ సందడి మొదలయ్యింది. శ్రీశైలం నుంచి భారీగా వరదనీరు వస్తుండడంతో సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఈ మేరకు ఎన్‌ఎన్‌పి అధికారులు ఆదివారం మధ్యాహ్నాం క్రస్ట్ గేట్లను పరిశీలించి సాయంత్రానికి 14 గేట్లను ఎత్తారు. జలాశయం ఇన్ ఫ్లో 5,14,526 క్యూసెక్కులు ఉండగా, లక్ష క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, సాగర్ జలాశయంలో ప్రస్తుతం 585 అడుగులు మేర నీరు చేరింది. జలాశయంలో గరిష్ట నీటి నిల్వ 312.04 టిఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 295.90 టిఎంసీల నీరు నిల్వ ఉంది.
గంట గంటకు జలాశయంలోకి వరద ఉద్ధృ తి పెరుగుతున్నందున క్రస్ట్ గేట్లను అధికారులు ఎత్తారు. ఎడమ కాల్వకు నీరు విడుదల సాగర్‌కు వరద నీరు వస్తుండటంలో సాగర్ ఎడమ కాల్వకు ప్రజాప్రతినిధులు నీటిని విడుదల చేశా రు. వానాకాలం సాగు నిమిత్తం ఎడమ కాల్వకు నీటిని విడుద ల చేశారు. ఎంపి బడుగుల లింగయ్య, ఎమ్మెల్యే నోముల భగత్ ఎడమ కాల్వకు గేట్లు ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గతేడాది ఆగష్టు 11వ తేదీన సాగు నీటిని ఎడమకాలువకు విడుదల చేయగా, ఈసారి 10 రోజుల ముందుగా నీటిని విడుదల చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి
శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 5,04,086 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 5,30,175 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.50 అడుగులకు నీరు చేరింది. శ్రీశైలం జలాశంయ పూర్తి నీటి నిల్వ 215.80 టిఎంసీలు కాగా జలాశయంలో 207.41 టిఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి జలాశయానికి వరద వస్తుండటంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటికే సాగర్‌లోకి భారీగా వరదనీరు చేరడంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు 14 గేట్లను అధికారులు ఎత్తి కిందకు నీటిని విడుదల చేశారు.
ప్రకాశం బ్యారేజీకి 35,526 క్యూసెక్కుల వరద నీరు
ఎగువన ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజీకి 35,526 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. బ్యారేజీ 36 గేట్లు అడుగు మేర ఎత్తి 26,892 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వాటిలో 8,634 క్యూసెక్కుల నీటిని బ్యారేజీ నుంచి కాలువలకు వదులుతున్నారు. ఆదివారం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీకి సుమారు లక్ష క్యూసెక్కుల వరదనీరు రాగా, సోమవారం నాటికి అది 5 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసుల ఇబ్బందులు
శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. పెద్ద సంఖ్యలో సందర్శకులు జలాశయం వద్దకు చేరుకుంటున్నారు. వరదనీటిని చూడడానికి శ్రీశైలం టు -హైదరాబాద్ రోడ్డుపై అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో ఘాట్ రోడ్డుపై వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఇబ్బందులు పడ్డారు.
సాగర్‌కు భారీగా తరలివస్తున్న పర్యాటకులు
సాగర్ క్రస్టు గేట్లు ఎత్తడంతో చుట్టుపక్కల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. అధికారులు గేట్లు ఎత్తినప్పుడు ఆ ప్రవాహాన్ని చూసి వారు కేరింతలు కొట్టారు. భారీ ప్రవాహాం నేపథ్యంలో పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.