23న నోటిఫికేషన్…మే 2న ఫలితాలు
ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
దేశవ్యాప్తంగా 2 ఎంపి, 14 ఎంఎల్‌ఎ స్థానాలకు
ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
హైదరాబాద్ : నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. మార్చి 30 వరకు నామినేషన్లు స్వీకరణ, 31న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. ఏప్రిల్ 17న ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏప్రిల్ 17న తిరుపతి లోక్‌సభ స్థానానికి సైతం ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నాగార్జునసాగర్ ఎంఎల్‌ఎగా ఉన్న నోముల నర్సింహయ్య(టిఆర్‌ఎస్), తిరుపతి ఎంపిగా ఉన్న బల్లి దుర్గా ప్రసాద్ రావు(వైఎస్‌ఆర్‌సిపి) ఆకస్మిక మరణంతో ఆయా స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇసి ఫిబ్రవరి 26న షెడ్యూల్ విడుదల చేసింది.అదే రోజు నాగార్జునసాగర్, తిరుపతి ఉప ఎన్నికకు సైతం షెడ్యూల్ ప్రకటిస్తారని భావించినా, ప్రత్యేకంగా ఇసి మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఎపిలోని తిరుపతి, కర్ణాటకలోని బాల్గాంలో రెండు లోక్‌సభ స్థానాలతో పాటు నాగార్జునసాగర్‌తో కలిపి మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు ఇసి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. గుజరాత్, ఝార్ఖండ్, కర్ణాటక,మధ్యప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్, ఒడిషా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ఇదే షెడ్యూల్‌లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
ఎన్నికల కోడ్ అమలులోకి
నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నల్గొండ జిల్లా పరిధిలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియామావళిని కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌కు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని స్పష్టం చేశారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక షెడ్యూల్- వివరాలు
– మార్చి 23న నోటిషికేషన్
– నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ- మార్చి 30
– నామినేషన్ల పరిశీలన-మార్చి 31
– నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 3
– ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్
– మే 2న ఫలితాలు
Nagarjuna Sagar by-election on April 17