Monday, December 23, 2024

సైన్స్ నుంచి మీడియా వరకు అక్షయ వ్యాసుడు

- Advertisement -
- Advertisement -

ఆ మధ్య ఓ మధ్యాహ్నం ఆబిడ్స్ నవచేతన బుక్ షాపులో పుస్తకాలు చూస్తుంటే కరెంట్ పోయింది. ఇంతలో ఓ అబ్బాయి కొట్లోకొచ్చి “నాగసూరి వేణుగోపాల్ కొత్త పుస్తకం ఉందా?” అని అడిగాడు షాపులోని సేల్స్‌మేన్‌ని. ‘ఎవరబ్బా?’ అని ఆసక్తిగా అతన్ని చూస్తూ వుంటే, ఈ లోగా కరెంట్ వచ్చింది. ఓ యువకుడు అతను. అలా పాఠకులు వెతుక్కుని మరీ చదివే రచయిత నాగసూరి! ఆయన పేరులో ఓ తమాషా ఉంది. ‘నాగ’ శబ్దం… చురుకుదనానికి… జ్ఞానానికి ప్రతీక… ఇక ‘సూరి’ పాండిత్య సూచకం! ఇక వేణుగోపాల్… ఆయన శైలి పాఠక జన సమ్మోహనం… అలా పేరు కూడా సరిపోయింది. నాగసూరి రచనాశైలి, విషయం ఎంత గంభీరమైనదైనా, ఒక మిత్రుడు భుజంపై చేయి వేసి చెబుతున్నట్టు సాగుతుంది.

కాంతా సమ్మితంలా మిత్ర సమ్మితం ఆయన రచనా ధోరణి! ఇంగ్లీషులో ‘ప్రొలిఫిక్ రైటర్’ అన్న మాట వుంది. దానికి ‘ఎక్కువ రచనలు చేసే రచయిత’ అని అర్ధమైతే, దానికి ప్రత్యక్ష ఉదాహరణ వేణుగోపాల్. ఆయన తొలి రచన ఓ కవిత. అది 1978 సంవత్సరంలో ఆంధ్ర పత్రిక డైలీలో అచ్చయ్యింది. అలా మొదలైన ఆయన సాహితీ ప్రస్థానం నేటికి 70 పుస్తకాలుగా లెక్కకు తేలింది. ఇది సాధారణ విషయం కాదు. ‘వేగం’… బహుశా నాగసూరి రచనా విజయ రహస్యం!
కొన్నేళ్ల క్రితం విశాఖ బీచ్‌లో ప్రతి రోజూ ఉదయం నడిచేవాళ్లం, నేనూ ఆయన ఏవో సాహిత్య సంగతులు ముచ్చటించుకుంటూ. ఒక వైపు మాట్లాడుతనే ఏదో ఆలోచన సాగించేవారు… Making an article while walking అన్నమాట! ఇంటికి రాగానే ఆ ఆలోచన కాగితంపై ఓ వ్యాసంగా రూపొందేది… మరో గంటలో కొరియర్ బాయ్ చేతిలో వుండేది… మరుసటి వారం ఏదో పత్రికలో ప్రత్యక్షమయ్యేది. కాలాన్ని వృధా పరచకపోవడం, బద్ధకాన్ని దరి చేరినివ్వకపోవడం, ఆలస్యం చేయకుండా వచ్చిన ఆలోచనను అక్షరీకరించడం, చదవడం కూడా కేవలం కావలసిన వాటినే ఎంపిక చేసుకుని చదవడం… ఆయనలో నేను గమనించిన లక్షణాలు. ఒక వైపు పుస్తకాలు ప్రచురిస్తూనే ఎన్నో వ్యాసాలు, పలు పత్రికల్లో కాలవ్‌‌సు నిర్వహించడం… ఇంకో వైపు ఉద్యోగ రీత్యా ఆకాశవాణిలో రచయితల్ని, కళాకారుల్ని సమన్వయపరుస్తూ, ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన, వాటి నిర్వహణ… ఇదో అష్టావధానమే… కాకపోతే ఆయనకి ఇష్టావధానం…

టైం మేనేజ్‌మెంట్ తెలిసిన రచయిత నాగసూరి. వివిధహోదాల్లో ఎన్నో ఆకాశవాణి కేంద్రాల్లో పని చేశారు వేణుగోపాల్. ఎక్కడికి వెళ్లినా, ఆ ప్రాంతాల గురించి సమగ్రంగా తెలుసుకుని, ఆయా ప్రాంతాల సాహితీవేత్తలతో పరిచయాలు పెంచుకుని, ఆకాశవాణి కోసం వారి నుండి మంచి సృజనను రాబట్టుకోవడం ఆయన పద్ధతి. నాగసూరి విశాఖ కేంద్రానికి బదిలీపై వచ్చిన కొత్తల్లో ఈ వ్యాస రచయిత దగ్గర నుండి రాజమహేంద్రవరం పై వచ్చిన రెండు పుస్తకాలు తీసుకుని చదివారు. ఆ ప్రాంతం ఆకాశవాణి విశాఖ జోన్ లోనికి వస్తుంది.నాగసూరి మదరాసు కేంద్రంలో పని చేస్తున్నప్పుడు ఆయన రూపొందించిన కార్యక్రమాలు అక్కడి తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ కేంద్రాలు ప్రసారం చేసిన కార్యక్రమాల్లో మేలైన వాటిని ఎంచి మదరాసు కేంద్ర శ్రోతల వీనులకు విందు చేసేవారు. ఆ సమయంలో ‘మదరాసు తెలుగు’కు సాహిత్యంలో పట్టం కడుతూ ‘మదరాసు బదుగులు’ అన్న కథా సంకలనాన్ని అక్కడి తెలుగు పెద్దలతో కలిసి ప్రచురించారు. ‘దక్షిణాంధ్ర, దారి దీపాలు’ అనే అపురూపమైన పుస్తకం వెలుగు చూసింది ఆ సమయంలోనే.
నాగసూరి వేణుగోపాల్ విజయవాడ కేంద్రంలో పని చేస్తున్నప్పుడు తెలుగు సాహిత్యంలో అనర్ఘ రత్నాల్లాంటి 100 పుస్తకాల పరిచయం కార్యక్రమం ప్రసారం అయ్యింది. దాని రూపకర్తలలో వేణుగోపాల్ ఒకరు. ఈ కార్యక్రమంలో ‘మహాప్రస్థానం’ను జ్వాలాముఖి, ‘మైదానం’ను శ్రీమతి పి. సత్యవతి, ‘శివతాండవం’ను వల్లంపాటి, ‘పెన్నేటి పాట’ను భూమన్, ‘వేయి పడగలు’ను ప్రసాదరాయ కులపతి, ‘ప్రజల మనిషి’ని సి. రాఘవాచారి, ‘చివరికి మిగిలేది’ని వేగుంట పరిచయం చేశారు. తర్వాత ఇది పుస్తక రూపం పొందడానికి నాగసూరి పూనిక ప్రధానం. ఈ పుస్తకం ప్రముఖ గ్రంథాలయాల్లో ఒక రిఫరెన్స్ బుక్‌గా వెలుగొందుతోంది. రచనల జాబితా పరిచయకర్తల పేర్లు గమనిస్తే, ఈ పుస్తకం విలువ ఏమిటో వేరే చెప్పనవసరం లేదు. ఇదో మాగ్నం ఓపస్!
పాపులర్ సైన్స్ రంగంలో ఎన్నో రచనలు చేశారు నాగసూరి. ‘సైన్స్ వీక్షణం’, ‘మూఢనమ్మకాలుసైన్స్’, ‘సైన్స్ క్యాలెండర్’, ‘సైన్స్ ధ్రువతారలు’, ‘ద్రావిడ శాస్త్రవేత్తలు’ వీటిలో కొన్ని. సాహిత్య అకాడమీ కోసం తెలుగులో అపురూపమైన సైన్స్ ఫిక్షన్ గురించి “వైజ్ఞానిక కథలు” అన్న సంకలనం తన భాగస్వామ్యంలో తెచ్చారు.

‘శ్రీశ్రీ లో ఒక “శ్రీ” సైన్స్’ వ్యాసం ఆయన విలక్షణ దృష్టికి, సునిశితకు నిదర్శనంగా నిలుస్తుంది. పాఠకుల్లో పర్యావరణంపై అవగాహన కలిగించే అనేక పుస్తకాలు ప్రచురించారు వేణుగోపాల్. ‘ప్రకృతివికృతి’ ‘ప్రకృతిపర్యావరణం’ ‘పర్యావరణంసమాజం’… వీటిలో కొన్ని. అలాగే విహారితో కలిసి ‘పర్యావరణం కథలు’ సంకలనంగా తెచ్చారు. సాహిత్య విమర్శ రంగంలో కూడా వేణుగోపాల్ కృషి చేశారు. ఆయన సంపాదకత్వాన తెలుగు విశ్వవిద్యాలయం తరఫున ‘నేటికీ శ్రీపాద’ ప్రచురించారు. ‘సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘వెలుగు జాడ’ ‘శ్రీపాద ప్రబుద్ధాంధ్ర పోరాటాలు’ ఆయన సంపాదకత్వం వహించిన కొన్ని పుస్తకాలు. అనువాదాలు కూడా కొన్ని చేశారు ఆయన. ‘సామాజిక మార్పు కోసం విద్య’ కలాం గారి పుస్తకం ‘ఇండియా 2020’ ఆయన చేసిన అనువాదాలు. ఇక మీడియా రంగంపై సాధాధికారంగా వ్యాఖ్యానించగల కొద్ది మందిలో నాగసూరి ఒకరు. అది ప్రింట్ మీడియా కావొచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావొచ్చు,

ముఖ్యంగా శాటిలైట్ ఛానల్స్‌పై ఆయన పరిశీలనలు ఎన్నదగినవి. మీడియాపై ఆయన నిర్వహించిన కాలవ్‌‌సు తర్వాత పుస్తకరూపం సంతరించుకుని, జర్నలిజం విద్యార్ధులకు పాఠ్యగ్రంథాలుగా మారాయి. ఇప్పుడు మహాత్మా గాంధీ గురించి పత్రికల్లో కాలవ్‌‌సు నిర్వహిస్తూ, అనేక వ్యాసాలు రాస్తూ, వివిధ వ్యక్తులతో వ్యాసాలు రాయిస్తూ వున్నారు. ఇక్కడో సరదా సంగతి… ఓసారి విశాఖ ఆకాశవాణి కేంటీన్‌లో నాగసూరితో కలిసి ఈ వ్యాసకర్త టీ తాగుతున్నాడు. ఏదో సాహితీ చర్చ మా మధ్య. సందర్భవశాత్తు… “మీరు వ్యాస మహర్షి” అని అన్నాను. ఆ చమత్కారానికి చాలా సంతోషపడ్డారు నాగసూరి. నిజానికి వ్యాస ప్రక్రియ అనేది ఒక రకంగా “డ్రై” ప్రక్రియ. దానిలో పద చిత్రాలు, భావ చిత్రాలు, ప్రతీకలు లాంటి అలంకరణ సామాగ్రి వుండదు. కేవలం ‘విషయం’తోనే పాఠకుణ్ణి ఆకట్టుకోగలగాలి. ఈ విద్యలో నాగసూరి ఆరితేరినవాడు. నాగసూరి తను సేకరించిన పుస్తకాలను, పేపర్ కటింగ్స్‌ను, వాటి అవసరం తీరాక వాటిని

అలా వదిలేయక, బ్రౌన్ లైబ్రరీ లాంటి ప్రముఖ గ్రంథాలయాలకు బహుకరిస్తారు. ప్రతి సాహితీవేత్త పాటించవలసిన పని ఇది. భావి తరాలకు పరిశోధక విద్యార్ధులకు ఎంతో ప్రయోజనకరమైనది. నాగసూరి స్నేహశీలి. ఆకాశవాణిలో రికార్డింగ్ పూర్తి కాగానే డ్యూటీ రూంలో ఆర్టిస్ట్‌కి పారితోషికం చెక్కు రూపంలో ఇచ్చేవారు. (ఇప్పుడు నేరుగా ఎక్కౌంట్‌కి బదిలీ చేస్తున్నారు) ఆ సందర్భంలో ఆర్టిస్టు రెవెన్యూ స్టాంప్‌పై సంతకం చెయ్యాల్సి వుంటుంది. చాలా మంది వాటిని తీసుకురావడం మర్చిపోయి ఇబ్బంది పడేవారు. నాగసూరి తన దగ్గర కొన్ని స్టాంపుల్ని వుంచుకుని, అలాంటి వారిని ఆదుకునేవారు. సాయం చిన్నదే… కాని ఆ సందర్భంలో అది ఎంతో అవసరం!… నాగసూరి వేణుగోపాల్ శ్రీమతి పేరు హంసవర్ధిని. ఆమె వేణుగోపాల్ జీవితంలోనే కాదు సాహిత్య సృజనలో కూడా అర్ధ భాగమే అని చెప్పాలి. ఆయన అభివృద్ధికి ఆమె ప్రోత్సాహం ఎంతో వుంది.

ఒక గ్రంథ రచనలో హంస గారు సహ భాగస్వామ్యం వహించి ‘జంట రచయితలు’ అని పెంచుకున్నారు. ఎందరో సాహితీవేత్తలకు ఆ దంపతులు ఆతిథ్యం ఇచ్చి ఆదరిస్తూ వుంటారు. చిత్తూరు, అనంతపురం వంటకాలు ఆ విందుల్లో చోటు చేసుకుంటూ వుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News