వ్యభిచారంపై శాశ్వత నిషేధం
నాగపూర్ సిపి నోటిఫికేషన్ జారీ
నాగపూర్: మహారాష్ట్రలోని గంగా జమున ప్రాంతంలో వ్యభిచారాన్ని పోలీసులు శాశ్వతంగా నిషేధించారు. పేరుమోసిన రెడ్ లైట్ ఏరియాలో సెక్స్ వర్కర్లు బహిరంగంగా విటులతో బేరసారాలు సాగిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నాగపూర్ పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ శనివారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీచేస్తూ 90 రోజుల్లోపల ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఇమ్మోరల్ ట్రాఫిక్(ప్రివెన్షన్) యాక్ట్‌కు చెందిన వివిధ నిబంధనల కింద ఈ నోటిఫికేషన్ జారీచేశారు. వివిధ మతాలకు ప్రార్థనా స్థలాలు, స్కూళ్లు, ఆఫీసులను బహిరంగ ప్రదేశాలుగా ప్రకటిస్తూ వీటికి 200 మీటర్ల పరిధిలో వ్యభిచారాన్ని నిషేధిస్తున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు. తొలుత..ఈ ప్రాంతంలో వ్యభిచారాన్ని రెండు నెలల పాటు నిషేధిస్తున్నట్లు ఆగస్టు 25న కమిషనర్ ప్రకటించారు. దీనిపై సెక్స్ వర్కర్లు తీవ్ర నిరసన తెలిపారు. విటులు ప్రవేశించకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సెక్స్ వర్కర్లు తొలగించి ఆందోళన చేశారు. దాదాపు 500 నుంచి 700 మంది సెక్స్ వర్కర్లు ఉండే ఆ ప్రాంతంలో ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీలు కూడా చేశారు. ఆ ప్రాంతంలో మొత్తం 188 వేశ్యా గృహాలు ఉన్నట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు.