దీపావళి వెళ్లిన నాలుగో రోజు అంటే కార్తీకమాసం శుక్లపక్ష చవితి రోజున నాగుల చవితి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీపావళి రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక దీపం వెలిగించి చిన్నపిల్లల చేత గోగు(గోంగూర మొక్క) కాడలకు నూనె వత్తులు కట్టి వెలిగించి మూడుసార్లు నేలపై కొట్టిస్తారు. అప్పుడే వారి చేత ఇలా చెప్పిస్తారు. దుబ్బుదుబ్బు దీపావళి…మళ్లీ వచ్చెను నాగుల చవితి..అని. అంటే దానికి అంతటి ప్రాశస్థ్యం ఉన్నదన్నమాట.
శుక్రవారం (ఈ నెల 17వ తేదీ)న నాగుల చవితి పండగ. ఆ రోజు ఉదయం ఆవుపాలు, చక్కెర లేదా బెల్లం, పూలు, పండ్లు, వంటి సామగ్రి తీసుకుని నియమ నిష్ఠలతో పిల్లలతో సహా సమీపంలోని పుట్టల వద్దకు చేరుకుని అందులో పాలు పోసి, మిగతావి నివేదనగా ఉంచుతారు. పిల్లలు బాణసంచా కాలుస్తూ ఆనందిస్తారు. అనంతరం పుట్టమన్ను తీసుకుని పిల్లల చెవుల దిగువ భాగంలో కొంత రాస్తారు. పిల్లలకు ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడమని, అలాగే, ఎక్కడైనా కనిపించినా, లేక పొరపాటున తొక్కినా కనికరం చూపమని నాగదేవతను మహిళలు ప్రార్ధిస్తారు. పుట్టలకు వెళ్లలేని వారు తమ ఇంట్లోనే పూజామందిరంలో గోడకు పసుపు రాసి కుంకుమతో మూడు నిలువు గీతలు గీసి పాము ఆకారంగా భావించి దానికే పూజాదికాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చలిమిడి (బియ్యం, బెల్లంతో చేసిన తీపిపదార్థం), చిమ్మిలి(నువ్వుల పప్పు,బెల్లంతో చేసినది) నివేదనగా చెల్లిస్తారు. కొందరు మహిళలు ఆరోజు ఉపవాసదీక్ష కూడా పాటిస్తారు. కార్తీక మాసంలో వచ్చే మొదటి పండగ ఇదే.