Monday, December 23, 2024

పోరాటాల గడ్డ నల్గొండ

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : ఎంతో చరిత్ర కలిగిన పోరాటాల గడ్డ నల్గొండ ఉమ్మడి జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తప్పుడు లెక్కలు, మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆదివారం పిపుల్స్ మార్చ్ యాత్ర సూర్యాపేట జిల్లాలో రెండోరోజు ప్రారంభానికి ముందు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోట్లా తెచ్చుకున్న తెలంగాణ ప్రజల జీవితాల్లో ఏలాంటి మార్పు లేకపోగా పాలకుల్లో మాత్రం వేల కోట్ల రూపాయలతో కూడిన సంపద పెరిగిందని ఆరోపించారు.

అపారమైన సంపదను ప్రజలకు చెందనివ్వకుండా దోచుకోని వేల కోట్ల రూపాయల ఆస్తులు, వందల ఎకరాల ఫాంహౌజ్‌లు వారి స్వంతమయ్యాయని అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డిన పోరాటాల గడ్డలో భీమిరెడ్డి నర్సింహ్మారెడ్డి, రావి నారాయణరెడ్డి, సర్దార్ చకిలం శ్రీనివాస్‌రావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి లాంటి నాయకులు ప్రజల కోసం పని చేయగా రెండో తరంగా కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఆ నాటి నుండి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉన్న నాయకులంత ఆస్తులు పోగొట్టుకోని ప్రజల కోసం పని చేయగా ఈ నాటి నాయకులు ఆస్తులు పెంచుకోవడమే లక్షంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు.

దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనం ఖర్చు చేయడమే తప్పా ఏం సాధించారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కేసీఆర్ ప్రభుత్వ అవినీతి కోసం రూపొందించిందే తప్పా ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట జిల్లా ప్రజలకు చుక్కనీరైన అందించారని అని ప్రశ్నించారు. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం లాంటి ప్రాజెక్టుల నుండి ఎస్సారెస్పీకి నీరు ఏ విధంగా తీసుకవచ్చారో వివరించాలన్నారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వించిన ఎస్సారెస్పీ కాల్వలలో పూలు, పసుపు, కుంకుమలు చల్లి పండుగలు చేస్తున్న బీఆర్‌నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పూణ్యమే అన్నారు. ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల్లో రెండు గదుల ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి ఎంతమందికి ఇచ్చారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్త సుఖేందర్‌రెడ్డిలు మేము వేసిన రోడ్లపైనే పాదయాత్ర చేస్తున్నారని మాట్లాడిన తీరుపై హైద్రాబాద్ నుండి తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకు వస్తున్న రోడ్లు ఎవ్వరు వేశారో గుర్తు చేసుకోవాలన్నారు.

రాష్ట్రం తెచ్చుకుంది నీళ్లు, విద్యుత్ కోసమే కాని ప్రస్తుతం ఆ రెండు అందుబాటులో లేవన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పి కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలు ఎక్కువయ్యేయే తప్పా భూ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ధరణిలోని లోపాలను సరిచేసి రైతులకు అండగా నిలుస్తామన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్‌లు రెండు ఒక్కటేనని, ఒకరికోకరి విమర్శలు చేసుకుంటూ అంతర్గత ఒప్పందంతో కలిసి ముందుకు సాగుతున్నారని, పార్లమెంట్‌లో ఏ ఎన్నికలు వచ్చిన బీఆర్‌ఎస్ బిజెపికే ఓట్లు వేస్తున్న విషయం తెలిసిందే అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విషయమై మాట్లాడుతూ అతని గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని పరిపక్వత లేని నాయకునిగా అభివర్ణించారు.

బిఆర్‌ఎస్, బిజెపిల పార్టీల బంధంను ప్రజలు అర్ధం చేసుకోని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వందకుపైగా సీట్లు గెలవడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, సీని నిర్మాత, నటుడు బండ్ల గణేష్, పాదయాత్ర ఇన్‌చార్జీ అజ్మతుల్లా, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి, నాయకులు జి నిరంజన్, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధులు చకిలం రాజేశ్వర్‌రావు, ధరావత్ వెంకన్న నాయక్, అన్నెపర్తి జ్ఞానసుందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తండు శ్రీనివాసరావు, గుడిపాటి నర్సయ్య, డాక్టర్ రామచంద్రు నాయక్, రవి బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News