Friday, December 20, 2024

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదైంది. నల్గొండ వన్ టౌన్ స్టేషన్ లో 506 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ కొడుకు సుహాస్‌ను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ లో బెదిరించినట్లుగా ఉన్న ఆడియో క్లిప్ కలకలం సృష్టించిన విషయం విదితమే. చెరుకు సుధాకర్ ని తన అభిమానులు చంపేస్తారంటూ ఆయన కుమారుడు సుహాస్ కి ఫోన్ లో వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిన్ను కూడా చంపుతారని, నీ ఆసుపత్రిని కూడా కూల్చేస్తారని సుహాస్ ని బెదిరిస్తున్నట్లుగా ఉన్న ఆడియోపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి.

ఎంపి వెంకట్ రెడ్డిపై నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వారావుకు చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ వివాదం గాంధీ భవన్ కు చేరింది. తనను, తన కుమారుడిని చంపుతానంటూ బెదిరించిన కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ డాక్టర్ చెరుకు సుధాకర్ పిసిసి క్రమశిక్షణ చర్యల అమలు కమిటీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏనాడూ కోమటిరెడ్డిపై విమర్శలు చేయలేదని వెల్లడించారు.

ఆయన తన గురించి మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయని వాపోయారు. కెవిఆర్ మాటలు క్రిమినల్ ఆలోచనతోనే ఉన్నాయని చెప్పారు. తనకు కోమటిరెడ్డితో ఎలాంటి వైరం లేదన్నారు. బిసి నాయకుడిని చంపేస్తానని బెదిరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత ఈరవత్రి అనిల్ అన్నారు. తాను ఉత్తమ్‌ను ఏదో అన్నానని షోకాజ్ నోటీసు ఇచ్చారని, ఇప్పుడు కోమటిరెడ్డికీ నోటీసులు ఇవ్వాల్సిందేనన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News