Saturday, November 16, 2024

పట్టభద్రులు పట్టం కట్టేదెవరికో..?

- Advertisement -
- Advertisement -

ఉదయం 8గంటల నుంచి సాయంత్రం
4గంటల వరకు పోలింగ్ బరిలో 58మంది
అభ్యర్థులు పోటీలో తీన్మార్
మల్లన్న (కాంగ్రెస్), రాకేష్‌రెడ్డి (బిఆర్‌ఎస్),
ప్రేమేందర్‌రెడ్డి (బిజెపి)
జూన్ 5న ఓట్ల లెక్కింపు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వరంగల్ -ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎంఎల్‌సి ఉపఎన్నిక పోలింగ్ సోమవారం ఉదయం 8 గం టల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మూ డు ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు ఎంఎల్‌సి ఉపఎన్నికలో తమ ఓటు హ క్కును వినియోగించుకోనున్నారు. పట్టభద్రుల ఎంఎల్‌సి బరిలో మొత్తం 52 అభ్యర్థులు ఉండగా, ఈ నియోజకవర్గం పరిధిలో 4,63,839 మం ది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. అందులో 2,88,289 మం ది పురుషులు, 1,75,645 మంది మహిళలు, ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. పట్టభద్రుల స్థానాల ఎన్నికల కోసం మూడు జిల్లాల్లో 191 మండలాల్లో 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఈ ఎన్నిక కోసం మొత్తం 1,448 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. వారిలో 724 మంది పిఒలు ఉండగా, 724 మంది ఒపిఒలు ఉన్నారు. పోలింగ్ సామాగ్రిని అధికారులు ఆయా జిల్లాల కేంద్రాల నుంచి పంపిణీ చేశారు. దినపత్రిక పరిమాణంలో ఉన్న బ్యాలెట్ పత్రం, ఓటు వేసేందుకు వినియోగించే ఊదారంగు స్కెచ్ పెన్, ఓటర్ల జాబితా సహా ఇతర ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి అందించారు. 2021లో జరిగిన ఎంఎల్‌సి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ తరఫున అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎంఎల్‌ఎగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు.

దీంతో ఆయన తన ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేయడంతో పట్టభద్రుల ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ పోరులో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, గులాబీ పార్టీ ఎంఎల్‌సి అభ్యర్ధిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి, బిజెపి అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా అశోక్‌కుమార్ తదితరులు పోటీ చేస్తున్నారు. ఎంఎల్‌సి ఉప ఎన్నికకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గంలో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు.

ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్ధిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సీఎల్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎంఎల్‌సి ఎన్నికలకు ప్రైవేట్ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని చట్టంలో లేదని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సిఇఒ సూచించారు. ప్రైవేట్ కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ సిబ్బంది ఓటు వేసేందుకు వీలుగా షిఫ్టుల సర్దుబాటు లేదా ఆలస్యంగా వచ్చేందుకు లేదా మధ్యలో వెళ్లి ఓటు వేసి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కోరారు.

పొరపాట్లకు తావులేకుండా చర్యలు

వరంగల్ – ఖమ్మం – నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయా జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాలను జిల్లా కలెక్టర్లు పరిశీలించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియను పంపిణీ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రి పక్కాగా అందించాలని, చెక్ లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందించారా లేదా అన్నది సరిచూసుకోవాలని తెలిపారు. పోలింగ్ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. పోలింగ్ సిబ్బంది, పరికరాలు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను, వాటికి అమర్చిన ట్రాకింగ్ పరికరాలను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాల వద్దకు సిబ్బందిని చేరుకునేలాగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

ఎండల తీవ్రత, వర్ష సూచన నేపథ్యంలో ఏర్పాట్లు

రాష్ట్రంలో ఎండల తీవ్రత, వర్ష సూచన నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్ పెట్టెల రవాణాకు పటిష్టమైన భద్రత కల్పించడంతో పాటు ఓటర్లను మంచినీళ్లు, కనీస వసతులు సహా ర్యాంపులు, వీల్ చైర్లు అందుబాటులో ఉంచనున్నారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News