మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యాసంస్థల్లో సహ అనుభూతి పెంపొందించడం ద్వారా వివక్షకు స్వస్తి పలకాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ విద్యాసంస్థలకు పిలుపునిచ్చారు. విద్యాసంస్థల్లో దళితులు, ఆదివాసీ వర్గాలకు చెందిన విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు సర్వసాధారణమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బాంబే ఐఐటీలో దళిత విద్యార్థి ఆత్మహత్య ఘటనను సిజెఐ ప్రస్తావించారు. దళిత, ఆదివాసీ విద్యార్థులు ఒత్తిడికి లోనై చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించారు. వారిపై సహ అనుభూతి లేకపోవడమే వివక్షకు కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి విషయంలో ప్రభుత్వాలు, విద్యాసంస్థలు సరైన ప్రాధాన్యత కల్పించి వివక్షకు స్వస్తి పలికేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యాసంస్థలు విద్యార్థుల మధ్య పోటీని ప్రోత్సహించడంలో తమను తాము పరిమితం చేసుకోకుండా, విద్యార్థుల మధ్య సహా అనుభూతులను పెంపొందించేలా కృషి చేయాలని చెప్పారు. న్యాయమూర్తులు ఇలాంటి వాటి పట్ల సరైన తీర్పులు వెలువరించాలని పిలుపునిచ్చారు.
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 19వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అధ్యక్షత వహించారు. వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరాయ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.విద్యుల్తతారెడ్డి, న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిజెఐ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, న్యాయస్థానాలకు వచ్చే న్యాయ విద్యార్థులు న్యాయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. మహిళలు న్యాయస్థానంలో కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. సమాజంలో చాలామంది న్యాయం కోసం చివరికి వచ్చేది న్యాయస్థానాలకేనని అన్నారు. న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల పాత్ర కీలకమైనదని, కొవిడ్ సమయంలో కూడా న్యాయమూర్తులు చాలా బాగా పనిచేశారని గుర్తు చేశారు.
తన చదువుకున్న రోజులతో పోల్చితే ప్రస్తుత తరం విద్యార్థులకు సమాచారం, విజ్ఞానాన్ని పొందడానికి విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో న్యాయ శాస్త్ర పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు 1950 నుంచి 2023 వరకు ఇచ్చిన తీర్పులను ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చామని, ప్రత్యక్ష ప్రసారాలు కూడా అందుబాటులో తెచ్చామని చెప్పారు. ప్రస్తుతం ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, యూట్యూబ్ పాఠాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయని, ఇది విద్యార్థులు తమ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని దోహదం చేస్తాయని తెలిపారు.
మరిన్ని న్యాయ విద్యాసంస్థలు రావాలి
దేశంలో మరిన్ని న్యాయ విద్యా సంస్థలు రావాలని ఆకాంక్షించారు. న్యాయ విద్య విస్తృతంగా ఉండాలని చెప్పారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు న్యాయ విద్యలో అగ్రగామిగా ఉంటూనే ఇతర అన్ని న్యాయ కళాశాలలు ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేయాలని అన్నారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాయాలు అన్ని వర్గాలకు అందుబాటులో ఉండటం లేదని చెప్పారు. ప్రవేశ పరీక్ష, ఇంగ్లీష్ పరిజ్ఞానం, అధిక ఫీజులు వంటి కారణాలతో గ్రామీణ, దిగువ వర్గాలల విద్యార్థులకు అందుబాటులో ఉండటం లేదని, ఇందులో మార్పు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ వర్సిటీలు సాధారణ సంప్రదాయ న్యాయ కళాశాలలకు తోడ్పాటు అందించాలని తెలిపారు.
విద్యార్థులు తమ చదువులు పూర్తయిన తర్వాత కేవలం అధ్యాపకులనే మాత్రమే కాకుండా వారు చదువుకున్న సంస్థ అభివృద్ధికి పాటుపడిన సహాయక సిబ్బంది, కార్మికుల శ్రమను కూడా గుర్తుంచుకోవాలని కోరారు. జీవించే హక్కులో భాగంగా సుప్రీం కోర్టు గుర్తించిన వ్యక్తి గౌరవ అనే భావానికి ఇది నిజమైన అర్థమని వ్యాఖ్యానించారు. 25 సంవత్సరాలుగా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్న నల్సార్ యూనివర్సిటీ నాయకత్వాన్ని అభినందించారు. ఈ వర్సిటీ రజతోత్సవ వేడుకల సమయంలో, సమాజానికి సంబంధించిన సమస్యల గురించి ఆలోచించే అవకాశంగా ఉపయోగించుకోవాలని అన్నారు. న్యాయ శాస్త్ర విద్యార్థులు లా సబ్జెక్టులతో పాటు ఇతర విషయాలను విస్తృతంగా చదివే అలవాటును విద్యార్థులు పెంపొందించుకోవాలని సూచించారు.
న్యాయం అందించడంలో సానుభూతి కీలకమైన అంశం
న్యాయస్థానాలు ధనిక, పేద అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తాయని స్పష్టం చేశారు. చట్టం అమలు,న్యాయం అందించడంలో సానుభూతి అనేది చాలా ముఖ్యమైన అంశం అని, ఇది న్యాయమైన సమాజాన్ని అన్యామైన స్థితి నుండి వేరు చేస్తుంది అన్నారు. న్యాయం అందించడంలో సానుభూతి,దయాగుణం కీలకమని వ్యాఖ్యానించారు. మోటారు ప్రమాద కేసులను పరిష్కరించేటప్పుడు, దానిలోని సాంకేతిక అంశాలను మానవీయ సహానుభూతి దృష్టితో సమతూకం వేస్తూ సుప్రీం కోర్టు సానుభూతితో మిళితం అయిన తీర్పులు ఇస్తుంది సిజెఐ ఉదహరించారు.
ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామ సుబ్రహ్మణ్యన్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఎస్‌ఎస్‌ఎం ఖాద్రీ, జస్టిస్ పివి రెడ్డి, పలువురు సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్సార్ నుంచి డిగ్రీ, పిజి, పిహెచ్‌డి పూర్తి చేసి విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. తన్వీ ఆప్టే అనే బిఎ ఎల్‌ఎల్‌బి(ఆనర్స్) విద్యార్థిని 13 బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. ఇదే కోర్సుకు చెందిన మరో విద్యార్థి మంజ్రీ సింగ్ 10 బంగారు పతకాలు సాధించారు. ప్రతిభ కనబరిచిన 58 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, పరిశోధనలో ప్రతిభ చూపిన అధ్యాపకులకు ప్రశంసా పత్రాల ప్రదానం చేశారు.ఈ సందర్భంగా న్యాయవాద డిగ్రీ పట్టాలు పొందిన విద్యార్థులకు సిజెఐ అభినందనలు తెలిపారు.