హైదరాబాద్ : అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతూ సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై బిఆర్‌ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు లోక్‌సభలో పెద్దఎత్తున మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా గత ఐదేళ్లలో చారిత్రాత్మకంగా అసాధారణమైన రీతిలో పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచడం వాస్తవం కాదా? అని కేంద్రాన్ని లిఖితపూర్వకంగా నిగ్గదీశారు. మధ్య తరగతి ప్రజలపై ఇబ్బడిముబ్బడిగా మోయలేని భారాలను వేస్తుండడాన్ని ఈ సందర్భంగా నామా తీవ్రంగా ఆక్షేపించారు. పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించ డానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో వివరించాలని పేర్కొన్నారు.
ధరల ప్రభావం పేద, మధ్య తరగతి ప్రజలపై విపరీతంగా ఉంటుందని, వీటి ప్రభావం మిగతా రంగాలపై కూడా పడడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి రామేశ్వర్ తెలి సమాధానం ఇస్తూ పెట్రో ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో సంబంధిత ఉత్పత్తుల ధరలతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. అధిక అస్థిరత, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా చాలా దేశాలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని చెప్పుకొచ్చారు. ధరలను నియంత్రించేందుకు పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించామన్నారు. ద్రవ్యోల్బణం తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు.