శ్రీలంక లోని రాజపక్సా కుటుంబం మరోసారి దేశాధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచింది. తమ కుటుంబ వారసుడైన నమల్ రాజపక్సా శ్రీలంక పొదుజన పెరమున (ఎస్‌ఎల్‌పీపీ) పార్టీ తరఫున దేశ అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి సాగర కరియవసామ్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో అధ్యక్ష పీఠానికి నలుగురు ప్రధానంగా పోటీ పడనున్నారు. ఇప్పటికే ప్రస్తుత అధ్యక్షుడు విక్రమసింఘే , ప్రతిపక్ష నేత సజిత ప్రేమదాస, జీవీపీ నాయకుడు అరుణ కుమార దిశనాయకే బరిలో ఉన్నారు. 2022 జులైలో విక్రమసింఘేకు అధికారం దక్కేలా రాజపక్సా కుటుంబమై సహకరించింది.
ఆయన గొటబాయ నుంచి అధికారం స్వీకరించారు. 2022 ఏప్రిల్ మధ్య కాలంలో శ్రీలంకలో ఆర్థికసంక్షోభం తీవ్రం కావడంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగి ,అధ్యక్ష భవనం కూడా ఆందోళన కారుల ముట్టడికి గురైంది. గొటబాయ తన పదవిని వదులుకోవలసి వచ్చింది. దీంతో విక్రమ సింఘే అధికారంలోకి వచ్చారు. తాజాగా ఎస్‌ఎల్‌పిపికి చెందిన దాదాపు 100 మంది ఎంపీలు రాజపక్సాకు మద్దతు ఇవ్వడంతో నమల్ అధ్యక్ష అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. వ్యాపార వేత్త దమ్మిక పెరేరాను ఎస్‌ఎల్‌పీపీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయించాలని మొదట అనుకున్నారు. కానీ ఆయన పోటీకి ఇష్టపడలేదు. దీంతో నమల్ పేరును ప్రకటించారు. మహీందా రాజపక్సా కుమారుడే నమల్.