భారతదేశ చట్టసభ అయిన నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పేరు పెట్టడం అంటే ఈ దేశ ప్రజలు తమను తాము గౌరవించుకోవడమే అవుతుంది. ఆయన మన దేశానికి దార్శనికునిగా, మార్గదర్శిగా భారత రాజ్యాంగం ద్వారా దిశానిర్దేశం చేసిన ప్రపంచ మేధావి, మహాజ్ఞానినీ గౌరవించుకోవడానికి ఇంతకన్నా మంచి సందర్భమేముంటుంది. ఒకవైపు దేశ విదేశాలు, ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు అంబేడ్కర్ సేవలను, త్యాగాలను కీర్తిస్తుంటే మన దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వాలు వారికి సమున్నత గౌరవాన్ని కల్పించడంలో నేటికీ విఫలమవుతున్నాయి.
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రమైతే వచ్చింది కానీ దేశ శాసన వ్యవస్థ హక్కులు, విధులు, కార్యనిర్వహక వ్యవస్థలు నిర్ణయించబడ లేదు. దేశాన్ని పరిపాలించుకోవడానికి రాజ్యాంగ చట్టం అవసరం అందుకోసం 1947 ఆగస్టు 29న రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని రచించడానికి డ్రాఫ్టింగ్ వేయడానికి తీర్మానించింది. దీనికి న్యాయశాస్త్రం, శాసన నిర్మాణంలోనూ ప్రత్యేక ప్రతిభ ఉన్నవారు అవసరం. అందుకే అప్పటి పెద్దలు ఇంగ్లాండుకి వెళ్లి శ్రీలంక దేశ రాజ్యాంగాన్ని రాసిన అంతర్జాతీయ రాజ్యాంగ రచనా నిపుణుడు సర్ గౌర్ జెన్నింగ్ అనే అతన్ని కోరితే అందుకు ఆయన బదులిస్తూ శ్రీలంక దేశంలో దాదాపుగా అందరూ సింహళీలు దాని రాజ్యాంగం రాయడం సులభమైంది కానీ భారత రాజ్యాంగం రాయడం అంత ఈజీ కాదు. అనేక మతాలు, కులాలు అసమానతలతో కూడిన దేశానికి రాజ్యాంగం రాయడం నావల్ల కాదు. కానీ మీ దేశ రాజ్యాంగం రాయగలవాడు మీ దేశంలోనే ఉన్నారు అతను డాక్టర్ అంబేడ్కర్ అని తెలపడంతో వెనుతిరిగిన పెద్దలు అంబేడ్కర్‌తో రాజ్యాంగాన్ని రాయించే పనికి పూనుకున్నారు. ఇదే మాదిరిగా అంబేడ్కర్‌ను భారతదేశ జాఫర్సన్‌గా కొన్ని అమెరికా పత్రికలు ప్రశంసించాయి. అమెరికా రాజ్యాంగ చట్టాన్ని ‘థామస్ జాఫర్సన్’ కు ఇన్ని ఇబ్బందులు కలుగలేదు. ఎందుకంటే అక్కడ ఒక నీగ్రో జాతి బానిసల సమస్యలు ఉన్నాయి గాని భారతదేశంలో అనేక మతాలు, కులాలు, ప్రాంతాలను దృష్టి లో పెట్టుకుని అందరికీ అనుకూలంగా రాయవలసి ఉన్నందున వారు ఎంతో శ్రమించవలసి వచ్చింది.
అంబేడ్కర్‌ను ముంబై నుండి రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా ఎంపిక చేయాలనే ప్రయత్నం విఫలమైంది జైసూర్ కల్నల్ నుండి ఎంపిక కాబడినప్పటికి దేశ విభజన కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్‌లో కలిపినారు. తద్వారా భారత రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా హోదాను కోల్పోయారు. దాంతో బెంగాల్ శాసన సభ ద్వారా జోగేంద్రనాథ్ మండల్ వల్ల రాజ్యాంగసభ సభ్యునిగా ఎన్నుకోబడ్డారు. 1947 ఆగస్టు 29న రాజ్యాంగాన్ని రాసేందుకు అంబేడ్కర్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటైంది కానీ అందులోనీ సభ్యులలో ఒకరు విదేశాలలో ఉండడం, ఒకరు దక్షిణ భారత దేశానికే పరిమితం కావడం, మరొకరు చనిపోవడం మిగతా వారు అంతగా ఆసక్తి చూపకపోవడంతో రాజ్యాంగ రచన బాధ్యత అంబేద్కర్ భుజస్కంధాలపై పడింది. అనేక దేశాలు ప్రాంతాలు అనేక సంప్రదింపులు, కాలమాన, సామాజిక పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసిన ఆ మహనీయుడు మన భారత దేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించాడు. ఇందులో స్వతంత్రం, స్వేచ్ఛ, సమానత్వానికి పెద్దపీట వేశారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా భరిస్తూ ‘మానవుని జీవితం తాత్కాలికం కానీ రాజ్యాంగ చట్టం శాశ్వతమైందని’ అన్నారు.
నూతన రాజ్యాంగం 1949 నవంబర్ 26 న ఆమోదించినట్టు రాజ్యాంగ సభ తెలిపింది. ‘ఈ సభలో డాక్టర్ అంబేడ్కర్ సభ్యులందరినీ తనచూపుడు వేలుతో హెచ్చరిస్తూ 1950 సంవత్సరం జనవరి 26వ తేదీ నుండి ఈ దేశ రాజ్యాంగం అమలులోకి వస్తుంది. మన భారతదేశంలో రాజకీయంగా సమానత్వం ఏర్పడి ఉన్నప్పటికీ సాంఘిక, ఆర్థిక రంగాలలో అసమానత్వం నెలకొని ఉన్నది ప్రజాస్వామ్య విరుద్ధమైన అసమానతలను వీలైనంత త్వరలో రూపుమాపనట్లయితే ఈ సాంఘిక, ఆర్థిక అసమానత ద్వారా బాధింపబడే ప్రజానీకంలో సహనం నశించిపోయి తిరుగుబాటు చేయడం తప్పదు. ఒకవేళ అలాంటిదే జరిగినట్లయితే ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన ఈ ప్రజాస్వామిక వ్యవస్థ తునాతునకలు అయిపోతుంది అన్నారు’.
ఈ దేశ భవిష్యత్తును రాజకీయ నాయకుల స్వార్థాన్ని ముందే ఊహించిన అంబేడ్కర్ దేశాభివృద్ధి కోసం సమగ్ర రాజ్యాంగాన్ని చట్టాలను రూపొందించారు. పాలన వ్యవస్థను ఎలా ఉండాలో రాజ్యాంగంలో నిర్దేశించారు. శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు దారి తప్పితే న్యాయ వ్యవస్థ వాటిని గాడిలో పెట్టే విధంగా విధానాలను రూపొందించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే హక్కును ప్రజలకు కల్పించారు. ప్రభుత్వాల బాధ్యత ఏమిటో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించే విధంగా రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారు. అస్పృశ్యత, అంటరానితనం రూపుమాపేందుకు అనేక రకాల పౌరస్వేచ్ఛలకు రాజ్యాంగ హామీలు, రక్షణలు అంబేడ్కర్ కల్పించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించివారి అభ్యున్నతికి కారకులయ్యారు. దేశంలో ప్రజలందరికీ కూడు, గూడు, గుడ్డ, ఉపాధి కల్పించాల్సిన బాధ్యతలన్నీ ప్రభుత్వాలపైనే పెట్టారు. దేశ సంపద ఎవరో కొందరి చేతిలో ఉండిపోకుండా దేశంలో లభ్యమవుతున్న వనరులన్నీ ప్రజలందరికీ సమానంగా ఉండాలని కోరాడు. ప్రజల విద్య, ఆరోగ్యం బాధ్యత ప్రభుత్వమే వహించాలని నిర్దేశిస్తూ ఒకే సంక్షేమ రాజ్యాన్ని ఆదేశిక సూత్రాలలో ఇమిడ్చిపెట్టినారు అంబేడ్కర్.
దేశంలో అత్యంత అణచివేతకు గురవుతున్న మహిళల రక్షణ కోసం హిందూ కోడ్ బిల్లును తేవడం చరిత్రాత్మకం. ఆనాటి సభలో మహిళా సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఈ బిల్లుకు మద్దతు తెలపలేదు. అయినా పట్టు పట్టి హిందూ కోడ్ బిల్లును సాధించారు. దీని వల్ల మహిళలకు పురుషులతో సమానంగా విద్య హక్కు, ఆస్తి హక్కు కల్పించబడింది. ఇందుకోసం తన న్యాయశాఖ మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. కార్మిక శాఖ సభ్యునిగా కార్మికులు ఉద్యోగుల కోసం సెలవు దినాల్లో జీతాలు ఇవ్వాలని, ఎనిమిది గంటల పని దినాన్ని, కనీస వేతనాల చట్టాన్ని, సంఘాలు ఏర్పాటు ఏర్పాటు చేసుకునే హక్కు ఇంకా ఇతర రక్షణ కల్పించారు. ముఖ్యంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడం కోసం ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ రూపకల్పనకు కారకులయ్యారు.
ఈదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలమైన ఓటు హక్కును కుల, మత, వర్గాలకు అతీతంగా 18 సంవత్సరాలు నిండిన ఈదేశ ప్రతి పౌరుడికి ఉండాలని ఆనాటి దేశ నాయకులతో పోరాడి సాధించారు. మరీ ముఖ్యంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటును ఆర్టికల్-3లో స్పష్టంగా పొందుపరిచారు. దేశంలోని అట్టడుగు వర్గాల తలరాత మార్చిన బ్రహ్మ అయిండు, కోట్లాది పీడిత ప్రజలకు ఆరాధ్యుడయిండు, ఆయన రూపొందించిన రాజ్యాంగం స్ఫూర్తిగా చట్టసభలు ఏర్పాటు అయినప్పటికీ చట్టసభల ముందు కనీసం ఆయన విగ్రహాన్ని పెట్టాలనే సోయి పాలకులకు లేకుండా పోయింది.ఈ దేశ ప్రజల కోసం ఇన్ని త్యాగాలు చేసిన ఆ మహనీయుని పేరును కొత్తగా నిర్మిస్తున్న భారత పార్లమెంటు భవనానికి పెట్టాలని తెలంగాణతో సహా యావత్ దేశం కోరుకుంటుంది. అంబేడ్కర్ రాజ్యాం గం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైందని ఇక్కడి మేధావులు, ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతన పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది. అంతటితో ఆగకుండా మరొక అడుగు ముందుకేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెడుతున్నట్లుగా ప్రకటించి దేశానికే ఆదర్శంగా నిలిచారనడంలో సందే హం లేదు. సమున్నత రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ పేరును కొత్త పార్లమెంటుకు పెట్టడం వల్ల ఈ దేశ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసే విధంగా సగర్వంగా ఉంటుంది.
బి వెంకటేశం మోచి- 9491994090