అధ్యక్షుడి పదవీ కాలం ఏడేళ్లకు పొడిగింపు
రెండు రాజ్యాంగ సవరణలపై సంతకం చేసిన అధ్యక్షుడు
మాస్కో: అధ్యక్షుడి పదవీ కాలాన్ని ఏడేళ్లకు పొడిగించడంతో పాటుగా దేశ రాజధానికి పాతపేరును తిరిగి తీసుకు వచ్చే రెండు రాజ్యాంగ సవరణలపై కజకిస్థాన్ అధ్యక్షుడు కస్సిమ్‌జోమార్ట్ టొకయేవ్ శనివారం సంతకం చేశారు. గత జనవరిలో 200 మందికి పైగా మృతికి దారితీసిన హింసాత్మక ఆందోళనల అనంతరం అధ్యక్షుడు పిలుపునిచ్చిన రాజకీయ, ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఈ మార్పులు చేశారు. భారీగా పెరిగిన ఇంధన ధరలతో పాటుగా మాజీ అధ్యక్షుడు నుస్రుల్తాన్ నజర్‌బయెవ్, ఆయన పార్టీ అధిపత్యంలో గత 30 ఏళ్లుగా సాగిన దేశ రాజకీయాల పట్ల ప్రజల అసంతృప్తి ఈ ఆందోళనల రూపంలో వ్యక్తమయింది. ఈ రెండు సవరణలకు కజక్ పార్లమెంటు శుక్రవారం ఏకగ్రీవంగా మద్దతు తెలియజేయగా, ఒక రోజు తర్వాత అధ్యక్షుడు టొకయేవ్ సంతకాలు చేయడంతో అవి చట్టాలుగా మారాయి. అధ్యక్షుడి పదవీ కాలాన్ని ఇప్పుడున్న అయిదేళ్లనుంచి ఏడేళ్లకు పొడిగించడంతో పాటు రెండో సారి పోటీ చేయడానికి వీల్లేకుండా మార్పు చేశారు. అంతేకాకుండా ఇప్పుడు నుర్‌సుల్తాన్‌గా పిలవబడుతున్న దేశ రాజధానిపేరును తిరిగి ఆస్తానాగా మారుస్తూ మరో సవరణ చేశారు.