Friday, November 15, 2024

నమీబియా ఆశలు సజీవం

- Advertisement -
- Advertisement -

Namibia won match by six wickets against Netherlands

చెలరేగిన డేవిడ్, రాణించిన గెర్హార్డ్, నెదర్లాండ్స్‌కు మరో ఓటమి

అబుదాబి: ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచుల్లో భాగంగా బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయతో నమీబియా నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక వరుసగా రెండో ఓటమితో నెదర్లాండ్స్ ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. గ్రూప్‌ఎలో భాగంగా జరిగిన పోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నమీబియా 19 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

ఆరంభంలో తడబాటు..

లక్ష్యఛేదనకు దిగిన నమీబియాకు ఓపెనర్లు జానె గ్రీన్, స్టెఫాన్ బార్డ్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. గ్రీన్ దూకుడుగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అయితే 12 బంతుల్లో మూడు ఫోర్లతో 15 పరుగులు చేసిన గ్రీన్‌ను క్లాసెన్ వెనక్కి పంపాడు. ఆ వెంటనే క్రెగ్ విలియమ్స్ కూడా ఔటయ్యాడు. 11 పరుగులు చేసిన అతన్ని అకర్‌మన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. కొద్ది సేపటికే మరో ఓపెనర్ బార్డ్ కూడా ఔటయ్యాడు. 19 పరుగులు చేసిన అతన్ని సీలర్ ఔట్ చేశాడు. దీంతో నమీబియా 52 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది.

ఆదుకున్న డేవిడ్, గెర్హార్డ్..

ఈ దశలో జట్టును కష్టాల్లోంచి గట్టెక్కించే బాధ్యతను కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్‌మస్, డేవిడ్ విసే తమపై వేసుకున్నారు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే గతి తప్పిన బంతులను భారీ షాట్లుగా మలుస్తూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గెర్హార్డ్ దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించాడు. డేవిడ్ కూడా తమ మార్క్ షాట్లతో అలరించాడు. ఇద్దరు కుదురు కోవడంతో నమీబియా మళ్లీ మ్యాచ్‌పై పట్టు బిగించింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన గెర్హార్డ్ 22 బంతుల్లో నాలుగు పోర్లు, ఒక సిక్సర్‌తో 32 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు 93 పరుగులు జోడించి నమీబియాను మ్యాచ్‌ను శాసించే స్థితికి చేర్చాడు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన డేవిడ్ 40 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, మరో 4 ఫోర్లతో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి స్మిత్ 14 (నాటౌట్) సహకారం అందించాడు. డేవిడ్ దూకుడైన ఇన్నింగ్స్‌తో నమీబియా మరో ఓవర్ మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది.

మాక్స్ ఒంటరి పోరాటం..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టును ఓపెనర్ మాక్స్ డౌడ్ ఆదుకున్నాడు. ఆరంభం నుంచే నమీబియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న మాక్స్ స్కోరును పరిగెత్తించాడు. మరో ఓపెనర్ మైబుర్గ్ (17) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వండర్‌మెర్వ్ (6) కూడా నిరాశ పరిచాడు. అయితే అకర్‌మన్ అండతో మాక్స్ పోరాటం కొనసాగించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అకర్‌మన్ ఒక ఫోర్, సిక్స్‌తో 35 పరుగులు సాధించాడు. ఇక మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచిన మాక్స్ డౌడ్ 56 బంతుల్లో ఆరు ఫోర్లు, సిక్సర్‌తో 70 పరుగులు చేసి రనౌటయ్యాడు. వికెట్ కీపర్ ఎడ్వర్డ్ రెండు ఫోర్లు, సిక్స్‌తో అజేయంగా 21 పరుగులు చేయడంతో నెదర్లాండ్స్ స్కోరు 164 పరుగులకు చేరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News