Sunday, December 22, 2024

రైతును అడ్డుకున్న మెట్రో స్టేషన్ సెక్యూరిటీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఒక రైతు వస్త్రధారణ చూసి మెట్రో రైలులో ప్రయాణించకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆ రైతు వస్త్రధారణ మెట్రో రైలు ప్రయాణానికి యోగ్యంగా లేదన్న కారణంతో బెంగళూరులోని నమ్మ మెట్రో భద్రతా సిబ్బంది ఆ రైతును అడ్డుకున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో సోమవారం స్పందించిన మెగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(బిఎంఆర్‌సిఎల్) విచారం వ్యక్తంచేయడంతోపాటు ఈ ఘటనకు బాధ్యుడైన ఒక సెక్యూరిటీ సూపర్‌వైజర్‌పై వేటు వేసింది. తెల్ల చొక్కా ధరించి, తలపై బట్టల మూట పెట్టుకున్న ఒక రైతును సరైన టిక్కెట్ ఉన్నప్పటికీ రాజాజీనగర్ మెట్రో స్టేషన్ సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద లగేజ్ స్కానర్ సమీపంలో ఆ రైతు నిస్సహాయంగా నిలబడి ఉన్న దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

హిందీ మాట్లాడుతున్న ఆరైతును ఎందుకు అడ్డుకుంటున్నారని కార్తీక్ అయిరాని అనే వ్యక్తి సెక్యూరిటీ సిబ్బందిని నిలదీయడం ఆ వీడియోలో కనిపించింది. ఆ రైతు వల్ల భద్రతకు ఎటువంటి ముప్పు లేదని కార్తీక్‌తోపాటు మరో వ్యక్తి సిబ్బందికి చెప్పారు. ఆ రైతు వద్ద బట్టల మూట మాత్రమే ఉందని, అది తీసుకువెళ్లడం బిఎంఆర్‌సిఎల్ నిబంధనలకు వ్యతిరేకం కాదని వారు సిబ్బందితో వాదించారు. దీంతో మెట్రో ఎక్కడానికి సిబ్బంది ఆ రైతును అనుమతించారు. ఈ సంఘటన దరిమిలా సెక్యూరిటీ సూపర్‌వైజర్ ఒకరిని బిఎంఆర్‌సిఎల్ ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ ఘటనపై స్పందించిన బిఎంఆర్‌సిఎల్ ఆ రైతుకు అసౌకర్యం కలిగించినందుకు విచారం వ్యక్తం చేసింది. నమ్మ మెట్రో సమ్మిళిత రవాణా విధానమని బిఎంఆర్‌ఎల్‌సి తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News