నాంపల్లిలో భిన్నమైన రాజకీయ పరిస్థితి, దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో మజ్లిస్ పాగా, గత ఎన్నికల ఫతితం ఈ దఫా పునరావృతం కాగాలదా?, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ ఇతర పార్టీల శ్రమ నీరుగాతున్న వైనం, నేతలు ఎన్నికల బరిలో దిగేందుకు విముఖత
(ఎ. సుధాకర్/మన తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పరిధిలోకి వచ్చే ప్రతిష్ఠాత్మక నాంపల్లి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండానే తమ ప్రచార సమరంలోకి దిగి గెలుపే లక్షంగా అభ్యర్థులు తమ సర్వశక్తులు ఓడ్డి పోరాడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో రాజకీయంగా విచిత్ర పరిస్థితి నెలకొన్నది. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ విజయం కోసం రేయింబవళ్లు శ్రమించి పోరాడుతుంటే, ఈ నియోజకవర్గంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆయా పార్టీలు నువ్వానేనా అన్నట్లు పోరాడి చివరికి మజ్లిస్ అభ్యర్థిని అందలం ఎక్కించడంలో ప్రతిసారి సఫలీకృతులవుతున్నారు. అదే పరిస్థితి మళ్లీ తాజాగా ఈ ఎన్నికల్లో పునరావృతం కావచ్చన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ ఇతర పార్టీలు తుది వరకు రాజకీయ వైరంతో శత్రువులుగా తలపడి పరోక్షంగా మజ్లిస్‌ను గెలిపించే పరిస్థితి నెలకొంటోంది.
హిందూ ఓట్లలో చీలిక
హిందూ ఓట్లలో విభజన వల్లనే మజ్లిస్ చాన్నాళ్లుగా విజయాలతో ఈ నియోజకవర్గంలో పాగా వేసింది. ముస్లింలు పోలింగ్ రోజు మజ్లిస్‌కు గంప గుత్తగా ఓట్లేయడం వల్లనే ఆ పార్టీ జయకేతనాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది. అదే హిందూ ఓట్లు నాలుగు పార్టీలకు చీలిపోవడం ఆయా పార్టీలకు గెలుపు కష్ఠ సాధ్యంగా మారింది. మజ్లిస్ పార్టీ ముస్లిం ఓట్లతో గెలవడానికే అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఇతరులు హిందూ, ముస్ల్లిం ఓట్లతో గెలవాలన్న వారి ఆరాటం చివరికి నీరుగారిపోతోంది. ఈ దిశగా అర్థబలం, అంగబలాన్ని మొహరించి, తీవ్రంగా శ్రమించి చివరికి ఓటమి బాధతో మజ్లిస్‌కు బంగారు పళ్లెంలో ఎమ్మెల్యే సీటును దారాదత్తం చేస్తున్నారు.
వీరు ఎంత తీవ్ర స్థాయిలో ఎన్నికల ప్రచారం చేసినా అంతే సులభంగా మజ్లిస్‌కు విజయం వరిస్తున్న వైనం ఇదివరలో ఫలితాలు స్పష్ఠం చేశాయి. గత 20 ఏళ్లుగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఓటమీ ఎరుగని మజ్లిస్‌ను ఢీకొనేందుకు వివిధ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ ఇతరులు మాత్రం మజ్లిస్‌ను పరోక్షంగా గెలిపించడంలోను నిమగ్నమయ్యే పరిస్థితి నెలకొన్నది. తాము ఓడినా పర్వాలేదు కానీ తన ప్రత్యర్థి గెలవకూడదన్నది వారిలో నెలకొన్న భావన.. దీన్ని మజ్లిస్ అవకాశంగా మల్చుకుని రాజకీయ లబ్ధి పొందడంలో సిద్ధ్దహస్తులనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా ఆయా పార్టీలు తుది వరకు పోరాడి మజ్లిస్ చేతుల్లో ఓటమిని చవిచూశాయి. ఇక్కడ 1983 నుంచి 89 వరకు, తర్వాత 2004 నుంచి 2018 వరకు మజ్లిస్ అప్రతిహతంగా వరస విజయాలను నమోదుచేసుకున్నది. ఇతర పార్టీ నేతలు మజ్లిస్ విజయాలు చూసి ఎన్నికల బరిలో దిగేందుకు జంకాల్సిన పరిస్థితి…
శత్రువుకు శత్రువు మిత్రుడు
శత్రువుకి శత్రువు మిత్రుడనే ప్రణాళికను అమలు చేసి మజ్లిస్ ప్రతి ఎన్నికలో గెలుపు పరంపర కొనసాగిస్తూనే ఉంది. మజ్లిస్ తన రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇదే అస్త్రాన్ని సంధించి విజయాలు సాధిస్తోంది. ప్రతి ఎన్నికలో ఎదో పార్టీకి లోపాయికారిగా డబ్బుల రూపంలో సహకరిస్తూ తద్వారా హిందూ ఓట్లను చీల్చేందుకు కృషి చేస్తోంది. బలహీన అభ్యర్థులకు డబ్బులు సమకూర్చి తన గెలుపును సులభతరంగా చేసుకుంటోంది . గతంలో బిజెపి అభ్యర్థికి మజిస్ ఎన్నికల ప్రచారం కోసం నిధులు సమకూర్చిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.