Friday, December 20, 2024

చిగురుపాటి జయరాం హత్య కేసు.. నిందితుడు రాకేష్ రెడ్డికి జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు రాకేష్ రెడ్డికి జీవిత ఖైదు విధించింది. ఇదిలావుండగా చిగురుపాటి జయరాం హత్య కేసులో రాకేశ్ రెడ్డిని ఈ నెల 6న నాంపల్లి కోర్ట్ దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. 2019 నాటి ఈ కేసులో సుమారు నాలుగేళ్ళ పాటు మొత్తం 73 మంది సాక్షులను విచారించిన కోర్టు సాక్ష్యాలను పరిశీలించి, వాదనలు విన్న తర్వాత కుట్ర చేసి హత్య చేసినట్లు కోర్టు నిర్ధారించింది. ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు 23 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు పోలీసు అధికారులతో సహా మిగిలిన 11 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.

2019 జనవరి 30వ తేదీన డాక్టర్ చిగురుపాటి జయరాంను హనీట్రాప్ ద్వారా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి రాకేశ్ రెడ్డి తన నివాసానికి రప్పించాడు. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి డాక్టర్ జయరాంను నిర్భంధించి హత్య చేశాడు. తరువాత జయరాం మృతదేహాన్ని కారులోకి ఎక్కించి ఆంధ్రా- తెలంగాణ బోర్డర్‌లో పడేశాడు. అనంతరం దీనిని తన స్నేహితులతో కలిసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశాడు. ఆర్థిక లావాదేవీల కారణంగానే వ్యాపారి హత్యకు గురైనట్లు ఆరోపణలు రాగా కేసును పరిశోదించిన పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసి షాకింగ్ నిజాలు బయటపెట్టారు.

రాకేష్ రెడ్డితో సహా మరో 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు. నిందితుల జాబితాలో ముగ్గురు పోలీసు అధికారులు కూడా ఉండటం విశేషం. అప్పటి ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లా రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసులు, రాంబాబుల ప్రమేయం ఉన్నట్లు తెలియజేశారు. వారి సలహా మేరకే ప్రధాన నిందితుడు జయరామ్ మృతదేహాన్ని నందిగామ పోలీస్ స్టేషన్ పరిధికి తరలించి ప్రమాద ఘటనగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని విచారణ జరిపిన పోలీసులు తేల్చారు. అప్పటినుంచి దీనిపై నాంపల్లి సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News