Sunday, June 30, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు షాక్

- Advertisement -
- Advertisement -

ఫోన్ టాపింగ్ కేసులో నిందితులకు మరోసారి చుక్కెదురు అయింది. అడిషనల్ ఎస్‌పిలు భుజంగరావు, తిరుపతన్న, ఎసిపి ప్రణీత్ రావు బెయిల్ పిటీషన్‌లను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. 90 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయనందున బెయిల్ కావాలని నిందితులు కోరారు. తాము బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కోర్టులో ఛార్జిషీట్ లేదని నిందితుల తరఫు న్యాయవాది బెయిల్ పై వాదనల సమయంలో కోర్టుకు వెల్లడించారు. అరెస్టయిన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే బెయిల్ ఇవ్వవచ్చునని వాదనలు వినిపించారు. బెయిల్ ఇవ్వవచ్చునని పలు తీర్పులు చెబుతున్నాయన్నారు. అయితే, తాము 90 రోజుల లోపే ఛార్జిషీట్ దాఖలు చేశామని పోలీసుల తరఫు న్యాయవాదులు వెల్లడించారు. ఛార్జిషీట్‌ను కోర్టు తిప్పి పంపించిందని, ఇలా పంపినంత మాత్రాన ఛార్జిషీట్ వేయనట్లు కాదని పోలీసులు తెలిపారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టి వేసింది.

ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు తెలంగాణ ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అమెరికా నుంచి రావాల్సి ఉంది. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించారనే అభియోగాలు ప్రభాకర్‌రావుపై నమోదయ్యాయి. ప్రభాకర్‌రావును ప్రశ్నిస్తేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అంటోంది. ఈ లెక్కన ఆయన దేశంలో అడుగుపెట్టిన వెంటనే అరెస్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాకర్‌రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.. ఆయన వీసా గడువు ముగిసిందని ఎప్పుడైనా ఇండియాక రావొచ్చని భావిస్తున్నారు. అనారోగ్య సమస్యల వల్ల చికిత్స కోసం వచ్చానని పోలీసులకు అందుబాటులో ఉంటానని జూన్26న భారత్ కు వస్తానని అడ్వకేట్ ద్వారా ప్రభాకర్ రావు కోర్టులో మెమో దాఖలు చేశారు. అయితే ఆయన రాలేదు. వీసా గడువు పొడిగించుకుని ఉండవచ్చని చెబుతున్నారు.

మరో నిందితుడు శ్రవణ్ రావుకు కూడా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఎవిడెన్స్ మెటీరియల్ మొత్తాన్ని పోలీసు ఉన్నతాధికారులు కోర్టుకు సమర్పించారు. మూడు బాక్సులలో న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించారు. ఇందులో హార్డ్ డిస్క్‌లు, సిడీ, పెన్ డ్రైవ్‌లు ఉన్నాయి. ఈ మెటీరియల్ ఎవిడెన్స్‌లు లేని కారణంగా రెండు సార్లు చార్జిషీటును కోర్టు వెనక్కి పంపింది. ఫైనల్‌గా అన్నిటినీ జత పరుస్తూ పోలీసులు మూడోసారి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కాగా.. ఈ ఆధారాలను నిందితులకు తెలీకుండా రహస్యంగా ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అనధికారికంగా ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. బిఆర్‌ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచిన రోజునే ఆధారాలన్నీ శ్రవణ్ రావు ధ్వంసం చేసినట్లుగా తెలియడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అప్పట్నుంచి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News