మన తెలంగాణ/హైదరాబాద్ : పోలీసులపై చేయి చేసుకున్న కేసులో వైఎస్సార్‌టిపి చీఫ్ వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు షర్మిలను చంచల్‌గూడ జైలుకు తరలించారు. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్‌ను నిరసిస్తూ లోటస్ పాండ్ లోని తన నివాసం నుంచి వైఎస్ షర్మిల సిట్ ఆఫీస్ కు బయలుదేరగా పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె కాలినడకనే సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పర్మిషన్ లేదంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసుల తీరును నిరసిస్తూ షర్మిల రోడ్డుపై బైఠాయించారు.
తనను ఆపడానికి మీరెవరు అంటూ షర్మిల పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఏ పని లేకుంటే గాడిదలు కాసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పార్టీ అధ్యక్షురాలిగా ప్రజా సమస్యలపై పోరాడే హక్కు తనకుందని, తనను ప్రగతి భవన్‌కు వెళ్లనీయాలని పోలీసులను కోరారు. అయితే అందుకు పోలీసులు ససేమిరా అనడంతో ఆగ్రహించిన షర్మిల అక్కడి నుంచి ముందుకు నడుస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ లేడి కానిస్టేబుల్ పై చేయిచేసుకున్నారు. అదేంటని ప్రశ్నించిన పోలీస్ అధికారిని కూడా షర్మిల పక్కకు తోశారు. దీంతో పోలీస్ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన షర్మిలపై 353, 332, 509, 427 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ అనంతరం షర్మిలకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఓ మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకొంటారు?
ఈ సందర్భంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటూ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిట్ కార్యాలయానికి ఒక్కరినే వెళ్లి అధికారిని కలిసి టిఎస్‌పిఎస్‌సి దర్యాప్తు మీద వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నామని తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతున్నందున తమ అనుమానాలను సిట్ అధికారికి చెప్పడం తమ బాధ్యత అని తెలిపారు. సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు ఎవరికీ చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. బయటకు వెళ్లకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. తన రక్షణ కోసమే చేయిచేసుకున్నట్లు తెలిపారు. ఒక మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారని షర్మిల ప్రశ్నించారు.బయటకి వెళ్లకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటూ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రశ్నిస్తే అరెస్టులా? షర్మిల అరెస్ట్ పై వైఎస్ విజయమ్మ
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆమె తల్లి వైయస్ విజయమ్మఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిలను చూడటానికి స్టేషన్ కు వెళ్తుండగా పోలీసులు విజయమ్మను అనుమతించలేదు. ఆమెను బలవంతంగా ఇంటికి తరలించారు. పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగిన విజయలక్ష్మీ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని వైఎస్ విజయమ్మ చెప్పారు. వైఎస్ షర్మిల అరెస్ట్ ను ఆమె తప్పుబట్టారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అని ఆమె ప్రశ్నించారు. సోమవారం మధ్యాహ్నం లోటస్ పాండ్ లో వైఎస్ విజయమ్మ మీడియాతో మాట్లాడారు. షర్మిల ఉద్యమ కారిణికాదు, టెర్రరిస్టు కూడా కాదని చెప్పారు. షర్మిల వేలమందితో వెళ్లలేదు కదా అని ఆమె ప్రశ్నించారు. పోలీసులు మీద పడుతుంటే ఆవేశం రాదా అని ప్రశ్నించారు. తాను పోలీసులను ఇష్టారీతిలో కొట్టినట్టుగా మీడియాలో ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
తాను కొట్టాలనుకొంటే గట్టిగానే కొట్టేదన్నారు. తనపై పోలీసులు మీద పడిపోతే వారిని నెట్టివేసినట్టుగా చెప్పారు. వాస్తవాలను ప్రజలకు తెలపాలని ఆమె మీడియాను కోరారు. ప్రజల కోసం మీరు కూడా పోరాటం చేయాలని ఆమె మీడియాను కోరారు. మహిళా పోలీసులు అంతమంది వచ్చి తన మీద పడితే ఆవేశం వచ్చిందని చెప్పారు. షర్మిల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. షర్మిల బయటకు ఎక్కడికి వెళ్లకూడదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఎవరూ కూడా విమర్శించకూడదా? అని ఆమె అడిగారు. షర్మిల డ్రైవర్ పై కూడా దాడి చేశారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ వద్ద మీడియాపై కూడా పోలీసులు దాడి చేశారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసం షర్మిల పార్టీ పెట్టిందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని షర్మిల పోరాటం చేస్తుందన్నారు.
బెయిల్ పిటిషన్ దాఖలు
వైఎస్సార్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు సోమవారం సాయంత్రం ఆమెను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఆమె బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తొలుత పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఇరవై నాలుగు గంటలు పని చేస్తారని, అలాంటి వారి పైన చేయి చేసుకున్నారని, ఇలాంటి చర్యలు సమాజానికి తప్పుడు సంకేతాలు అందిస్తాయని న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. షర్మిల తన కారు డ్రైవర్ ను వేగంగా పోనివ్వాలని చెప్పారని, ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ కాలికి గాయాలు కూడా అయ్యాయని తెలిపారు. ఇది మాత్రమే కాకుండా, ఎస్‌ఐ పైన, మహిళా కానిస్టేబుల్‌పైన ఆమె చేయి చేసుకున్నారని కోర్టుకు విన్నవించారు. మరోవైపు, షర్మిల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆమెకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు షర్మిలను బయటకు వెళ్లనీయడం లేదన్నారు. పోలీసులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. పోలీసులు చాలామంది తనను అడ్డుకొని చెయ్యి విరిచే ప్రయత్నం చేశారని, తనను కొట్టారని, ఈ క్రమంలో తాను వారిని తోసేసినట్లు షర్మిల చెప్పారు.
సచివాలయం, సిట్‌కు వెళ్లి హడావుడి చేయాలని షర్మిల ప్లాన్ అందుకే అడ్డుకున్నాం : సివి ఆనంద్
వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల ఎపిసోడ్‌పై పోలీసులు రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మాట్లాడుతూ సచివాలయం, సిట్ ఆఫీస్‌కు వెళ్లి ఏదైనా హడావుడి చేయాలని షర్మిల ప్లాన్ చేశారని అన్నారు. అందుకే ముందస్తు సమాచారంతో ఆమెను హౌస్ అరెస్టు చేసేందుకు యత్నించామన్నారు. గతంలో ఆమె చేసిన చర్యలు కారణంగానే ఇప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం పోలీసుల బాధ్యత అని అన్నారు. అందులో భాగంగానే చాలా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. షర్మిల విషయం లో కూడా అదే జరిగిందని పేర్కొన్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై దాడి కేసులో పూర్తి విచారణ జరుగుతుందని వివరించారు. అంతకంటే ముందు మాట్లాడిన డిసిపి జోయల్ డెవిస్ ఎస్‌ఐను షర్మిల కొట్టారన్నారు. ఎస్‌ఐ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే కేసు రిజిస్టర్ చేసినట్టు కూడా వెల్లడించారు. డ్యూటీలో ఉన్న పోలీసులపై చేయి చేసుకోవడం పద్దతి కాదని చట్టం ప్రకారం చర్యలు ఉంటాయన్నారు.
షర్మిలపై కేసు నమోదు.. గాయపడ్డ కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలింపు…
లోటస్ పాండ్ వద్ద పోలీసుల మీద దాడి చేసిన వైఎస్ షర్మిలతో పాటు కారును ఆపకుండా పోనిచ్చిన ఇద్దరు డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ గిరిబాబు కాలు మీద కారు ఎక్కించిన షర్మిల కాన్వాయ్‌లో ఇద్దరు డ్రైవర్ ల మీద బంజారాహిల్స్ ఎస్ ఐ రవీందర్ ఫిర్యాదు చేశారు. అయితే కారు ఎక్కించడంతో గాయపడ్డ కానిస్టేబుల్ గిరిబాబును స్టార్ ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్ చేయగా, కాలి లిగ్మెంట్‌కు గాయం అయినట్లు డాక్టర్స్ గుర్తించారు. ఈ క్రమంలో బాధిత పోలీసుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు.
పోలీసులపై దాడిని ఖండించిన పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్
ఎస్‌ఐ కానిస్టేబుల్ వైఎస్ షర్మిల చేయి చేసుకోవడంపై హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విధినిర్వహణలో ఉన్న పోలీసులపై వైఎస్ షర్మిల, విజయమ్మ దాడిని ఖండిస్తున్నామని తెలిపింది. శాంతి భద్రతల విధుల్లో ఉన్న పోలీసుల పట్ల వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రవర్తించిన తీరు, దురుసుతనాన్ని ఖండిస్తున్నామని హైదరాబాద్ సిటీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నల్లా శంకర్ రెడ్డి తెలిపారు. ఇలాంటి చర్యలతో పోలీసుల ఆత్మాభిమానాన్ని దెబ్బతింటుందన్నారు. రాజకీయనాయకులు పోలీసుల సహనాన్ని పరీక్షించకూడదని హెచ్చరించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాలను అదుపుచేయడంలో తెలంగాణ పోలీసులు దేశంలో అత్యున్నత గుర్తింపు ఉందన్నారు. కానీ కొంతమంది రాజకీయ నేతలు ఇటీవల కాలంలో వ్యక్తిగత గుర్తింపు కోసం చౌకబారు చర్యలతో పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.