హైదరాబాద్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. పోలీసులపై దాడి కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇక, పోలీసులపై దాడి కేసులో షర్మిలపై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే, ఏప్రిల్ 24న టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీపై విచారణ జరుపుతున్న సిట్ కార్యాలయానికి వెళ్తుందనే అనుమానంతో వైఎస్ షర్మిలను ఆమె నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులను నెట్టుకుంటూ ముందకు కదిలారు. దీంతో పోలీసులకు, షర్మిలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమె పోలీసులపై చేయిచేసుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో చివరికి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసులో వైఎస్ షర్మిలకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే మరుసటి రోజు ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక, వైఎస్ షర్మిల పోలీసులపై చేయి చేసుకున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి విదితమే.