Friday, November 22, 2024

సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసు విచారణను స్వీకరించిన నాంపల్లి కోర్టు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసును గురువారం నాడు నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. ఎక్సైజ్ సిట్ సమర్పించిన అభియోగపత్రాలను న్యాయస్థానం ఆమోదించింది. ఈక్రమంలో నాలుగు సంవత్సరాల తర్వాత ఈ కేసులో విచారణ మొదలుకానుంది. ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన ఆబ్కారీ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం అభియోగపత్రాలను కోర్టులో దాఖలు చేయడంతో న్యాయస్థానం ఆమోదించింది. కరోనా కారణంగా న్యాయవిచారణలో జాప్యం జరగడం వల్ల కేసు ఇన్నాళ్లు వాయిదాపడింది. కాగా 2017 జులై 2న ఎక్సైజ్ శాఖ అధికారులు నగరానికి చెందిన కెల్విన్ మాస్కెరాన్స్, అబ్దుల్ వహాబ్, అబ్దుల్ ఖుద్దూస్‌ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విద్యార్థులకూ మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు విచారణలో బయటపడటంతో దర్యాప్తు చేపట్టి విచారణ కోసం సిట్ ఏర్పాటు చేశారు.ఈ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురిని విచారించారు.

ఈ కేసులో 30 మందిని అరెస్టు చేసి, 27 మందిని విచారించారు. 12 కేసులకు గానూ ముందు 8 కేసుల్లో అభియోగపత్రాలు దాఖలు చేశారు. దర్యాప్తులో జాప్యంపై విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా ఎక్సైజ్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ మరో నాలుగు చార్జిషీట్లు దాఖలు చేసింది. 11 మంది సినీ ప్రముఖులతోపాటు హీరో రవితేజ డ్రైవర్ శ్రీనివాసులను ఎక్సైజ్ పోలీసులు విచారించారు. డ్రగ్స్ కేసులో ఉన్న 11 మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే దీనిపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 12 కేసుల్లోనూ అనామకులను తీసుకువచ్చి సినీ ప్రముఖులను తప్పించారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేర్కొంటోంది. దీంతో ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని తెలిపింది. 12 కేసుల్లో అరెస్ట్ అయిన 30 మంది పైన కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. కాగా, విచారణకు హాజరైన వారి నుంచి సేకరించిన నమూనాలు విశ్లేషించి నివేదికలను పొందుపరిచి అభియోగపత్రాలను దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం ఆమోదించడంతో త్వరలో నాంపల్లి కోర్టులో విచారణ ప్రారంభం కానుంది.

Nampally Court take up Tollywood drugs case for hearing

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News