ఉత్తరాఖండ్‌లోని నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారకు చెందిన డేరా కర్ సేవ అధిపతి బాబా తర్సామ్ సింగ్ గురువారం ఉదయం హత్యకు గురయ్యారు. మోటారు సైకిల్ వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గురుద్వార ప్రాంగణంలో ఆయనపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన బాబా తర్సీమ్ సింగ్‌ను ఖతీమాలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు ఉధమ్ సింగ్ నగర్ సీనియర్ ఎస్‌పి మంజునాథ్ విలేకరులకు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో రుద్రాపూర్-తానక్‌పూర్ రోడ్డుపైన ఉన్న నానక్‌మట్టా సాహిబ్ గురుద్వార సిక్కులకు అతి పవిత్రమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఉదయం 6.15 ప్రాంతంలో గురుద్వారలోకి మోటారు సైకిల్‌పై వచ్చిన దుండగులు బాబాను తుపాకీతో కాల్చిన దృశ్యాలు సిసిటివిలో రికార్డయ్యాయి.
కాల్పులు జరిపిన వ్యక్తి మోటారు సైకిల్‌లో వెనుక కూర్చున్నాడని ఎస్‌ఎస్‌పి తెలిపారు. కుర్చీలో కూర్చుని ఉన్న బాబాపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడని, ముదటి రౌండు బాబా ముందు నుంచి, రెండవ రౌండు వెనుక జరిపాడని ఆయన చెప్పారు. వెంటనే బాబా కుర్చీలో నుంచి నేలకొరిగారని ఆయన తెలిపారు. నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ హత్య వెనుక కుట్ర ఉందని, దాన్ని త్వరలో ఛేదిస్తామని ఉత్తరాఖండ్ డిజిపి అభినవ్ కుమార్ చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థల సహాయాన్ని కూడా తీసుకుంటామని ఆయన తెలిపారు.