Monday, December 23, 2024

అమెరికా బలమా, చైనా బలహీనతా?

- Advertisement -
- Advertisement -

Talks between the leaders of America and China

అమెరికా పార్లమెంటు ప్రజా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ 2022 ఆగస్టు రెండవ తేదీ మంగళవారం రాత్రి 10.20కి తైవాన్ గడ్డమీద అడుగుపెట్టి రాత్రంగా ఒక హోటల్లో బసచేసి తెల్లవారగానే తైవాన్ ఇచ్చిన విందారగించి పొద్దుగూకక ముందే వెళ్లిపోయారు. అంతకు ముందు సింగపూర్ నుంచి మలేసియా వెళ్లి చీకటిపడే వరకు అక్కడ ఉండి రాత్రి కాగానే తైవాన్‌లోని తైపీ చేరుకున్నారు. చివరి క్షణం వరకు అంతా దాగుడుమూతలే. అనేక దినాల మాదిరి చరిత్రలో ఈ రోజు కూడా ప్రముఖంగా మిగిలిపోనుంది. అమెరికా అధికార వరుసలో మూడవ స్థానంలో ఉన్న ఆమె పర్యటన తరువాత తలెత్తిన తక్షణ పరిస్థితులు, పర్యవసానాల గురించి ప్రపంచమంతా చర్చ జరుగుతోంది.

బుధవారం నుంచి ఆదివారం వరకు తైవాన్ చుట్టూ ఆరు ప్రాంతాలలో చైనా మిలిటరీ విన్యాసాలు నిర్వహించింది. తైపే నగరం నుంచి పలు దేశాలకు విమాన రాకపోకలు లేవు. తైవాన్ దీవి మీదుగా తిరిగే పలు దేశాల విమానాలను దారి మళ్లించి వేరే రూట్లలో నడిపారు. వాషింగ్టన్‌లోని చైనా రాయబారిని పిలిపించి అమెరికా తన నిరసన తెలిపింది. దానికి ప్రతిగా చైనా కూడా స్పందించింది. ఈ పరిణామం ఎటు దారితీస్తుందన్నది ఇప్పుడే చెప్పలేము. సోమవారం నుంచి పచ్చసముద్రంలో పదిహేనవ తేదీ వరకు, బోహై సముద్రంలో నెల రోజుల పాటు (కొరియా ద్వీపకల్పం చైనా మధ్య) మిలిటరీ విన్యాసాలు నిర్వహించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇవన్నీ బలవంతపు విలీనానికి జరిపే కసరత్తే అని తైవాన్ పాలకులు ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతాన్ని అనేక కోణాల నుంచి చూడాల్సి ఉంది.

Nancy Pelosy

కొంత మంది 1962 నాటి క్యూబన్ క్షిపణి సంక్షోభాన్ని గుర్తుకు తెచ్చారు. దానికీ దీనికి ఏమైనా సామ్యం ఉందా? ముందుగా క్యూబన్ క్షిపణి ఉదంతాన్ని చూద్దాం. అంతర్గతంగా ముందు ఎలాంటి పరిణామాలు జరిగినప్పటికీ ఒక దశ దాటిన తరువాత ఉపరితలంలో కనిపించే దాన్ని బట్టి నామకరణం చేసినట్లుగా దీనికి ఆ పేరు పెట్టారు. 1953 నుంచి 1961 వరకు అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన ఐసెన్ హోవర్ ఐరోపాలోని నాటో కూటమి దేశాల్లో క్షిపణులు, ఆయుధాలను మోహరించి ఆ ప్రాంత దేశాలకు భరోసా కల్పించాలని, సోవియట్‌కు దీటుగా ఉన్నామని ప్రపంచానికి చెప్పేందుకు సంకల్పించారు. ఈ క్రమంలోనే సోవియట్ వద్ద మధ్యంతర, దీర్ఘశ్రేణి ఖండాంతర క్షిపణులు ఉన్నట్లు 1957లో పసిగట్టిన అమెరికా తన ఉద్ద ఉన్నవాటిని ప్రదర్శించి ప్రపంచాన్ని భయపెట్టేందుకు, సోవియట్‌ను రెచ్చగొట్టేందుకు పూనుకుంది. టర్కీలో వాటిని మోహరించేందుకు పూనుకోగా అందుకు అంగీకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని సోవియట్ హెచ్చరించింది.

తొలుత తటపటాయించిన టర్కీ ఒత్తిడికి లొంగి 1959 అక్టోబరు 25న అమెరికాతో ఒప్పందం చేసుకొని అంగీకరించింది. ఆమేరకు 1962లో జూపిటర్ క్షిపణులను టర్కీలోని ఇమిర్ పట్టణంలో, టర్కీలో, థార్ క్షిపణులను బ్రిటన్‌లో మోహరించారు. 1959లో ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలోని పురోగామివాదులు అమెరికా మద్దతు ఉన్న నియంత బాటిస్టా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారానికి వచ్చారు. అప్పటి నుంచి అమెరికాలో తిష్ట వేసిన కాస్ట్రో వ్యతిరేకులు సిఐఎ శిక్షణ, ఆయుధాలతో దాడి చేసి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు విఫలయత్నం చేశారు. 1961 ఏప్రిల్ 15న అమెరికా విమానాలు క్యూబా స్థావరాలపై దాడులు చేశాయి, 17వ తేదీన 1,500 విద్రోహులు దాడులకు దిగారు.

పందొమ్మిదవ తేదీకల్లా వారందరినీ కాస్ట్రో ప్రభుత్వం బందీలుగా చేసింది. ఈ దాడిని అవకాశంగా తీసుకొని కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా సోవియట్ తన క్షిపణులను 1962 సెప్టెంబరులో క్యూబాలో మోహరించింది. వ్యవసాయ నిపుణుల రూపంలో వెళ్లిన వారు అన్ని ఏర్పాట్లు చేసిన తరువాత గానీ అమెరికా పసిగట్టలేకపోయింది. అక్టోబరు 16న నాటి అధ్యక్షుడు కెన్నడీ సంక్షోభ నివారణకు పావులు కదిపాడు. అమెరికా దిగి వచ్చి టర్కీ, ఇటలీల్లోని తన క్షిపణులను తొలగిస్తామని అంగీకరించటంతో తమ అస్త్రాలను వెనక్కు తీసుకుంటామని సోవియట్ పేర్కొన్నది. అదే నెల 29వ తేదీకి ఉద్రిక్తతలు సడలాయి. తరువాత క్యూబాలో బందీలుగా ఉన్న తమ గూఢచారులు, కిరాయి మూకలను అమెరికా నష్టపరిహారం చెల్లించి మరీ విడిపించుకుంది. క్షిపణి ఒప్పందంలో అమెరికా లొంగిన సంగతి 1970 వరకు వెల్లడి కాలేదు. నేటి తైవాన్ ఉదంతానికి నాటి క్యూబా పరిణామాలకు పోలికే లేదు. పెలోసి పర్యటన బహిరంగ రహస్యం.

అధికారికంగా ప్రకటించే దమ్ము అమెరికాకు లేకపోయింది. ఫైనాన్సియల్ టైవ్‌‌సు పత్రిక ద్వారా లీకు వార్తలతో వెల్లడించి బైడెన్‌తో సహా అందరూ తెలియదంటూనే చర్చించారు. చివరికి పెలోసీ సైతం విలేకర్లతో మాట్లాడుతూ తన విమానాన్ని కూల్చివేస్తారని మిలిటరీ అనుకొంటుండవచ్చు అని చెప్పారు. మీడియాలో కట్టుకథలను రాయించారు. బుధవారం నుంచి ఆదివారం వరకు జరిగిన చైనా మిలిటరీ విన్యాసాలను చూసిన తరువాత పెలోసీ విమానం తైవాన్ గడ్డమీద దిగకుండా చూడటం చైనాకు పెద్ద సమస్య కాదన్నది స్పష్టం. మలేసియా తైవాన్ సమయాల ఒకటే. రెండు ప్రాంతాల ప్రయాణ వ్యవధి నాలుగున్నర గంటలు.ఒక దొంగ మాదిరి చీకటి మాటున ఆమె వచ్చారు.

విప్లవకాలం చివరి రోజుల్లో ఓటమి తప్పదని గ్రహించిన తరువాత చైనా మిలిటరీ, ఆయుధ సంపత్తినంతటినీ నాటి చాంగ్‌కైషేక్ ప్రభుత్వం అమెరికా, బ్రిటీష్ వారి సలహా మేరకు తైవాన్ దీవికి తరలించింది. 1949లో చైనా జనాభా 54 కోట్లు, తైవాన్ దీవి జనాభా 55 లక్షలు. నాటి బర్మా వైపు నుంచి దాడులు, టిబెట్‌లో తిరుగుబాట్లు, తైవాన్నుంచి దాడులు. యాభై నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న ప్రధాన భూభాగంలో విప్లవ విజయాలను పటిష్ట పరుచుకోవటం ముఖ్యమా, తైవాన్ మీద కేంద్రీకరణకా అన్నపుడు మావో నాయకత్వం మొదటి దానికే ప్రాధాన్యత ఇచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకొని పశ్చిమ దేశాలు తైవాన్ మిలిటరీని మరింత పటిష్ట పరిచాయి. ఇదే సమయంలో సామ్రాజ్యవాదులు ఒక తప్పుడు అంచనాకు వచ్చారు. చైనాలో కమ్యూనిస్టులను అధికారం నుంచి తొలగించగలమనే భ్రమతో ఐరాసలో అప్పటికే శాశ్వత దేశంగా ఉన్న చైనా అసలైన ప్రతినిధి తైవాన్‌లోని కొమింటాంగ్ పార్టీ ప్రభుత్వాన్నే ఐరాసలో గుర్తించారు. అలాగాక తైవాన్ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తే భద్రతా మండలిలో తమకు తోడుగా ఉండే తైవాన్‌కు ఒక శాశ్వత దేశ హోదా రద్దవుతుంది. సోవియట్‌కు చైనా తోడవుతుందని అమెరికా ఆలోచించింది. కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించింది. 1945లో ఐరాస ఏర్పడినపుడు నాటి చైనాతో కదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి కమ్యూనిస్టుల ఆధీనంలో ఉన్న చైనాను గుర్తించటం చైనా సమగ్రతను ఉల్లంఘించటమేనంటూ ఐరాసలో 1949లో అమెరికా కూటమి ప్రవేశపెట్టిన తీర్మానానికి నాడున్న బలాబలాల్లో అనుకూలంగా 25 దేశాలు, సోవియట్‌కు అనుకూలంగా తొమ్మిది దేశాలు ఓటు చేయగా 24 దేశాలు తటస్థంగా ఉన్నాయి.

ఆ తరువాత ఐరాసలో అమెరికా, బ్రిటన్‌లను వ్యతిరేకించే దేశాలు పెరిగి కమ్యూనిస్టు చైనాకు మద్దతు పెరిగింది. 1961లో తొలిసారిగా ఐరాస సాధారణ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో మూడింట రెండువంతుల దేశాలు చైనాకు అనుకూలంగా ఓటు వేశాయి. తరువాత ప్రతి ఏటా తీర్మానాలను ఆమోదిస్తున్నా అమెరికా అడ్డుకున్నది. అసలు రెండు చైనాలు ఉనికిలో లేవని ఉన్నది కొమింటాంగ్ పార్టీ ప్రభుత్వంలోని చైనా అసలైనదని అమెరికా కూటమి వాదించగా, కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఉన్నదే అసలైన చైనా అని సోవియట్ కూటమి వాదించింది. భద్రతా మండలి చైనా శాశ్వత దేశ ప్రతినిధులుగా తైవాన్ ప్రభుత్వం నియమించిన వారిని అనుమతించటంపై 1971 జూలై 15 సమావేశంలో సోమాలియా అభ్యంతర పెట్టింది. దాన్ని నిర్ణయించాల్సింది భద్రతా మండలి కాదని అమెరికా అడ్డుకుంది.

తరువాత సౌదీ అరేబియా ఒక ప్రతిపాదన తెచ్చింది. దాని ప్రకారం ఐరాస ఆధ్వర్యంలో తైవాన్‌లో మూడు అంశాల మీద ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. అంతవరకు ఐరాసలో తైవాన్‌కు సభ్యత్వాన్ని కొనసాగించాలి.ఒకటి తటస్థ దేశంగా ఉంటూ స్వతంత్ర దేశంగా కొనసాగటం, రెండు, పరిమిత అధికారాలతో ప్రజా చైనాతో సమాఖ్యగా ఉండటం, మూడు, స్వతంత్ర దేశంగా చైనాతో కాన్ఫెడరేషన్‌గా ఏర్పడటం. దీన్ని అమెరికా తిరస్కరించింది. మరో వైపున అమెరికా రహస్యంగా చైనాతో సంప్రదింపులకు దిగింది. పాకిస్తాన్ మీదుగా నిక్సన్ ప్రభుత్వజాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న హెన్రీ కిసెంజరు చైనా వెళ్లి చర్చలు జరిపి చైనాను గుర్తించేందుకు అంగీకరించి వచ్చాడు. మరోవైపు ఐరాసలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి అమెరికా ఒక మెలికపెట్టి వివాదానికి నాంది పలికింది. భద్రతా మండలిలో కమ్యూనిస్టు చైనాకు శాశ్వత ప్రాతినిధ్యం, సాధారణ అసెంబ్లీలో తైవాన్ ప్రతినిధి కొనసాగాలన్న దాని తీర్మానం వీగిపోయింది. చివరకు 1971 నవంబరు 23న భద్రతా మండలి, తరువాత సాధారణ అసెంబ్లీలో కమ్యూనిస్టు చైనాకు మద్దతుగా తీర్మానాలు ఆమోదించటంతో తైవాన్ వివాదానికి తెరపడింది. దాన్ని చైనాలో భాగంగా గుర్తించారు. తరువాత అమెరికా రాజకీయం మొదలు పెట్టింది.

ఐరాస తీర్మానానికి వక్రభాష్యం చెబుతూ తైవాన్ ప్రజలు పూర్తిగా ఆమోదించే వరకు బలవంతంగా విలీనం జరగరాదని చెప్పింది. తీర్మానంలో తైవాన్ గురించి స్పష్టంగా పేర్కొనలేదంటూ అనధికారికంగా తైవాన్ పాలకులతో సంబంధాలు పెట్టుకొన్నది. 1997లో నాటి స్పీకర్ న్యూటన్ గింగరిచ్ పర్యటన గురించి పెలోసి రాక సందర్భంగా కొందరు విశ్లేషకులు వక్రీకరించారు. ఇప్పుడున్నంత బలంగా అప్పుడు చైనా లేదు కనుక అంగీకరించినట్లు చిత్రించారు. నిజానికి చైనా ఎన్నడూ తైవాన్‌పై రాజీపడలేదు. గింగరిచ్ అధికారికంగా బీజింగ్ పర్యటనకు వచ్చాడు. తైవాన్ వెళ్లి ఒక వేళ బలవంతంగా విలీనానికి చైనా పూనుకుంటే తైవాన్ రక్షణకు తాము వస్తామని గింగరిచ్ చెప్పాడు.

అంతకు ముందు తెర వెనుక జరిగిన సంప్రదింపుల్లో ఒకే చైనా అన్నతమ వైఖరి గురించి ఎలాంటి భయాలుపెట్టుకోవద్దని, గింగరిచ్ తైవాన్ కూడా వెళ్లాలనుకుంటున్నారని అక్కడ తైవాన్ స్వాతంత్య్రం గురించి మాట్లాడరని, శాంతియుతంగా విలీనం జరగాలని తాము కోరుకుంటున్నామని, జోక్యం చేసుకోబోమని చెప్పిన అమెరికా మాట తప్పినట్లు నాడు చైనా ప్రకటించింది. ప్రభుత్వ విభాగాలన్నీ చైనా గురించి ఒకే వైఖరితో ఉండాలని స్పష్టం చేసింది. తమకు చెప్పింది ఒకటి మాట్లాడింది ఒకటి కావటంతో తాము కొంత గందరగోళానికి గురైనట్లు చైనా ప్రతినిధి అన్నట్లు వార్తలు వచ్చాయి. గింగరిచ్ రిపబ్లికన్ పార్టీ నేత కాగా అప్పుడు అధికారంలో డెమోక్రాటిక్ పార్టీకి చెందిన బిల్ క్లింటన్ ఉన్నాడు. ఇప్పుడు స్పీకర్, అధ్యక్షుడు ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు. నాడు గింగరిచ్ చైనా అనుమతితోనే తైవాన్ వెళ్లాడు. నేడు నాన్సీ పెలోసి పర్యటనలో అసలు బీజింగ్ సందర్శన అసలు భాగమే కాదు. అనుమతి లేకుండా అనధికారికంగా తైవాన్ వెళతారని ముందే ప్రచారం జరిగింది కనుక అమెరికా నాటకం ఇప్పుడు మరింత స్పష్టం.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News