హైదరాబాద్ : తమిళ సినీ హీరో, డిఎంకె అధినేత విజయ్ కాంత్ మృతి బాధాకరమని, సినీ పరిశ్రమలో ఒక మంచి మిత్రుణ్ణి కోల్పాయానని సినీ నటుడు, ఏపి శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయ్ కాంత్ అకాల మరణం ఒక్క కోలివుడ్ కే కాకుండా యావత్ భారతీయ సినీ పరిశ్రమకు తీరనిలోటు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇనిక్కుం ఇలామై సినిమాతో కెరీర్ ప్రారంభించిన విజయ్ కాంత్ వందకు పైగా చిత్రాల్లో హీరోగా నటించి అభిమానులను అలరించారన్నారు. ఒక్క తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ విజయ్ కాంత్ నటించారని గుర్తు చేసుకున్నారు.
నారా లోకేష్ నివాళి….
అనారోగ్యంతో మృతి చెందిన డిఎండికే అధినేత, సినీ నటుడు విజయ్ కాంత్ మృతి పట్ల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం తెలిపారు. హీరోగా ప్రేక్షకులను అలరించిన విజయ్ కాంత్ సినీ , రాజకీయ రంగాలకు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. అసలు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ఆయన తనదైన ముద్ర వేశారన్నారు. మిత్రుడు విజయ్ కాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.