సోమవారం ఇక్కడి రాష్ట్రపతిభవన్‌లో కనులపండువగా పద్మ పురస్కారాల బహుకరణ కార్యక్రమం జరిగింది. తెలుగు సినీ దిగ్గజం నందమూరి బాలకృష్ణ , అజిత్ కుమార్, అర్జిత్ సింగ్ వంటి ప్రముఖులు అవార్డుల స్వీకర్తల్లో ఉన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఈ పురస్కారాలను అందించి, శాలువాతో సత్కరించారు. పలు రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. పలు సామాజిక సేవారంగాలు, వినోదం , చిత్ర పరిశ్రమకు చెందిన విశిష్టులు ఈ ఉత్సవానికి వచ్చారు. దీనితో సందడి నెలకొంది. పలువురు అందుకున్న పురస్కారాల వివరాలు ఇవే. సినిమా రంగం నుంచి తెలుగు సినిమా హీరో బాలకృష్ణ , తమిళ హీరో అజిత్ కుమార్‌కు, , వైద్య రంగం నుంచి డాక్టర్ దువ్వూరు నాగేశ్వర రెడ్డికి, గాయకుడు పంకజ్ ఉదాస్‌కు , క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌కు , చిత్ర ప్రముఖుడు శేఖర్ కపూర్‌కు, నటుడు అనంత్‌నాగ్‌కు పద్మ భూషణ్ అవార్డు వారి వారి సేవలు గుర్తింపు ఫలంగా దక్కింది.
ఇక పద్మ శ్రీ పురస్కారాలలో నటుడు అశోక్ కుమార్ లక్ష్మణ్ సరాఫ్, యాక్టింగ్ కోచ్ , రంగ స్థల దర్శకులు బారీ గాడ్‌ఫ్రే జాన్, గాయకుడు జస్పీందర్ నరూలా, వాయిద్యకారులు అశ్విన్ భడే దేశ్‌పాండే, సంగీత దర్శకులు రికిగ్యాన్ కెజ్, జానపద గాయకులు భేరూ సింగ్‌చౌహాన్ , భక్తి పాటల గాయకుడు హరీందర్ సంగ్ శ్రీనగర్ వాలే , జానపద సంగీత కళాకారులు జయచరణ్ భటారి , శాస్త్రీయ సంగీత గాయకులు కె చనకకుట్టి అమ్మ, గాయకులు మహాబీర్ నాయక్, నటుడు మమత శంకర్‌కు పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి తమ చేతుల మీదుగా కరతాళధ్వనుల నడుమ అందించారు. ఈ ఏడాది ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్ , 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించారు. వీరిలో కొందరు ముందుగానే పద్మాలు తీసుకున్నారు. మిగిలిన వారు ఇప్పుడు అందుకున్నారు. పద్మ పురస్కారాల కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, భార్య బ్రాహ్మణి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.