Wednesday, January 22, 2025

నందమూరి కుటుంబంలో పెను విషాదం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్ : ప్రముఖ హీరో నందమూరి తారకరత్న (40) కన్నుమూశారు. గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయనను కాపాడటానికి విదేశీ వైద్యబృందం శతవిధాల ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. ఎన్టీఆర్ కుమారుడు, ప్రముఖ ఛాయాగ్రాహకుడు నందమూరి మోహన్ కృష్ణ తనయుడైన తారకరత్న 1983 జనవరి 22న జన్మించారు. తారకరత్నకు భార్య అలేఖ్య, కుమార్తె నిషిత ఉన్నారు. తారకరత్నకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. బాలకృష్ణ ప్రోత్సాహాంతో సినిమాల్లోకి ప్రవేశించారు. ఒకటో నెం కుర్రాడు చిత్రంలో హీరోగా వెండితెరపై రంగప్రవేశం చేశారు. తారకరత్న హీరోగా దాదాపుగా 23 చిత్రాల్లో నటించారు. పలు సినిమాల్లో ప్రతినాయకుడిగా పాత్రల్లో కనిపించారు.

ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, భద్రాది రాముడు, అమరావతి, వెంకటాద్రి, సారధి చిత్రాలు తారకరత్నకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అమరావతి సినిమా ఆయనకు ఉత్తమ విలన్‌గా నంది అవార్డును తీసుకొచ్చింది. ఈ చిత్రం 2009లో విడుదలైంది. తారకరత్న 2022లో ఓటీటీకి ఎంట్రీ ఇచ్చారు. నైన్ అవర్స్ వెబ్‌సీరీస్‌లో నటించారు. చివరిగా సారధి సినిమాలో కనిపించారు. జనవరి 26న టిడిపి యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. కుప్పం పూజా కార్యక్రమాల అనంతరం లోకేశ్‌తో కలిసి పాదయాత్ర ప్రారంభించిన ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలారు.

ఈనెల 20న అంత్యక్రియలు

ఈనెల 20న తారకరత్న అంత్యక్రియలు నిర్వహిస్తారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బెంగుళూరు నుంచి తారకరత్న భౌతికగాయాన్ని శనివారం రాత్రికి హైదరాబాద్ ~- శంకరపల్లి సమీపంలోని మోకిల గ్రామంలో ఉన్న ఆయన స్వగృహానికి తీసుకురానున్నారు. సోమవారం అభిమానుల సందర్శనార్ధం ఆయన పార్ధీవదేహం ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్‌కు తరలించనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సాయింత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

తారకరత్న మృతి..
ప్రముఖుల సంతాపం… దిగ్భ్రాంతి
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, నందమూరి తారక రత్న మృతి పట్ల రాష్ట్ర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తారకరత్న మా కుటుంబానికి విషాదం మిగిల్చి వెళ్లిపోయాడని టిడిపి జాతీయ అధినేత నారా చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. తారకరత్న మరణవార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించిందన్నారు. నందమూరి తారక రత్న మృతి పట్ల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, టిపిసిసి అధ్యక్షులు, ఎంపి రేవంత్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, రాష్ట్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. చిన్న వయస్సులోనే సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తారకరత్న మరణం సినీ రంగానికి తీరని లోటు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని వారు వ్యక్తం చేశారు.

* ఆ గొంతు ఇక నాకు వినిపించదు.. : నారా లోకేష్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి

బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగులు చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, పార్టీకి తీరని లోటు. నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకి కన్నీటి నివాళి.

* తారకరత్న మృతితో నారా లోకేష్ యువగళం పాదయాత్రకి బ్రేక్..

నందమూరి తారకరత్న మృతితో టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా వేశారు. తారకరత్నకి నివాళులు అర్పించేందుకు లోకేష్ ఆదివారం (నేడు) ఉదయం హైదరాబాద్‌కు రానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News