ముంబై: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని తనకు చదువును ప్రసాదించిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి), బాంబేకు మంగళవారం భారీ విరాళం అందచేశారు.
తన ఉన్నతికి కారణమైన ఐఐటి బాంబేకు అక్కడి పూర్వ విద్యార్థిగా రూ. 315 కోట్ల విరాళాన్ని ఆయన ప్రకటించారు. ఐఐటి బాంబేతో తన అనుంబంధం స్వర్ణోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆయన ఈ విరాళాన్ని ప్రకటించారు. ఒక పూర్వ విద్యార్థి తాను చదువుకున్న విద్యాసంస్థకు ఇంత భారీ మొత్తంలో విరాళాన్ని అందచేయడం భారత్‌లో ఇదే మొదటిసారి.
1973లో ఐఐటి బాంబేలో ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో నీలేకని చేరారు. ఈ విరాళాన్ని ఎలా వినియోగించాలన్న విషయమై ఐఐటి బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌదరి, నందన్ నీలేకని కలసి అవాగామనా ఒప్పందం(ఎంఓయు)పై సంతకాలు చేసినట్లు ఐఐటి బాంబే పిఆర్‌ఓ తెలిపారు. ఈ విరాళంతో ఐఐటి బాంబేలో ప్రపంచ స్థాయి మౌలిక సౌకర్యాల కల్పన, ఇంజనీరింగ్, టెక్నాలజీలో పరిశోధనలకు ప్రోత్సాహం, డీప్ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ కల్పనకు వినియోగిస్తారని పిఆర్‌ఓ తెలిపారు.