Friday, February 21, 2025

తెలుగు నాటక రంగ పరిణామం నంది నాటక పోటీలు మేలు చేస్తున్నాయా?

- Advertisement -
- Advertisement -

విభజన ముందూ, తర్వాత కూడా, ఆంధ్ర ప్రభు త్వం వారు జరుపుతున్న నంది నాటక పోటీలను, నిజానికి మిగతా పరిషత్తు లాంటిదే, అయినా వారు నాటక పరిషత్తు అని అనటం లేదు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 85 పైగా పరిషత్తులు ఉన్నాయని విభిన్న సంస్థల వివరాలని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం సుమారు 175 నాటక సంస్థలున్నాయనీ, అందులో 35-40 సంస్థ లు ఎక్కువ పరిషత్తుల్లో పాల్గొంటున్నాయని కూడా తెలుగు నాటక కార్యకర్తలు అంటున్నారు. ఈ పరిషత్తుల పరిణామాలు, అందులోంచి ఉత్పత్తయ్యే ముఖ్య ప్రశ్న ‘తెలుగు నాటక అభివృద్ధికి, నంది నాటక పోటీలు సహాయపడుతున్నాయా’?. ఈ విషయం మీద చర్చచేసేముందు, ఆధునిక తెలుగు నాటకరంగ పరిణామం సూక్ష్మంగా చూద్దాం.

ఆధునిక తెలుగు నాటకరంగం 1860 దరిదాపుల్లో మొదలయిందని నాటక విజ్ఞులంటారు. అంతకు ముందు విరివిగా ఉన్నవి జానపద నాటక రూపా లు, కూచిపూడి భాగవతాలు. మన జానపద రూపా ల్లో వీధినాటకాలు కూడా భాగంగా ఉండేవి.
ఆధునిక తెలుగు నాటకం మీద పార్సీ నాటకప్రక్రియ, ఆ ప్రక్రియలోంచి పుట్టుకొచ్చిన ధార్వాడ్ నాటకాల ప్రభావం బాగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ వొరవడి లోంచి వచ్చినవే మన పద్యనాటకాలు. 1919 నుండి 1930 వరకూ తెలుగు నాటకరంగాన్ని పద్యాల యుగంగా పేర్కొనవచ్చు. పద్యాలను రాగాల వరుసతో చదవడం ప్రారంభించిన నాటకాలు రానురాను భావానికి తిలోదకాలిచ్చి రాగానికే ప్రాధాన్యతనిచ్చాయి. అంటే ఒకరకంగా తెలుగు నాటకం రాగాలాపన నాటకమైపోయింది. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలూ ఇతర దేశాలకి చెందిన నాటకాలు సమకాలీన సమస్యలను తమ ప్రదర్శనలలో ప్రతిబింబించాయి.

ఈ పరిణామంతో అప్పుడు, 1920 ఆఖర్లల్లో, తెలుగు నాటకాన్ని సరికొత్త మార్గంలోకి మలుపు తిప్పాలన్న ఆలోచన నాటకరంగ ప్రముఖుల్లో మొదలయింది. దాని ఫలితమే 1929 జూన్ 19న ఆంధ్ర నాటక కళా పరిషత్తు ఆధ్వర్యంలో తెనాలిలో జరగడం. ఆంధ్ర నాటక కళాపరిషత్తు మొదటి సదస్సులో ఈ సంస్థ ప్రతీ యేటా నాటకోత్సవాలను నిర్వహించాలని, ఆ సభలో నాటకరంగ ప్రముఖులచే – నాటక ఇతివృత్తం; నటన రంగస్థల ప్రదర్శనలాంటి అంశాలపై మాట్లాడించాలని నిర్ణయించారు. (సూచిక: తెర తీయగరాదా – తెలుగు నాటకరంగ మలుపులు మజిలీలు -2014). ఆంధ్రనాటక కళాపరిషత్తు ప్ర యత్నం విజయవంతం కావడం, 1960లలో కొ న్ని మంచి పరిషత్తులకి జీవం పోయడం జరిగింది. వాటిలో ముఖ్యమయినవి:లలిత కళానికేతన్ – రాజమండ్రి, రాఘవ పరిషత్ – విజయనగరం, హిందూస్థాన్ షిప్ యార్డ్ పరిషత్తు – విశాఖపట్నం, అమలాపురం, జి.యెస్.ఆర్సి పరిషత్తు- విజయవా డ, బిహెచ్‌ఈల్-, హైదరాబాద్. ఈ పరిషత్తులలో పాల్గొన్న కళాకారులకి, దర్శకులకీ, రచయితలకీ, ప్రదర్శకులకూ ఒక సృజనాత్మక దృక్పధం ఉండేది. ఈ పరిషత్తులలోంచే ఇప్పటికీ మనం ఒకింత ఆ ప్యాయంగా చెప్పుకునే ప్రముఖ నాటక రచయిత లు, దర్శకులు, నటులు, నటీమణులు వచ్చేరు. ఇం కో ముఖ్యమయిన సంగతి కూడా ఇక్కడ చెప్పుకోవాలి.

ఆ పరిషత్తులలో అన్నీ నాటకాలు టికెట్లు నాటకాలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ పరిషత్తులు ఆ రోజుల్లో సాంఘిక నాటకాలకి గుర్తింపు తీసుకువచ్చినా, పద్యనాటకాలు కూడా ముమ్మరంగా ఆడబడుతూనే వుండేవి. ఆ ముఖ్యమయిన పరిషత్తుల విజయాలని చూసాక ప్రతి వూరులోనూ పరిషత్తులు పుట్టగొడుగులలాగా వచ్చేశాయి. అక్కడ మొదలయింది తెలుగు నాటక తిరోగమనం తొలి మెట్టు. పరిషత్తుల్లో ఉండే బహుమతులను దృష్టిలో పెట్టుకొని నాటకాలు రాయడం అప్పుడు మొదలయింది. పరిషత్తుల ఉధృతి పెరిగాక 1965లోనే ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారు కళావని ప్రత్యేక సంచికలో వీటిని విమర్శిస్తూ ఇలా అన్నారు. ‘ఇప్పుడున్న పరిస్థితిలో ఈ పోటీలు నాటక రంగానికి ఏమంత మేలు చేయటం లేదేమోనని నా అనుమానం. పది నాటకలాడినప్పుడు ఏదో ఒక నాటకానికీ, ఒక ప్రదర్శనకీ, ఒక నటుడికీ, ఒక నటికీ, ఉత్తమ బహుమతి వస్తుంది. దాన్నిబట్టి ఏమీ రుజువు కాదు. ఆ నాటకానికీ, నటులకీ అనుమానస్పదమయిన కీర్తితప్ప ఇంకేమి దక్కకపోవచ్చు. ఆ నటులకు నటన వృత్తిగా పెట్టుకొనే అవకాశం కనుచూపు మేరలో ఎక్కడ లేకపోవచ్చు.’ 50 ఏళ్ళ తర్వాత కూడా ఈ మాటలెంత నిజమో

ఈ మధ్య జరుగుతున్న పోటీలలో నాటక-నాటికల విలువలు చూస్తే బాగా కనిపిస్తోంది. ఈ రకంగా ఈ నాటక పరిషత్తులు నాటకరంగాన్ని నిర్వీర్యం చేస్తుంటే, 1999లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నంది నాటకోత్సవాలని నాటకరంగం పునరుద్ధరణ పేరుతో మొదలుపెట్టింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పరిషత్తుని మొదలుపెట్టింది. 2014లో రాష్ట్ర విభజన జరిగాకా 2015లో ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి ఈ నంది నాటక పోటీలకు పునర్జీవనం కలిగించింది. 21 రోజులు రాజమండ్రిలో అట్టహాసంగా నడిచిన ఈ నంది పరిషత్తులో చివరి రోజు గొడవలు తప్పితే తెలుగు నాటకం గర్వపడే నాటకాలు వచ్చినట్టు దాఖలాలు లేవు. ఈ రాష్ట్ర పరిషత్తుల్లోనూ అవే బహుమతులు, ఆ బహుమతుల కోసమే రాసిన మూసబారు నాటకాలు. అన్నీ కొత్త నాటక-నాటికలే ఉండాలన్న నిబంధనతో యెన్నో కొత్త నాటకాలు, నాటికలు, ఈ నంది పరిషత్తు ధర్మమా అని వచ్చేయి. అయినా ఆ రోజుల్లో చెప్పుకున్న భయం, రాగరాగిణి, మరోమొహంజొదారో, నిజం, బొమ్మలాట లాంటి నాటకం ఒక్కటి కూడా కనపడదు.

100 యేళ్ళ తర్వాత కూడా ఇప్పటికీ ‘కన్యాశుల్కం’ నాటకమే అందరికీ తెలిసిన గొప్ప ఆధునిక తెలుగు నాటకం. నంది పరిషత్తు వల్ల తెలుగు నాటక రంగానికి యెలాంటి మంచీ జరిగినట్టు యెక్కడా దాఖలాలులేవు.
ఈ నంది పరిషత్తులో ఇంకో తమాషా జరిగింది. ఒక ప్రఖ్యాత రచయిత మూడు నాటికలు ఒకే అంశం మీద – ఇద్దరు స్వంతబంధువుల మధ్య డ బ్బు కోసం ఉండే తగాదాల్ని, ఆ స్వంతబంధువుల వరసలు మార్చి రాసిన నాటికలను 3 నంది పరిషత్తులలో ప్రదర్శిస్తే, వారికి మూడుసార్లూ ఉత్తమ రచయిత బహుమతి వచ్చింది. ప్రతీ పరిషత్తుకీ మారిపోయే న్యాయనిర్ణేతలకి ఈ సంగతి తెలియక పోవచ్చు, ఒకవేళ తెలిసినా అంత ప్రఖ్యాత రచయితని కాదనే గుండె ధైర్యం వారి కుండదు. ఇలాంటి ముచ్చటలెన్నో ఉన్నాయి ఈ నంది పరిషత్తుల్లో.

ఇక్కడ ఇంకో ఆసక్తి కరమయిన విషయం చెప్పుకోవాలి. ఇన్ని పరిషత్తులలో, నంది పరిషత్తుతో సహా, ఉధృతంగా సాంఘిక నాటకాలు ప్రదర్శింపబడ్డా, ఇప్పటి దాకా ప్రతిష్ఠాత్మకమయిన కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాలు, నటనలో పద్యనాటక కళాకారులు,స్థానం నరసింహారావు (1961), బందా కనకలింగేశ్వర రావు (1963), కె.రఘురామయ్య (1973), పీసపాటి నరసింహమూర్తి (1983) గార్లకు వచ్చాయి. ఆధునిక సాంఘిక నాటక విభాగంలో రచనకి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ అయిన డా.డి.విజయభాస్కర్ గారికి 2010లోనూ, 2012లో సాంప్రదాయ నాటక ప్రక్రియలో సురభి బాబ్జీ గారికి దక్కాయి.

అయినా కూడా తెలుగు నాటక రంగాన్ని ఉద్దరించడానికి కంకణం కట్టుకున్న తెలుగు నాటక ప్రముఖలకీ, విమర్శకులకీ ఈ విషయం దృష్టిలోకి రావటంలేదు సరికదా ఇంకా నంది నాటక పరిషత్తును భుజాన వేసుకొని తిరుగుతూనే ఉన్నారు. ప్రభుత్వం ఈ వ్యర్ధమయిన నంది పరిషత్తుకి ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు వృధాగా ఖర్చు పెడుతోందో ఆలోచించే నాధుడే లేకపోవడం తెలుగు నాటక జాతి దురదృష్టం. మిగిలిన అన్ని ప్రక్రియలకు సంబంధించి విమర్శకులున్నారు, నిష్పక్షపాతంగా ఆయా ప్రక్రియలలో వచ్చిన ప్రయోగాలను తులనాత్మకంగా పరిశీలిస్తారు, కొన్ని సందర్భాలలో ఆ విమర్శనాత్మక విశ్లేషణల వల్ల ఆ రంగానికి ఎంతో మేలు జరుగుతుంటుంది. దురదృష్టవశాత్తు, తెలు గు నాటక రంగంలో అలాంటి విమర్శకులు గాని, విశ్లేషకులు గానీ లేరు. ఇప్పటి దాకా జరిగిన నంది పరిషత్తుల మీద కానీ మిగతా పరిషత్తుల మిద కానీ విశ్లేషక సమీక్షలు వచ్చినట్టు నేనెక్కడా వినలేదు. ఇది కూడా తెలుగు నాటక లోపాల్లో ఒకటి. ఇన్ని కోట్లు నాటకరంగం అభివృద్ధి పేరిట ఖర్చుపెట్టినా, ఇన్ని నంది నాటక పరిషత్తుల తర్వాత కూడా గత 10 సంవత్సరాలలోనూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు ప్రతీ ఏటా జరిపే భారత రంగ మహోత్సవంలో ఒక్క తెలుగు నాటకం కూడా ప్రదర్శించబడలేదు. సుమారు 100 నాటకాలు ప్రదర్శించే ఈ ఉత్సవంలో (ఉత్సవం – పరిషత్తు కాదు) ఒక్క తెలుగు నాటకం కూడా గత 10 సంవత్సరాలుగా లేదంటే తెలుగు నాటక కార్యకర్తలందరూ ఆలోచించవలసిన విషయం.

అంతకుముందు కొన్ని నాటకాలు ప్రదర్శింతమయ్యాయి కానీ, అవి వాటి గొప్ప వల్ల కాక కీర్తిశేషులు గరిమె ళ్ళ రామమూర్తి గారి ప్రయత్నంవల్ల ప్రదర్శింపబడ్డాయి. నాటకరంగంలో జరుగుతున్న (మిగతా భాషల్లో) పరిణామాలు, నాటక ప్రక్రియలో వస్తున్న మార్పులు తెలుగు నాటకరంగానికి దూరం.
నాటకం ఒక సమాచార సాధనం కాబట్టి, అది ప్రజలకి సులభంగా అర్ధం కావడం కోసం వారికి బాగా తెలిసిన జానపద ప్రక్రియలని, ప్రజల పాటలని విస్తృతంగా వాడుకుంటున్నారు మిగతా భాషలలోని నాటకకారులు. కానీ 95ు తెలుగు నాటకాలు మాత్రం ఇప్పటికీ ఒక ఇంటి డ్రాయింగ్ రూం సెట్టుతోనే ఉంటాయి. మన తెలుగు నాటకంలో ఇంకో ముఖ్య సమస్య ఏమిటంటే ప్రతీ నాటకం ఒక సందేశంతో ము గించబడాలి. దాని కోసం చివర్లో అర్ధంలేని మెలోడ్రామాలు చాలా నాటిక/నాటకలలో కనిపిస్తాయి.

ఇక్కడ కొడవటిగంటి కుటుంబరావు గారు 1980 లో చెప్పిన మాటలను నెమర వేసుకోవచ్చు: ‘కొత్తగా వచ్చే నాటకాలను అంచనా వేయడానికి మ నం కన్యాశుల్కం గీటు రాయిగా ఉపయోగించవ చ్చు. నాటకానికి సంబంధించిన అనేక విలువలు అందులో నిర్దుష్టంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకి అందులో ‘నాటకీయత’ కోసం ఎగదోసిన పాత్ర లేదు. ఏ పాత్రకు ఉండే ప్రాముఖ్యం దానికున్నది. పాత్ర చిత్రణలోనూ, సంభాషణలోనూ వాస్తవికత గురించి చెప్పనే అఖర్లేదు. కన్యాశుల్కం ఈనాటి జీవితాన్ని కానీ వ్యక్తులను కానీ ప్రతిబింబించదు. అయినా రచన రీత్యా అది ఎంచదగిన నాటకం. అప్పారావు గారు తన కలంపాళీలో ఇమడని పాత్రలను తీసుకోలేదు. కన్యాశుల్కం దురాచారాన్ని ప్రచారం చేయడానికి అప్పారావుగారు సుబ్బిని నూతిలో పడేయలేదు, ఎవరినీ చంపలేదు. కానీ ఉన్న హైన్యం చక్కగా చిత్రీకరించారు. (నాటకాలలో సామాజిక దృక్పథం – కొడవటిగంటి కుటుంబరావు – 1980) .

ఈ పరిస్థితుల్లో నాటక కార్యకర్తలందరూ మనస్సు పెట్టి ఈ కింది విషయాలను తప్పక ఆలోచించవలసిన సమయమొచ్చింది. అలాగే ప్రభుత్వమూ, ప్రభుత్వానికి సలహాలిచ్చే పెద్దలూ కూడా ఆలోచించవలసిన ప్రశ్నలు (విషయాలు) ఇవి:
ఆధునిక తెలుగు నాటకరంగానికి 135 ఏళ్ళ వయసొచ్చింది. పరిశోధనలూ అనేకం జరిగాయి. తెలుగు నాటకరంగంలో పెరిగిన నైపుణ్యం ఎంత? జాతీయ వేదికలపైన ప్రభావశీలంగా ప్రదర్శించబడ్డ నాటకాలెన్ని? సుమారు 80కి పైగా పరిషత్తులలో, ప్రభుత్వ నందిపరిషత్తుతో సహా, ప్రతి యేటా నాటక ప్రదర్శనలు జరుగుతూ ఉండే తెలుగు ప్రాంతంనుండి

జాతీయ స్థాయి గుర్తింపు పొందిన నాటక రచయితలో, నటులో, దర్శకులో ఎంతమంది?
తెలుగు నాటకరంగం ఇంకా ఔత్సాహిక రంగపు పరిధిని దాటిందా లేదా, లేకపోతే బాధ్యులెవరు?
తెలుగు సాంఘిక నాటక రంగంలో శిక్షణ పొందిన వృత్తి కళాకారులు ఎంతమంది?
తెలుగు ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాల థియేటర్ విభాగాల నుండి ఉత్పత్తి అవుతున్నవారిలో ఎంతమంది తెలుగు నాటకరంగంలో ఉన్నారు? ఎంత మంది తెలుగు నాటక అభివృద్ధికి తోడ్పడుతున్నారు?
ప్రభుత్వం ఇతర పరిషత్తు నిర్వహకుల మాదిరిగానే నాటకోత్సవాలను నిర్వహించడంతో నాటకరంగానికి ప్రోత్సాహం ఇచ్చినట్లేనా?

పరిషత్తు నిర్వాహణకి తెలుగు ప్రాంతాల్లో ఇన్ని సంఘాలుండగా మరలా ప్రభుత్వం నంది పరిషత్తు ద్వారా ఆశిస్తున్నదేమిటి?
జిల్లాల స్థాయిలో నాటకోత్సవాలను ప్రభుత్వం ఎందుకు నిర్వహించడంలేదు?
ప్రభుత్వం నంది పరిషత్తుకి ఖర్చు పెట్టే డబ్బుని నాటక శిక్షణ శిబిరాలు నాటక ఉత్సవాలు నడిపి, ప్రతీ ముఖ్యనగరంలోను ఒక ఆడిటోరియం నిర్మిం చి, నాటకరంగం ఇంకా వృద్ధి చెందేలా చూడవచ్చు. మన ప్రభుత్వానికి నాటకరంగ సలహాలనిచ్చే వారిలో విశ్వవిద్యాలయాల్లో నాటక పాఠాలు నేర్పే ఉపాధ్యయులెవరూ లేకపోవడం శోచనీయం.
నంది నాటక పరిషత్తులా కాక ఒక ఉత్సవంగా జరిపితే బావుంటుంది. (ఢిల్లీలో జరిగే రంగ మహోత్స వం లాగా) ఈ ఉత్సవాన్ని రెండుభాగాలుగా చేసి, ఒక భాగంగా ప్రతీ జిల్లాలో ఒక ఉత్సవం జరపాలి.

ఆ జిల్లా ఉత్సవాల్లో యెక్కువ సంస్థలకి పాల్గొనే అవకాశం ఉంటుంది. పాల్గొన్న ప్రతీ సంస్థకూ నగదు బహుమతి ఉండాలి. ప్రతీ జిల్లా నుంచి రెండు నాటకాలనూ రెండు నాటికలనూ యెన్నిక చేసి, రెండో భాగమయిన రాష్ట్ర ఉత్సవంగా జరపా లి. ఈ రాష్ట్ర ఉత్సవంలో అన్ని ప్రదర్శనలకీ ఒకే గు ర్తింపు ఉంటుంది, ఒకే నగదు బహుమతి ఉం టుంది. కేంద్రీయ సంగీత నాటక అకాడెమి 2005 వరకూ ఇలాగ రెండు భాగాల్లో నాటకోత్సవాలు జరిపేది. మొదటి భాగంలో ప్రాంతీయ ఉత్సవాలుండేవి. వాటిలో విజ్ఞులు యెన్నిక చేసిన ప్రదర్శనలను దేశఉత్సవంగా జరిపేవారు. ఈ ఉత్సవాలలో దేశస్థాయికి వచ్చిన ఒకే ఒక్క తెలుగు నాటకం సత్యానందం దర్శకత్వంలో ప్రదర్శింపబడ్డ ‘బొమ్మలాట’ నాటకం.

జిల్లాల ఉత్సవంలోనూ, రాష్ట్ర ఉత్సవంలోనూ కూడా ప్రదర్శనల తర్వాత వాటిమీద ఒక విశ్లేషణ జరిగితే ఆ విశ్లేషణలో కొత్త సంగతులు నాటక కార్యకర్తలందరికీ ఉపయోగపడేవి రావొచ్చు. ప్రతీ జిల్లాలోనూ వంతులవారీగా నాటక శిక్షణా కేంద్రాలని యేర్పాటు చేసి ఉత్సాహవంతులకు వృత్తి కళాకారులుగా మారే అవకాశం కలుగుతుంది. ఇవన్నీ చేస్తే తెలుగు నాటకం ఒక కొత్త పంథాలో పడవచ్చు.
ఢిల్లీ సుబ్రహ్మణ్యం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News