Saturday, November 23, 2024

తెలంగాణ కవులపై రాచపాళెం పరామర్శ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి సాహిత్యకారులు మొదటి నుండి వెన్ను దన్నుగా నిలిచారు. సాహిత్యం, కళాకారులు లేకుండా తెలంగాణ ఉద్యమం ఊహించడం కుదరదు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని దాశరధి కీర్తిస్తే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటూ గద్దర్ ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని తెలియజేశారు. జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం అంటూ అందెశ్రీ తెలంగాణ గొప్పదనాన్ని గేయ రూపంలో చాటి చెపితే, నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ అంటూ నందిని సిధారెడ్డి తెలంగాణ గురించి రాశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది సాహిత్యకారులు తెలంగాణ కోసం సాహిత్యాన్ని సృష్టించారు. వివిధ దశల్లో, వివిధ రూపాల్లో అవసరానికి తగినట్లు తెలంగాణపై సాహిత్యాన్ని సృష్టించిన కవులు, రచయితలు ఎంతో మంది ఉన్నారు.

అటువంటి కొంతమంది కవులపై ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి ‘కవుల తెలంగాణం’ శీర్షికతో 2016లో వ్యాస సంపుటిని సాహిత్య లోకానికి అందించారు. 207 పుటలు ఉన్న పుస్తకంలో 17 వ్యాసాలు ఉన్నాయి. అంటే 17 మంది తెలంగాణ కవుల కవిత్వంపై రాసిన వ్యా సాలు అనమాట. పుస్తకానికి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ పరిచయ వాక్యాలు రాశారు. ఈ పరిచయ వాక్యాల్లో ఆచార్య ఎస్వీ సత్యనారాయణ విలువైన వాక్యాలు మీ కోసం. సమాజం-సాహిత్యం ఈ రెంటి కీ ఉన్న సంబంధం ఇచ్చి పుచ్చు కోవడం వంటిదే. సమాజం నుండి ముడి సరుకు తీసుకొని, రచయిత కళాత్మకంగా మళ్ళీ సమాజానికి అందిస్తాడు.

దీని అర్థం సమాజంలో జరిగే వివిధ పరిణామాలను రచయితలు, కవులు సాహిత్య వస్తువుగా తీసుకొని సృజనాత్మకతను జోడించి, మంచి చెడులను విశ్లేషించి మళ్ళీ సమాజానికి అందిస్తారు. ఈ సందర్భంలో సమాజంలో జరిగే పరిణామాలకు అనుగుణంగా సాహిత్యకారులు వారి సాహిత్యాన్ని సృష్టిస్తూ సమాజ బాగు కోసం తమ విధులను నిర్వహిస్తూ ఉంటారు. కవుల్ని రెండు రకాలుగా విభజించిన సత్యనారాయణ. 1. ఏదో కొంత రాసి సంతృప్తి పడిపోయి విశ్రాంతి తీసుకునేవారు. 2. ఎంత రాసిన ఇంకా రాయల్సిందేదో ఉందని భావించి రచనను కొనసాగించేవారు.

తెలంగాణలో రెండవ రకం కవులే అధికంగా ఉన్నారు. ఉదాహరణకు డా. ఎన్ గోపినే తీసుకుంటే గత నలభై సంవత్సరాలుగా కవిత్వాన్ని రాస్తూనే ఉన్నారు. వారిని ఒకసారి కలుసుకున్నప్పుడు వారు అన్న మాటలు నేను ఇంకా రాయాల్సింది ఎంతో ఉందని. ఇలా చాలా మంది కవులు వారి తుది శ్వాస వరకు రాశారు. ఆ వరుసలో సినారె, కాళోజీ ఉంటే ఇప్పటికీ రాస్తూనే ఉన్నవారు గోరేటి వెంకన్న, అందెశ్రీ, నందిని సిధా రెడ్డి, డా. ఎన్ గోపి, ఎస్వీ సత్యనారాయణ ఉన్నారు. మనల్ని విడిచి వెళ్ళిన కవుల నుండి ఇప్పటికీ కవిత్వాన్ని రాస్తున్న కవులను రాచపాళెం పరామర్శ చేశారు. స్వాతంత్రోద్యమ కవిగా కాళోజీని గుర్తించిన రాచపాళెం ఉద్యమ కవులను రెండు రకాలుగా విభజించారు.

1. ఉద్యమంలో పాల్గొని కవిత్వం రాసినవాళ్లు. 2. ఉద్యమానికి మద్దతుగా కవిత్వం రాసినవాళ్లు. ఇందులో కాళోజీ మొదటి రకం కవిగా రాచపాళెం తెలిపారు. అనుభవించి రాసిన కవిత్వానికి, మద్దతు తెలుపుతూ రాసిన కవిత్వానికి చాలా తేడా ఉంటుంది. కాళోజీ అనుభవించి రాసిన కవిత్వం కనుక, వారి కవిత్వం ఇంకా తెలంగాణ నాలుకపై పచ్చ పచ్చగా పూస్తూనే ఉన్నది. స్వాతంత్రోద్యమ కాలానికి కాళోజీ కవిత్వంలో నాలుగు పార్శ్యలను రాచపాళెం గుర్తించారు.
1.బ్రిటిష్ వ్యతిరేకత, 2. నిజాం వ్యతిరేకత, 3.ఆంధ్య్రోధ్యమ స్పూర్తి 4.వర్గ సంఘర్షణ. కాళోజీది సుదీర్ఘ సాహిత్య ప్రయాణం అందులో స్వతంత్ర ఉద్యమం దగ్గర నుండి తెలంగాణ ఉద్యమం వరకు వారి కవిత్వం విస్తరించి ఉన్నది. వారి ఒక్క వాక్యం నేటికి గుర్తు చేసుకుంటూనే ఉంటాము, అనేక మంది కోట్ చేస్తూనే ఉంటారు.అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక ఈ వాక్యం చాలు వారిని మహా కవిగా గుర్తించడానికి. దాశరధిపై రాసిన వ్యాసంలో దాశరధిలో నాలుగు రకాల కవులను రాచపాళెం గుర్తించారు.

1. సంప్రదాయ కవి, 2. భావకవి, 3. అభ్యుదయ కవి, 4. తెలంగాణ కవి, ఇది దాశరధి పరిణామ క్రమం. అవసరానికి తగినట్లు కవిగా తనను తాను నిర్మించుకుంటూ ముందుకు సాగారు. సంప్రదాయ కవిత్వం నుండి తెలంగాణ కవిగా మారడానికి కారణం సమాజమే. కవికి సమాజం వస్తువులను ఇస్తుంది. దానిని అనుసరిస్తూ కవి సమాజాన్ని ముందుకు నడపడానికి ప్రయత్నం చేస్తాడు. అందులో భాగమే దాశరధి సంప్రదాయ కవి నుండి తెలంగాణ కవి దాక కొనసాగారు. శ్రీశ్రీ ముందు సంప్రదాయ కవిత్వం నుండే మొదలై అభ్యుదయ, విప్లవ కవిగా రూపాంతరం చెందారు. అలాగే దాశరధిలో జాతీయ దృష్టి, రాష్ట్రీయ దృష్టి, తెలంగాణ దృష్టి ఉన్నాయని రాచపాళెం గుర్తించారు.

కవుల దృష్టి ఏంటో వారు రాసే కవిత్వమే తెలుపుతుంది. కొంతమంది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై కవిత్వం రాస్తే, మరికొంతమంది ప్రాంతాలకు అతీతంగా కవిత్వం రాస్తారు. ఇలా రాయాలంటే కవికి అధిక సమాచారం, అవగాహన, అనేక విషయాల పట్ల దృష్టి ఉండాలి. కవి పరిధి పెరుగుతూ పోతే కవి దృష్టి కూడా పెరుగుతుంది. ఒక సంఘటనపై అనేక మంది అనేక రకాలుగా స్పందిస్తారు. ఒకరు సమర్థిస్తే మరొకరు వ్యతిరేకిస్తారు. సంఘటనను ఒకరు ఒకలా చూస్తే మరొకరు మరోలా చూస్తారు. ఎవరు ఎలా చూస్తారో దాని బట్టే వారి దృష్టిని అంచన వేయవచ్చు. సినారేపై రాసిన వ్యాసంలో అభివ్యక్తి గురించి చెప్తూ ఒక రచయిత సామాజిక నేపధ్యం అతని అభివ్యక్తి ప్రక్రియకు వెన్ను దన్నుగా నిలుస్తుంది అంటే ఒకే వస్తువుపై అనేకమంది కవులు కవిత్వాన్ని రాసిన వారి అభివ్యక్తిలో చాలా మార్పులు ఉంటాయి. దానికి కారణం వారి సామాజిక నేపధ్యమే. వారు పెరిగిన వాతావరణం, చూసిన సమాజపు ఛాయలు,

జీవించిన ప్రాంత అభివ్యక్తి వారి కవిత్వంలో కనపడుతూనే ఉంటుంది. భావవాదంతో సాధించేది కాలక్షేపం తప్ప, దాని వల్ల ఒనగూడే వేరే ప్రయోజనం ఏమీ లేదు భావవాదాన్ని అనుసరిస్తూ కవిత్వాన్ని రాస్తున్న కవులు దీని గురించి ఆలోచించాలి. భావ వాదాన్ని వదిలి అభ్యుదయ, విప్లవ కవిత్వం వచ్చిన తర్వాత ఇంకా భావవాదాన్ని పట్టుకొని వేలాడుతూ సాధించేది ఏమిటి? మేము మా తృప్తి కోసం కవిత్వం రాసుకుంటున్నాము అంటే మీ కవిత్వాన్ని మీ పుస్తకాల్లోనే దాచుకుంటే సరిపోతుంది. కవిత్వం సమాజాన్ని బాగు చేయకపోయినా పర్వాలేదు కానీ తిరోగమన వైపు నడిపించకూడదు.
ఏ కవి తన తృప్తి కోసమే కవిత్వాన్ని రాయడు. ఒకవేళ మొదట్లో రాసిన సమాజం తన వైపుకు లాక్కుంటుంది. అలా జరగలేదు అంటే అది కవిత్వం కాదు. ఆ కవిత్వం వల్ల సమాజానికి ఎటువంటి ప్రయోజనం లేదు. అలాంటి కవిత్వాన్ని గుర్తించాల్సిన అవసరం లేదు. భారతీయ సమాజంలో శ్రామికవర్గం, విశ్రాంతి వర్గం అనే రెండు వర్గాలు ఉన్నాయి.

విశ్రాంతి వర్గ కులాలు శ్రామికవర్గ కులాలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోడానికి అనేక వ్యవస్థలను వాడుకున్నారు. అందుకే తొలుత సాహిత్యం అగ్ర కులాల ఆధీనంలో ఉండేది. ఆ తర్వాతే దళిత కవిత్వం, మైనార్టీ కవిత్వం, బీసి కవిత్వం, స్త్రీవాద కవిత్వం వచ్చాయి. ఆశారాజుపై రాసిన వ్యాసంలో వచన కవులను మూడు రకాలుగా విభజించారు రాచపాళెం.
1. విపరీతమైన భావ, పద చిత్రాలతో రీడర్స్ కి అర్థం కాకుండా రాసేవారు. 2. వార్తకు వచన కవిత్వానికి మధ్య ఉండే సున్నితమైన సరిహద్దును చెరిపేసి కవిత్వాన్ని పలచన చేసేవారు. 3. రెండు రకాల వారికీ భిన్నంగా వస్తువును ఆవిష్కరించడానికి అవసరమైన భావుకతను జోడించి వస్తురూపాల మధ్య సమన్వయాన్ని సాధించే వాళ్ళు. ఇందులో ఆశారాజు ని మూడో రకం కవిగా అభివర్ణించారు రాచపాళెం. ఈ మధ్య కాలంలో మొదటి రకం కవులు మూడో రకం కవులపై దాడి చేస్తున్నారు. వాస్తవానికి రీడర్ కి అర్థం కానీ కవిత్వం రాసేది వారే అయినా అదే కవిత్వమని దబాయిస్తూ రెండో రకం, మూడో రకం కవులపై విరుచుకుపడుతున్నారు.

వారి పిచ్చి, ప్రేలాపన కవిత్వాన్ని ఇతరుల నెత్తిపై రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో కొందరు అధ్యక్షులుగా కొనసాగుతూ అటువంటి పనికిరాని కవిత్వ ఉద్యమాన్ని కొనసాగిస్తూ కవిత్వాన్ని రీడర్స్ కి దూరం చేస్తున్నారు. రెండో రకం కవులు వచన కవిత్వాన్ని ధ్వంసం చేసి వారు రాసిందే కవిత్వమనే భ్రమలో బతుకుతున్నారు. కనీసం వారి కవిత్వంలో మార్పులు ఎలా చేసుకోవాలో ఆలోచించడం లేదు. విమర్శను అంగీకరించలేరు. మాకు తోచింది మేము రాసుకుంటాము మీకెందుకు అనే రకం. కవులు తమ కవిత్వాన్ని తామే విమర్శించుకోవాలి. అప్పుడే కవిత్వంలో పురోగాభివ్రుద్ధి సాగించగలరు. విమర్శకులు కూడా అటువంటి కవిత్వాన్ని విమర్శ చేయకుండా మౌనంగా ఉండటం సాహిత్యానికి, సమాజానికి ద్రోహం చేసిన వారే అవుతారు.కవికి అక్షరం సాధనం, జనం సామగ్రి ఎంత గొప్ప వాక్యం ఇది. ఎంతో పరమార్థం ఉన్న వాక్యం. అక్షరాలతో సాధన చేయాలంటే కవికి సామాగ్రి కావాలి,

సామాగ్రి అంటే సంఘటనలు, జరిగే పరిణామాలు, అవే కవితా సామాగ్రి అవుతుంది. జనం నుండి సామాగ్రి తీసుకునే కవులు, అదే జనం కోసం కవిత్వాన్ని రాస్తారని అర్థం. కవులలో భావ స్పష్టత లేని కవులు, వస్తు రూపాలతో సమన్వయం లేకుండా రాసే కవులు, కొని తెచ్చుకున్న సంక్లిష్టతా జాడ్యమున్న కవులు, రీడర్స్ ని మరచిపోయి కవిత్వం రాసే కవులు ఉంటారు. ఇలాంటి వారి కవిత్వం కవితా లోకంలో విహరించలేదు.ఒక కవిత రాస్తే రీడర్స్ హృదయాల్లో నాటుకుపోవాలి. అలా కాకుండా ఇష్టం వచ్చిన భావ చిత్రాలతో కవిత్వాన్ని రాస్తే రీడర్స్ కి దూరం అవ్వడమే జరుగుతుంది.

ఒక సంఘటనకు తక్షణ స్పందన కవి సామాజిక జాగ్రదవస్థకు నిదర్శనం అన్నారు రాచపాళెం. ఇటీవల సంఘటనాత్మక కవిత్వం ఎక్కువగా వస్తోంది. అలాంటి కవిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన వాక్యమే ఇది. కవి నిరంతరం మేలుకొని ఉంటూ తక్షణం స్పందిస్తూ ఉండాలి కానీ ఈ మధ్య కాలంలో సంఘటనాత్మక కవిత్వంలో కవులు కవితా శిల్పాన్ని గాలికి వదిలేస్తున్నారు. అలా చేయడం వల్ల కవిత్వం పలుచబడుతోంది. కొత్తగా రాసే కవులు, అనుభవం లేని కవులు, కవిత్వం గురించి పూర్తిగా అవగాహన లేని కవులు ఇటువంటి కవిత్వాన్ని రాస్తున్నారు. ఒక ప్రాంత కవులను అధ్యయనం చేసి పుస్తకంగా తీసుకురావడం వల్ల ఆ ప్రాంత స్థితిగతులు తెలుస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News