Wednesday, January 22, 2025

అర్వింద్‌కు షాక్

- Advertisement -
- Advertisement -

Nandipet MPTC Aruna local leaders joins in TRS

బిజెపికి గుడ్‌బై చెప్పిన నందిపేట ఎంపిటిసి అరుణ, స్థానిక నేతలు
ఎంఎల్‌సి కవిత, నిజామాబాద్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్‌రెడ్డిల సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిక

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్‌లకు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నందిపేట ఎంపిటిసి అరుణ, స్థానిక నేతలు కాషాయ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వారంతా కలిసి హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఆర్మూర్ నియోజకవర్గం శాసనసభ్యుడు జీవన్‌రెడ్డి సమక్షంలో గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. నందిపేటలో బండి సంజయ్, అరవింద్‌లు పర్యటించిన కేవలం 24 గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం కాషాయపార్టీకి మింగుడుపడడం లేదు.

ఇరు పార్టీల మధ్య పరస్పరం మాటల యుద్దం జోరుగా కొనసాగుతున్న సమయంలో అదునుచూసి టిఆర్‌ఎస్ పార్టీ బిజెపికి గట్టి షాక్‌ను ఇచ్చినట్లు అయింది. ప్రధానంగా పసుపుబోర్డు తీసుకరాలేదని ఆర్మూర్‌లో రైతులు కొందురు నాలుగు రోజుల క్రితం ఎంపి అరవింద్‌పై దాదాపుగా దాడి చేసినంత పనిచేశారు. ఈ పరిణామానికి ఖంగుతున్న బిజెపి నేతలు ఇదంతా టిఆర్‌ఎస్ పనే అంటూ ఎదురుదాడి మొదలుపెట్టింది. అయితే మాట తప్పిన అరవింద్‌పై పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే….ఆ అక్కసును టిఆర్‌ఎస్‌పై పడి తీర్చుకోవడం ఏమిటని రాష్ట్ర మంత్రులు, ప్రధానంగా నిజామాబాద్‌కు చెందిన టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులంతా బిజెపిపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఇలా రెండు పార్టీల మధ్య ఆరోపణలు…ప్రత్యారోపణలు,విమర్శలు…ప్రతివిమర్శలు పెద్దఎత్తున చోటుచేసుకుంటున్నాయి.

ఇలాంటి తరుణంలో అరవింద్‌ను పరామర్శించేందుకు బండి సంజయ్ ఆర్మూర్‌లోని నందిపేటకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఆయన మాట్లాడుతూ, ఎంపిపై దాడి చేసిన వారిని ఖలిస్థాన్ ఉగ్రవాదులుగా పోల్చారు. అయితే రైతులను ఉగ్రవాదులతో పోల్చి రాజకీయ లబ్ది కోసం తమ గ్రామంలో పర్యటించిన బండి సంజయ్ తీరును గ్రామ బిజెపి నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. ఇందుకు నిరసనగానే ఆ గ్రామ ఎంపిటిసితో పాటు ఇతర బిజెపి నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామం బిజెపి నేతలకు తీవ్ర విస్మయాన్ని కలిగించగా…టిఆర్‌ఎస్ నేతలకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News