Monday, December 23, 2024

కొత్త కామెడీ టైమింగ్ చూస్తారు

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘అంటే సుందరానికీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నజ్రియా తెలుగులో హీరోయిన్ గా పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరో నాని మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
ఆయన ఒక జెమ్…
దర్శకుడు వివేక్ ఆత్రేయని కలసినప్పుడు, ఆయన కథ చెప్పినపుడు, పని చేస్తున్నపుడు ఆయన భవిష్యత్తు టాప్ డైరెక్టర్ అనే నమ్మకం బలంగా కలుగుతుంది. ఆయన రైటింగ్, డైరెక్షన్ అంత బావుంటాయి. నేను చూసిన దర్శకుల్లో వివేక్ ఒక జెమ్. తనకంటూ ఒక ఒరిజినల్ స్టైల్ వుంది. ఇది తన ప్రతి సినిమాలో కనిపిస్తుంది. తన సినిమా కథని ఇంకెవరికి ఇచ్చినా తన లాగా తీయలేరు. వివేక్ లాంటి దర్శకుడితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది.
భిన్నమైన కామెడీ టైమింగ్…
‘అంటే సుందరానికీ’లో నాకు చాలా భిన్నమైన కామెడీ టైమింగ్ వుంటుంది. ఇప్పటి వరకూ ఇలాంటి టైమింగ్ వున్న పాత్ర చేయలేదు. నా పాత సినిమాలకు, ఈ సినిమాకు ఎక్కడా మ్యాచ్ అవ్వదు. వివేక్ అలా మ్యాచ్ కాకుండా కొత్తగా రాసుకున్నాడు. నేను పాత నానిలా చేద్దామని అనుకున్నా చేయలేని విధంగా రాసుకున్నాడు. చాలా హిలేరియస్‌గా వుంటుంది. కొత్త నాని, కొత్త కామెడీ టైమింగ్ చూస్తారు. తప్పకుండా ప్రేక్షకులు అందరికీ నచ్చుతుంది ఈ చిత్రం.

పాత్రల మధ్యలో ఉన్నట్లుగా…
నేను ఈ సినిమాలో బ్రాహ్మణ కుర్రాడి పాత్ర పోషించాను. బ్రాహ్మణ పాత్రే కాదు కొన్ని ప్రత్యేక పాత్రలు, నేపథ్యాలు ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టి పాత్రల్లో నటించాల్సి వస్తుంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ సంప్రాదాయ బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చారు. ఇందులో చాలా ప్రామాణికమైన వాతావరణం కనిపిస్తుంది. చిన్న చిన్న వివరాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. సినిమా చూస్తున్నపుడు ప్రేక్షకులు కూడా పాత్రల మధ్యలో వున్నట్లు ఫీలవుతారు.
సుందర్ చాలా వరస్ట్ ఫెలో…
సినిమాలో సుందర్ అమాయకత్వం మాత్రం డిఫరెంట్ లెవెల్‌లో వుంటుంది. సినిమాకి ముందు.. సిగరెట్, మందు తాగవద్దని వార్నింగ్ వస్తుంది కదా.. మా సినిమాకి వచ్చేసరికి ‘సుందర్ మందు, సిగరెట్ తాగడు… ఈ ఒక్క విషయంలోనే వీడిని ఫాలో కావచ్చని” వస్తుంది. (నవ్వుతూ)… అంటే సుందర్ పాత్ర ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. సుందర్ ట్రైలర్, టీజర్‌లో కనిపిస్తున్నంత అమాయకుడు కాదు. దర్శకుడు వివేక్ అదే పాయింట్ ముందు చెప్పాడు. సుందర్ చాలా వరస్ట్ ఫెలో. సుందర్ వరస్ట్ యాంగిల్ అంతా అతని అమాయకత్వంలో బయటికి వస్తుంది.
‘నేను చేస్తా’ అని ఎగిరిగంతేసింది…
లీలా పాత్ర నజ్రియా చేస్తే బాగుంటుందని నేను, వివేక్ ఇద్దరం అనుకున్నాం. లీలా పాత్ర అనుకున్నపుడు నజ్రియా లా వుండే హీరోయిన్స్ ఎవరు ? అనే వెదకడం మొదలుపెట్టాం. ఎవరూ కనిపించలేదు. నజ్రియా లాగా ఎందుకు నజ్రియానే అయితే ఎలా వుంటుందని భావించి ఆమెను సంప్రదించాం. అప్పటికే చాలా పెద్ద సినిమా ఆఫర్లకి కూడా ఆమె ఒప్పుకోలేదు. అయితే ఈ కథ విన్నవెంటనే ‘నేను చేస్తా’ అని ఎగిరిగంతేసింది. లీలా పాత్రలోకి ఆమె రావడం, ఆ పాత్రకు న్యాయం జరిగింది.
పాటలు, ఆర్‌ఆర్ అద్భుతంగా చేశారు…
వివేక్ సాగర్ సినిమా కథకి ఒక ఆయుధం లాంటి సంగీత దర్శకుడు. ఒక కథని తన సంగీతంతో ఎంత ప్రభావవంతగా చెప్పాలో తెలిసిన సంగీత దర్శకుడు. ఈ సినిమా రిలీజ్‌కి ముందు వివేక్ గురించి ఏం మాట్లాడిన అతిశయోక్తి గానే వుంటుంది. వివేక్ పాటలు, ఆర్‌ఆర్ అద్భుతంగా చేశారు.
నెక్ట్స్ మూవీస్…
ప్రస్తుతం నేను చేస్తున్న ‘దసరా’ చిత్రం 25 శాతం షూటింగ్ పూర్తయింది. తెలుగులో వస్తున్న పవర్‌ఫుల్ రా మూవీ ఇది. ఇక నా ప్రొడక్షన్‌లో ‘మీట్ క్యూట్’ అనే సినిమా వస్త్తోంది. డైరెక్ట్ డిజిటల్ మూవీ ఇది. అలాగే హిట్ 2 సినిమా రానుంది. ఇది భారీగా వుంటుంది. ‘మేజర్’తో అడవి శేష్ హిట్ కొట్టారు. ‘హిట్ 2’ ఏమాత్రం తగ్గదు. ఈ ప్రాంచైజీ కొనసాగుతుంది.

Nani Interview About ‘Ante Sundaraniki’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News