నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘దసరా’ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. కీర్తి సురేష్ కథానాయికగా, నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోన్న దసరా సినిమా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న నేపధ్యంలో కరీంనగర్ లో ‘దసరా బ్లాక్‌బస్టర్ దావత్’ ఈవెంట్ ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఒదెలకు బిఎండబ్ల్యు కారుని బహుకరించారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. అలాగే సినిమా యూనిట్ సభ్యులందరికీ పది గ్రాముల గోల్డ్ కాయిన్స్‌ని కానుకగా ఇచ్చారు.
ఈ వేడుకలో నాని మాట్లాడుతూ “సినిమా ఇంకా మొదలుకాకముందు ‘నాని అన్నకి వంద కోట్ల పోస్టర్ చూడాలని కోరికగా ఉంది’ అని శ్రీకాంత్ మా కో డైరెక్టర్ వినయ్‌తో అన్నాడు. ఆ కోరిక ఈ వేదికపై తీరింది. దసరా సినిమాని థియేటర్‌లో ఎంత పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మేము చూశాం. మా కడుపు నిండిపోయింది. ‘దసరా’ ఎప్పటికీ గుర్తుపెట్టుకునే విజయం. ఈ సినిమాకు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, సుకుమార్… ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది దసరా సినిమా గురించి గొప్పగా పోస్టులు పెట్టి ప్రేక్షకులు అందరికీ రీచ్ అయ్యేలా చేశారు. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు”అని తెలిపారు.
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ “దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చాలా ప్రతిభావంతుడు. దసరా సినిమాను చాలా గొప్పగా తీశాడు. నాని ‘దసరా’తో మా తెలంగాణ బిడ్డగా మారిపోయాడు”అని అన్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ దసరా సినిమాని ఇంతపెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో దీక్షిత్ శెట్టితో పాటు చిత్ర బృందం పాల్గొంది.