హైదరాబాద్: ప్రపంచ వ్యవసాయానికి నానో యూరియా ఆదర్శమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పంటలు పండడానికి ప్రధానంగా భూమిలో పోషకాలు అవసరమని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో వ్యవసాయంలో ఎరువులు, రసాయనాల వాడకం, నానో యూరియా వాడాల్సిన ఆవశ్యకతపై జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయన్నారు. రసాయనిక ఎరువుల వాడకంలో గత ప్రభుత్వాలు అవగాహన కల్పించలేదని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. దేశంలో వినియోగించే 70శాతం యూరియా విదేశాల నుంచి దిగుమతి అవుతుందన్నారు. అత్యధిక ఎరువులు, యూరియా వాడకం వల్ల భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇటువంటి అనేక దుష్పరిణామాలను అరికట్టడం, రైతాంగానికి మేలు చేయాలి అన్న ఉద్దేశంతో తెలంగాణలో నానో యూరియాను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. తెలంగాణ వ్యవసాయం దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. నానో యూరియా వాడకంతో మరోసారి దేశానికి దిక్సూచిలా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇఫ్కో జీఎం డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, వ్యవసాయ శాఖ అదనపు కమీషనర్ హన్మంతు, అగ్రోస్ ఎండీ రాములు, మార్క్ ఫెడ్ ఎండీ యాదిరెడ్డి, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధకులు జగదీశ్వర్, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.