Monday, January 20, 2025

తల్లితో కలిసి ఢిల్లీకి బయలుదేరిన నారా లోకేష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిడిపి అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్ అక్రమం అనే విషయంపై జాతీయ స్థాయిలో మీడియాకు ప్రజెంటేషన్ ఇవ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఉన్న పరిస్థితులను జాతీయ స్థాయిలో తెలిసేలా వివరించాలని లోకేష్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గురువారం లోకేశ్ తల్లితో కలిసి ఢిల్లీకి వెళ్ళారు. ఈ అంశంపై జాతీయ మీడియాకు ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో జాతీయ స్థాయిలో స్పందన వచ్చింది. చంద్రబాబును రాజకీయకక్షతోనే అరెస్టు చేశారని అనేక పార్టీల నేతలు ఇప్పటికే ప్రకటించారు. జాతీయ మీడియా కూడా ఈ ఘటనపై విస్తృతంగా కవరేజీ ఇస్తోంది. దీంతో చంద్రబాబు మొత్తం ప్రజెంటేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపైనే కేసులు పెడుతున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. నాలుగేళ్ల కాలంలో ఎపిలో జరిగినన్ని అరాచకాలు దేశంలో ఎక్కడా జరిగి ఉండవని, వాటన్నింటినీ జాతీయ మీడియాకు వివరించాలని అనుకుంటున్నారు. టిడిపి ఆఫీసుపై దాడి చేసిన వారిపై ఒక్క కేసు కూడా పెట్టకపోవడం, అంగళ్లు, పుంగనూరులో చంద్రబాబు ర్యాలీపై రాళ్ల దాడులు చేసి తిరిగి చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేయడం వంటి వాటిని, లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పిన పరిస్థితులను జాతీయస్థాయిలో హైలెట్ చేయాలని లోకేష్ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఆధారాలు లేని కేసులను ప్రతిపక్ష నేతలపై ఎలా మోపుతున్నారో వివరించనున్నట్లుగా చెబుతున్నారు. వ్యాపార సంస్థలపై ప్రభుత్వం జరిపినదాడులు, మార్గదర్శి వంటి సంస్థలు, అమరరాజా వంటి దేశానికి ప్రాముఖ్యత తెచ్చిన సంస్థలపై జరిగిన దాడుల గురించి మీడియాకు తెలిపి అరాచక పాలన గురించి వివరిస్తారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

వ్యవస్థలను పూర్తి స్థాయిలో నాశనం చేసి న వైనాన్ని వివరించే అవకాశాలు ఉన్నాయి. 73 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబును పధ్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినా ఎఫ్‌ఐఆర్ లో పేరు లేకుండా, గవర్నర్ అనుమతి లేకుండా, కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన వైనాన్ని జాతీయ స్థాయిలో చర్చకు పెట్టే అవకాశం ఉంది. వీలైతే హోంమంత్రి అమిత్ షాను కూడా కలుస్తారని విశ్వసనీయ సమాచారం. ఈ అంశంపై స్పష్టత లేదు. కానీ ఏపీలో పరిస్థితుల్ని ఢిల్లీలో అందరి ముందు పెట్టాలని నారా లోకేష్ గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు కేసు విషయమై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర పరిస్థితులు, కక్ష రాజకీయాల పై పార్లమెంట్లోనూ చర్చించేలా తెదేపా వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ ఎంపిలతో లోకేశ్ మాట్లాడనున్నారు. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News