విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి వ్యాప్తిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమైన లోకేశ్.. దేశంలో డ్రగ్స్ సరఫరాలో ఏపీ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిపే డీఆర్‌ఐ నివేదికను సమర్పించారు.
దేశంలో ఏ గంజాయిని కనుగొన్నా దాని మూలాలు ఏపీలోనే ఉంటాయని, మాదకద్రవ్యాల కార్యకలాపాలకు రాష్ట్రం కేంద్రంగా మారుతోందని లోకేష్ ఉద్ఘాటించారు. అక్రమ హవాలా లావాదేవీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనంతరం లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా సమస్యలకు వైసీపీ నేతల ప్రమేయం కారణమన్నారు. ఈ నాయకులకు డ్రగ్స్ ఉత్పత్తి, స్మగ్లింగ్ కార్యకలాపాల్లో ప్రమేయం ఉందని ఆయన పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా యువతపై డ్రగ్స్ సంబంధిత ఘటనలు గణనీయంగా పెరిగిపోయాయని, ఇది విద్యార్థులపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోందని లోకేశ్ పేర్కొన్నారు.