Monday, January 20, 2025

రేపటి నుంచి మళ్లీ నారా లోకేశ్ పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: ఈ నెల 27 నుంచి టిడిపి యువనేత నారా లోకేశ్ మళ్లీ పాదయాత్ర చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5కోట్లమంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ జనగళమే యువగళంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 79రోజుల సుదీర్ఘ విరామానంతరం మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతోంది. సిఎం జగన్మోహన్ రెడ్డి అరాచకపాలన, అవినీతి బాగోతాన్ని ఎండగడుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడంతో అనివార్య పరిస్థితుల్లో సెప్టెంబర్ 9వ తేదీన కోనసీమలోని రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద యువనేత లోకేశ్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు.

తర్వాత దేశరాజధాని డిల్లీలో జగన్మోహన్ రెడ్డి అరాచకపర్వంపై న్యాయపోరాటం చేస్తూనే యువనేత లోకేశ్ జాతీయస్థాయి నేతల మద్దతు కూడగడుతూ జాతీయ మీడియాలో తమ గళాన్ని బలంగా విన్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న తీరును ఆమె దృష్టికి తెచ్చారు.అధినేతను అక్రమంగా నిర్బంధించి రాబోయే ఎన్నికల్లో లబ్ధిపొందాలనుకున్న జగన్ అండ్ కో కుట్రలను పటాపంచలుచేస్తూ న్యాయదేవత ఆశీస్సులతో చంద్రన్న త్వరలో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతున్నారు. తాజా పరిణామాలను పార్టీ పెద్దలతో చర్చించిన యువనేత లోకేశ్… అన్ని అడ్డంకులను అధిగమించి ఈనెల 27వతేదీ నుంచి గతంలో పాదయాత్ర నిలుపుదల చేసిన రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి యువగళాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించారు.

ఉమ్మడి తూర్పుగోదావరిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ కొనసాగనున్న యువగళం పాదయాత్ర… తుని మీదుగా ఉమ్మడి విశాఖ జిల్లాలోకి ప్రవేశించనుంది. కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంతనుంచి జనవరి 27వతేదీన ప్రారంభమైన యువగళం 208రోజులపాటు అప్రతిహతంగా కొనసాగి… 2852.4 కి.మీ.ల మేర పూర్తయింది. ఇప్పటివరకు 9 ఉమ్మడి జిల్లాల్లో 84 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. అనివార్యమైన సందర్భాల్లో మినహా యువగళం పాదయాత్రకు ఏనాడు విరామం ప్రకటించలేదు. అధికారపార్టీ వైఫల్యాలు, అవినీతిని యువనేత లోకేష్ మాటల తూటాలతో ప్రజాక్షేత్రంలో ఎండగట్టిన తీరు వైసిపి నేతలకు కంటిమీద కునుకులేకుండా చేసింది. 208రోజులపాటు సాగిన పాదయాత్రలో యువనేత లోకేశ్ కు 4వేలకు పైగావినతిపత్రాలు అందగా, లక్షలాది ప్రజలు నేరుగా కలుసుకొని తమ సమస్యలు చెప్పుకున్నారు.యువగళం పాదయాత్రలో కోటిమంది ప్రజలు యువనేతతో కనెక్ట్ అయ్యారు. చిత్తూరు జిల్లా నుంచి పశ్చిమగోదావరి జిల్లా వరకు యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ సకల కుట్రలు చేసినప్పటికీ ఉక్కుసంకల్పంతో సాగుతున్న యువగళం జైత్రయాత్రను అడ్డుకోవడం వారి తరం కాలేదు. దారి పొడవునా జనం యువనేతకు నీరాజనాలు పడుతూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెడుతున్నారు. చైతన్యానికి మారుపేరైన విజయవాడ వంటి నగరంలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తెల్లవారుజాము 3.30వరకు యువనేత కోసం రోడ్లపై ఎదురుచూడటం ఆయనపై నెలకొన్న అభిమానం, నమ్మకానికి అద్దం పడుతోంది. అన్నివర్గాల ప్రజలు యువనేతను కలుస్తున్నప్పటికీ ప్రత్యేకించి యువత, మహిళల్లో లోకేష్ సినీనటులను మించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. యువనేతతో ఫోటోలు దిగేందుకు ప్రతి రోజూ ఉదయం 8గంటలకే 2వేలమంది వరకు అభిమానులు క్యాంప్ సైట్ల వద్ద క్యూకట్టడమే ఇందుకు నిదర్శనం.

యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటకముందే రాష్ట్రంలో 108 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుపార్టీ విజయదుందుభి మోగించడంతో అధికారపార్టీలో ప్రకంపనలు పుట్టాయి. లోకేష్ పాదయాత్ర ప్రజాచైతన్యంలో సంపూర్ణంగా విజయం సాధించింది. యువగళం పాదయాత్ర రాయలసీమలో చరిత్ర సృష్టించింది. గతంలో మరే నాయకుడు చేయని విధంగా రాయలసీమలో 124రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకర్గాల మీదుగా 1587 కి.మీ. పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News