Wednesday, January 22, 2025

పురందేశ్వరి ఆ విషయం నీకు తెలియదా?: నారాయణ స్వామి

- Advertisement -
- Advertisement -

అమరావతి: బిజెపి ఎపి అధ్యక్షురాలు పురందేశ్వరిపై డిప్యూటీ సిఎం నారాయణ స్వామి మండిపడ్డారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ పెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన వ్యక్తి చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ఈ విషయం పురందేశ్వరికి తెలియదా? అని ఎద్దేవా చేశారు. 73 వేల బెల్ట్ షాపులు పెట్టించిన వ్యక్తి చంద్రబాబు కాదా? అని అడిగారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన హయాంలో 20 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారని, పురందేశ్వరికి ఇవి కనిపించడంలేదా? అని నారాయణ చురకలంటించారు.

నాలుగు వేలకు పైగా మద్యం షాపులు ఉంటే వాటిని తగ్గించి 2900 షాపులు మాత్రమే జగన్ ప్రభుత్వం నడుపుతోందని, బిజెపి నేతలకు నైతిక విలువలు లేవని మండిపడ్డారు. తెలంగాణలో బిజెపితో, ఆంధ్రప్రదేశ్‌లో టిడిపితో జనసేన పొత్తు పెట్టుకుంటుందని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన జీవిత కాలంలో సిఎం కాలేరని నారాయణ దుయ్యబట్టారు. కులాలను పవన్ కల్యాణ్ రెచ్చగొడుతున్నారని, కాపులకు సిఎం జగన్ మోహన్ రెడ్డి చేసినంత మేలు ఏ ముఖ్యమంత్రి చేయలేదని నారాయణ ధ్వజమెత్తారు. రామోజీరావు అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని, రామోజీ చేసిన తప్పులపై కేసు నమోదు చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News