ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన పాలన పట్ల చరిత్ర ఎలా తీర్పు చెపుతుందో భవిష్యత్తే నిర్ణయించాలి. ప్రస్తుతం ఆయన తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. చాలా కాలం గా ఆయన పెంచుకుంటున్న కీర్తి కొన్ని నెలలుగా మసకబారుతోంది. ఈ తీవ్ర నష్టాన్ని పూడ్చే పనిలో ఆయన ప్రభుత్వం తలమునకలై ఉంది. ఆ పనిలోనే నిమగ్నమవ్వాలని తన హిందూత్వ కుటుంబాన్నంతా ఆదేశించారు. కరోనా రెండవ దశను ఎదుర్కోవడంలో తలమునకలైన వ్యవస్థలో ఒక విశ్వాసాన్ని బలవంతంగా చొప్పించడానికి దత్తాత్రేయ హోస్‌బలె తీవ్రంగా పాటు పడుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఆయన రెండవ అధికార స్థానంలో ఉన్నారు.
దేశానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చే ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిగా తనను తాను ప్రదర్శించుకోవడానికి ప్రధాని మోడీ ఒక ఏడాదిగా పళ్ళ బిగువతో పని చేస్తున్నారు. ఇంత గొప్ప రాజకీయ నాయకుడు లేడన్నట్టుగా గుర్తింపు పొందాలన్న తపనతో ఎంతో కఠినమైన నిర్ణయాలను తీసుకున్నారు. దీని కోసమే నోట్ల రద్దు, 370 అధికరణాన్ని రద్దు చేయడం వంటి నిర్ణయాలను తీసుకున్నారు. కానీ, నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసింది. కశ్మీరు పైన తీసుకున్న నిర్ణయాలతో విదేశీ వ్యవహారాలు బెడిసికొట్టాయి. లడక్‌లో చైనీయుల చొరబాటు కూడా 370వ అధికరణ రద్దుతో ముడిపడిన సంఘటనే. ఈ రెండు నిర్ణయాల వల్లనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం భావించడం లేదు.
పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తేవడం వల్ల మోడీ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని, వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనాకారులు పెద్ద ఎత్తు న వీధుల్లోకి వచ్చారు. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు అధికార బిజెపి ఆందోళనకారులను జాతి వ్యతిరేకులని, దేశద్రోహులని ముద్ర వేసింది. దేశ ప్రతిష్ఠను, మోడీ ప్రతిష్ఠను విదేశీ శక్తుల ప్రయోజనాల కోసం ఈ ఆందోళనకారులు దెబ్బ తీస్తున్నారని ఆరోపించింది. కరోనా మహమ్మారి ఒక అల్లకల్లోలాన్ని సృష్టించి ప్రతి కుటుంబంలోనూ, ప్రతి మనిషిలోనూ చావు భయం నింపింది. ఆస్పత్రిలో బెడ్‌లు దొరకక, ప్రాణవాయువు అందక, మందుల కొరతతో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేలాది గుర్తు తెలియని వ్యక్తుల మృత దేహాలు గంగానది ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. ఈ నేరాన్నంతా రాష్ర్ట ప్రభుత్వాలపైకి నెట్టేశారు. ఈ స్మారక అస్తవ్యస్త పాలనను ప్రతిపక్షాలపైకి, ప్రతిపక్ష నాయకులపైకి నెట్టేశారు.
ప్రభుత్వ వ్యవహారం ఆహంకారంతో కూడుకున్నదని, దాని మానసిక సమస్యని నిర్వచిస్తే అది చాలా తేలికైన విమర్శ అవుతుంది. మానవ జాతి పట్ల చేసిన తప్పిదమవుతుంది. ఒక సంక్షోభం తరువాత మరొక సంక్షోభం ఏర్పడినప్పుడు, ఒక్క తప్పటడుగు కూడా వేయలేదని తమని తాము సమర్థించుకోవడం, సూచనలను అధిగమించలేకపోవడం, కచ్చితమైన తీర్పులు చెప్పడం, వైరుధ్యానికి బదులుగా సాక్ష్యాలు చూపడం వంటి వాటికి లోతైన మానసిక విశ్లేషణ అవసరం. అపారమైన ప్రజాకర్షణ ఉన్న దేశ నాయకులలో మోడీ మొదటి వారు కాదు. తన అనుచరులలో మత వ్యవస్థను పాదుకొల్పిన వారిలో కూడా మోడీ మొదటి వారు కాదు. జవహర్‌లాల్ నెహ్రూ, 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తరువాత ఇందిరా గాంధీ మోడీ కంటే ఎక్కువ జనాదరణ పొందిన నాయకులు. రాజీవ్ గాంధీ, వి.పి. సింగ్, అటల్ బిహారీ వాజ్‌పాయ్‌లు కూడా చాలా జనాదరణ ఉన్న నాయకులు. వీరిలో ఏ ఒక్కరు కూడా తమని తాము పరిశుద్ధాత్మలుగా ప్రదర్శించుకోలేదు. ఇతరులు ఇచ్చే సూచనలు సలహాలు స్వీకరించగలిగిన వినయ సంపన్నులు వీరు. తమను విమర్శించిన ప్రతిపక్ష నేతలను వీరెప్పుడూ శత్రువులుగా భావించలేదు.
అపారమైన ప్రజాదరణ, ప్రజలతో ఉన్న అవినాభావ సంబంధాలున్న ఈ సందర్భంలో, నెహ్రూను జ్ఞాపకాల నుంచి శాశ్వతంగా చెరిపేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. చాణక్య అన్న మారుపేరుతో నెహ్రూ రాసిన ఒక వ్యాసం 1937లో అచ్చయ్యింది. “నిదానంగా పని చేస్తున్న ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ జవహర్‌లాల్ నెహ్రూ కైవశం చేసుకున్నట్టయితే ఆయన ఒక నియంతగా మారవచ్చు” అని తన గురించి తానే హెచ్చరించారు. “తాను (నెహ్రూ) అనివార్యమని భావించినట్టయితే, ఎవ్వరినీ ఆలోచించనివ్వడు” ఇలా రాసిన నెహ్రూనే ఆ తరువాత ప్రధాన మంత్రి అయ్యారు. ఆయనను తీవ్రంగా విమర్శించే అంబేడ్కర్, హిందూ మహాసభకు చెందిన శ్యాంప్రసాద్ ముఖర్జీ లాంటి వారికి తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు. కాంగ్రెస్ పార్టీలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్రప్రసాద్ వంటి ఉద్దండులైన నాయకులతో విభేదాలున్నప్పటికీ, వారిలో ఒక నమ్మకాన్ని కల్పించడానికి నెహ్రూ నిత్యం ప్రయత్నించేవారు. తన ఆలోచనలను ఒప్పించడానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసేవారు.
అలాంటివి ఇప్పుడు మనం ఊహించలేం. గడిచిన ఏడేళ్ళుగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులలో కానీ, వాటి అనుబంధ సంఘాలలో కానీ ప్రధాన మంత్రితో విభేదాలున్నాయని చెప్పే ధైర్యం ఏ ఒక్కరిలో లేదు. ప్రధాని నంది అంటే నంది, పంది అంటే పంది అనే స్థాయికి దిగజారిపోయారు. ఏవైనా ముఖ్యమైన విషయాలు చర్చించాల్సి వస్తే, తమకు వచ్చిన ఆదేశాల మేరకు మాట్లాడడం, వారు చెప్పిన దగ్గర సంతకాలు పెట్టేయడంతో సరిపెడుతున్నారు. ఇలా కేబినెట్ వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయింది. పార్లమెంటరీ కమిటీలు అసంబద్ధంగా తయారయ్యాయి. ప్రతిపక్షాలను అసలు ఏ మాత్రం విలువలేనివిగా భావిస్తున్నారు.
రాష్ర్ట ప్రభుత్వాలతో వ్యవహరించే తీరు కూడా ఇందుకు ఏ మాత్రం భిన్నంగా లేదు. కేంద్ర ప్రభుత్వ ఆలోచనా విధానంతో ఎవరైనా కలిసి రాకపోతే, కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతాయి. కేంద్ర రాష్ర్ట సంబంధాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ఇందుకు చక్కని ఉదాహరణ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ ఘన విషయం సాధించినందుకు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది. అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, వి.నారాయణ స్వామి, ఉద్ధవ్ థాక్‌రే కూడా ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌లలో అధికారంలో ఉన్న ప్రతిపక్ష ప్రభుత్వాలను పట్టపగలే కూల్చేశారు. రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం ఏదో ఒక రకంగా మనుగడ సాగిస్తోంది. మత విభజనతో భయపెట్టడం అటుంచి, గతంలో ఎప్పుడూ లేని విధంగా హిందూ ముస్లిం విభజన, కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల మధ్య సంబంధాలు భారత దేశ సమగ్రతకు పెద్ద గొడ్డలి పెట్టుగా తయారయ్యాయి.
అధిక సంఖ్యాకుల ఆలోచనను రాష్ట్రాల పైన రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది స్థానిక గుర్తింపునకు పెద్ద దెబ్బగా తయారైంది. ఈ మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బెంగాల్ జాతీయ వాదం ప్రతీకారేచ్ఛతో స్పందించింది. దీంతో సమానంగా తమిళ జాతీయవాదం హిందుత్వంతో అంటకాగడాన్ని వ్యతిరేకించింది. రైతులతో వ్యవహరిస్తున్న తీరు పట్ల సిక్కు నాయకులు తీవ్రంగా కలత చెందారు. భిన్నత్వాన్ని తుడిచేసే ప్రయత్నానికి వ్యతిరేకంగా అన్ని శక్తులు ఏకమవుతున్నాయి. మోడీ, అమిత్ షా ద్వయం మాత్రం సర్దుకుపోయే, ఇతరులకు చోటు కల్పించే రాజకీయ తత్వాన్ని విశ్వసించడం లేదు. ప్రతిపక్షాలను ద్వేషించే రోగ లక్షణమే ధ్యేయంగా ఆ పార్టీని తీర్చిదిద్దారు. దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. దేశ నాయకుడి అహం కంటే దేశం గొప్పదన్న విషయాన్ని మర్చిపోకూడదు. హిందూ రాష్ర్టంగా ఏర్పాటు చేయాలనే కలకంటే జాతి ఆదర్శం మాత్రం చాలా పెద్దది.
అశుతోష్
ఎడిటర్, సత్యహిందీ డాట్ కవ్‌ు
(మే 31, ఎన్‌డీటీవీ)
అనువాదం : రాఘవ శర్మ