ప్రధాని దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్
ఘాటుగా స్పందించిన కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణపై భారత్, చైనాలు ఒక ఒప్పందానికి వచ్చాయనే కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ప్సందించారు. ప్రధాని నరేంద్ర మోడీ చైనాకు భారత భూభాగాలను వదులుకున్నారని, దానిపై ఆయన దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రధాని చైనాను ఎదుర్కోలేక మనసైనికుల త్యాగాలను అవమానిస్తున్నారు. ఇప్పుడు మన బలగాలను ఫింగర్ 3 వద్ద మోహరించనున్నట్లు గుర్తించాం. ఫింగర్ 4 మన భూభాగం. ఇప్పుడు మనం ఫింగర్ 4నుంచి వెనక్కి తగ్గి ఫింగర్ 3కు చేరాం. మోడీ ఎందుకు మన భూభాగాన్ని వదులుకున్నారు. అంతటి వ్యూహాత్మకమైన ప్రాంతం (దెప్సాంగ్ ప్రాంతం)పై రక్షణ మంత్రి ఎందుకు ఒక్క మాట కూడా కూడా మాట్లాడలేదు? ప్రధాని దీనిపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.
మీ ముత్తాతను అడుగు: కిషన్ రెడ్డి
కాగా రాహుల్ గాంధీ ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ, ప్రభుత్వం రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అదే స్థాయిలో స్పందించాయి. నిజానికి చైనాకు భారత భూభాగాలను ధారాదత్తం చేసింది ఈ దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అని హోం శాఖ సహాయమంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ‘ఆయన (రాహుల్) తన ముత్తాతను ఈ ప్రశ్న అడగాలి? అప్పుడు ఆయనకు సమాధానం వస్తుంది. చైనాకు భూభాగాలను ఎవరు వదులుకున్నారో, ఎవరు దేశభక్తులో, ఎవరు పిరికి వారో, ఎవరు కాదో ఈ దేశం మొత్తానికి తెలుసు’ అంటూ కిషన్ రెడ్డి రాహుల్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. కాగా గురువారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తూర్పు లడఖ్‌లో బలగాల ఉపసంహరణపై భారత్, చైనాల మధ్య ఒప్పందం కుదిరిందని చేసిన ప్రకటనలోనే భారత బలగాలు ఫింగర్ 3 వద్దకు ఎందుకు వెనక్కి మళ్లాల్సి వచ్చిందో వివరణ ఉందని రక్షణమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు ఫింగర్ 8 దాకా వెనక్కి వెళ్తాయని, భారత బలగాలు ఫింగర్ 3 సమీపంలో ఉన్న శాశ్వత బేస్‌కు వెళ్తాయని రాజ్‌నాథ్ తెలిపారు. భవిష్యత్తులో చర్చల ద్వారా ఇరుదేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరే వరకు ఈ రెండింటి మధ్య ఉన్న వివాదాస్పద ప్రాంతంలో ఏ దేశ బలగాలు కూడా గస్తీ నిర్వహించవని రాజ్‌నాథ్ సభలో చెప్పారు. ఇదే విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ కూడా తన వివరణలో తెలియజేస్తూ మన భూభాగాన్ని ఏమాత్రం వదులకోలేదని స్పష్టం చేసింది.