ప్రధాని మొదటి యోగా దినాన జాతీయ జెండాతో మూతి, చమట తుడుచుకున్నారు. జాతీయ జెండాపై సంతకం చేశారు. ఎర్రకోట వద్ద సంఘీయులు మత జెండాకు దిగువన జాతీయ జెండాను కట్టారు. అమిత్ షా జాతీయ జెండాను నేలపై పడేశారు. ఆదిత్యనాథ్ బల్లపై జాతీయ జెండా తలకిందులుగా ఉంటుంది. ఇవన్నీ పతాక స్మృతి ప్రకారం జాతీయ జెండాకు అవమానాలే. జాతీయ జెండాను అవమానించింది సంఘీయులే. రాజకీయ లబ్ధి కోసం పుల్వామా లో సైనిక దాడి జరగనిచ్చారు. దానితో కుహనా దేశభక్తి రెచ్చగొట్టారు. బాలాకోట్ మెరుపు దాడుల నకిలీ నష్ట ప్రచారం చేశారు.
జనవరి 26న జాతీయ జెండాకు జరిగిన అవమానంతో దేశం దుఃఖిస్తోందని 31.01.2021 మన్ కీ బాత్‌లో ప్రధాని బాధ పడ్డారు. ప్రభుత్వ సహకారంతో ఆర్.ఎస్.ఎస్. (సంఘ్) వాది, మోడీతో భుజాలు కలిపి తిరిగిన దీప్ సిద్ధూ ఎర్ర కోటపై సిక్కు మత జెండాను ఎగరేశారు. అతని బృందం అక్కడికి పోడానికి అమిత్ షా పోలీసులు సహకరించారు. అరగంట ప్రయాసతో సిద్ధూ జండా ఎగరేస్తుంటే వారు తమాషా చూశారు. మోడీ జాతీయ జండాను చతుర్వర్ణ పతాకంగా ప్రస్తావిస్తారు. అశోకచక్రం నీలి రంగు ఆయన నాలుగో రంగు. హిందుత్వ చతుర్వర్ణాల పరోక్ష ప్రస్తావన ఆయన వివరణలో అంతర్లీనం. రాజ్యాంగ మూల సిద్ధాంతాలకు, జాతీయ పతాకానికి సంఘ్ వ్యతిరేకం. 14-08-1947 నాటి సంఘ్ అధికార పత్రిక ఆర్గనైజర్‌లో, ‘త్రివర్ణ పతాకాన్ని హిందువులు గౌరవించరు. ఆమోదించరు. 3 అంకె అరిష్టం.
కీడు, దుష్ట మానసిక ప్రభావం కలిగిస్తుంది. దేశానికి బాధలు, అపాయాలు కొనితెస్తుంది అని రాశారు. ముస్లింలను సంతృప్తి పర్చటానికి జాతీయ జండాలో ఆకుపచ్చ రంగు చేర్చారు. ఆకుపచ్చను తొలగించి పూర్తిగా కాషాయంతో అద్దాలి. 19.09.2018న చెన్నైలో లౌకికత్వంపై సంఘ్ నిర్వహించిన చర్చా సభలో సంఘీయులు ఆందోళన చేశారు. 1931న కాంగ్రెస్ ఏర్పరచిన పతాక మండలి మతాలోచనలతో జెండాలో రంగులు పులిమిందని సంఘ్ ప్రవక్త మన్ మోహన్ వైద్య అన్నారు. ఆకుపచ్చ ముస్లింల రంగయితే కాషాయం హిందుత్వ సంకేతం. సంఘ్ సమానత, సమన్యాయం, సమానావకాశాలకు స్థానం కల్పిస్తున్న భారత రాజ్యాంగాన్ని తిరస్కరిస్తుంది. దాని స్థానంలో ‘మనుస్మృతి’ అమలు చేయాలంటుంది. సంఘ్ ప్రార్థనా గీతంలో, ప్రమాణంలో హిందు దేశ ఆమోదం, కాషాయ జెండా ప్రాతినిధ్య ప్రభావం స్పష్టంగా కనిపిస్తాయి. 14.07.1946న గురుపూర్ణిమ దినోత్సవ ఉపన్యాసంలో ఫ్రెంచ్ విప్లవకాలంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాల సూచనగా వారి జెండాలో మూడు పట్టెలు పెట్టారు. స్వాతంత్య్రోద్యమ నాయకులు అనుకరణలో కొట్టుకుపోయి మోహంతో మన జెండాలోనూ మూడు రంగులు చేర్చారు.
కాషాయ జెండా భారతీయ సంస్కృతిని సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది. అది భగవతార రూపం. మొత్తం దేశం కాషాయ జెండాకు మోకరిల్లి తీరుతుంది. సంఘ్ రెండవ ప్రధాన కార్యదర్శి మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్. అన్నారు. జాతీయ ఉద్యమం మూడు రంగుల జండాతో సాగింది. 26.01. 1930ని స్వాతంత్య్ర దినంగా జరుపుకోవాలని కాంగ్రెస్ ప్రకటించింది. సంఘ్ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్య్ర పోరాటాన్ని, మువ్వన్నెల జెండాను అసహ్యించుకుంది. భగువా ధ్వజ్ (కాషాయ జెండా) జాతీయ జెండాగా ఉండాలంది. 26.01.1930 సాయంత్రం గం.6కు సంఘీయులు ప్రార్థనా సమావేశాలు జరిపి కాషాయ జెండాను పూజించాలని నాటి సంఘ్ ప్రధాన కార్యదర్శి హెగ్డేవార్ సర్క్యులర్ జారీ చేశారు.
11.07.1949న సంఘ్ నిషేధ రద్దుకు నాటి కేంద్ర గృహమంత్రి వల్లభ్ బాయ్ పటేల్ సంఘ్, రాజకీయాలకు దూరంగా ఉండాలని, రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను ఆమోదించాలని షరతుపెట్టారు. జాతీయ జెండాను ఆమోదించమని పటేల్ గోల్వాల్కర్‌ను జీవిత కాలం పోరుతూ ఉండేవారు. కాని గోల్వాల్కర్ పటేల్ మాట వినలేదు. హిందు మహాసభ నేటికీ భారత గణతంత్ర దినాన్ని నల్లదినంగా జరుపుకుంటుంది. గాంధీ హత్య తర్వాత సంఘీయులు జాతీయ జెండాను కిందవేసి తొక్కారు. 24.02. 1946న నెహ్రూ తీవ్రంగా బాధపడ్డారు. జెండా అగౌరవం దేశద్రోహమని సంఘ్ తెలుసుకోవాలన్నారు. సంఘ్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెగ్డేవార్, గోల్వాల్కర్‌ల స్మారక చిహ్నాలున్న సంఘ్ స్మృతి భవన్ నాగపుర్, రేషింబాగ్‌లో ఉంది. అక్కడ స్వాతంత్య్రం వచ్చిన 54 ఏండ్ల దాకా జాతీయ జండా ఎగురవేయ లేదు. రాష్ట్ర ప్రేమి యువ దళ్ కార్యకర్తలు – అధ్యక్షుడు బాబా మెంధె, సభ్యులు రమేశ్ కలంబే, దిలీప్ చట్టాని, మరి కొందరు – 2001 జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్మృతి భవనంలో బలవంతంగా ప్రవేశించి జాతీయ జెండా ఎగురవేశారు.
దేశభక్తి గేయాలు ఆలపించారు. వీరిపై సంఘ్ కేసు పెట్టింది. 13 ఏళ్ల విచారణ తర్వాత కోర్టు వారిని వదిలేసింది. సంఘ్ కేంద్ర కార్యాలయం నాగపుర్, మహల్‌లో ఉంది. 2002 జనవరి 26న మోహితే విభాగ్ సంఘ్ నగర కార్యదర్శి చోటు భయ్యా ఢాక్రాస్ సంఘ్ కేంద్ర కార్యాలయంలోనూ, స్మృతి భవన్ బాధ్యులు శ్రీరాం జోషి స్మృతి భవన్ లోనూ జాతీయ జెండా ఎగురవేశారు. సంఘ్ ప్రధాన కార్యదర్శి మోహన్ మధుకర్ భాగవత్ మొదటిసారి 15.08. 2017న కేరళ పాలక్కడ్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండా ఎగుర వేశారు. పాఠశాలలో రాజకీయులు జాతీయ జెండా ఎగురవేయరాదని, ఆ పని ఉపాధ్యాయులదని జిల్లా కలెక్టర్ మేరీకుట్టి అభ్యంతరం తెలిపినా భాగవత్ పట్టించుకోలేదు. విమర్శలు తప్పించుకోడానికి, కేరళలో టికాణా వేయడానికి ఆయన ఆ పని చేశారని పరిశీలకుల అభిప్రాయం. జెండా వందనం తర్వాత జాతీయ గీతం ఆలపించాలి. అక్కడ వందేమాతరం పాడారు. జనగణమన పాడనేలేదు. ఇది పతాక స్మృతి ఉల్లంఘన. జాతీయ పతాకానికి అవమానం. కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడానికి చేసిన ఉద్దేశపూర్వక చర్య. 2016 ఫిబ్రవరిలో కాన్పూర్‌లో భాగవత్, అంబేడ్కర్ కూడా కాషాయ జండాను జాతీయ జెండాగా, సంస్కృతాన్ని జాతీయ భాషగా చేయాలని ఉద్దేశపడ్డారన్నారు. అయితే అంబేడ్కరీయులు దీన్ని ఖండించారు.
జాతీయ జెండాను గుడ్డలా వాడరాదు. జెండా రూపంలో ఉన్న బట్టను వాడరాదు. ఆ బట్టతో మూతి, ముక్కు, చమట తుడవటం నేరం. జెండాను అలంకారానికి వాడరాదు. మెడలో కండువాలా వాడటం అలంకారమే. జెండాపై బొమ్మలు గీసి, రాతలు రాసి, సంతకాలు చేసి జెండా ఆకారాన్ని పాడు చేయడం, చిరిగిపోగల, మురికి అంటగల, పాడుకాగల అవకాశం ఇచ్చే విధంగా జెండాను ఉంచటం నేరం. జాతీయ జెండా అవమానానికి మూడేళ్ళ జైలు, లేదా జరిమానా లేదా రెండూ శిక్షలు ఉంటాయి. ప్రధాని మొదటి యోగా దినాన జాతీయ జెండాతో మూతి, చమట తుడుచుకుంటున్నారు. జాతీయ జెండాపై సంతకం చేశారు. ఎర్రకోట వద్ద సంఘీయులు మత జెండాకు దిగువన జాతీయ జెండాను కట్టారు.
అమిత్ షా జాతీయ జెండాను నేలపై పడేశారు. ఆదిత్యనాథ్ బల్లపై జాతీయ జెండా తలకిందులుగా ఉంటుంది. ఇవన్నీ పతాక స్మృతి ప్రకారం జాతీయ జెండాకు అవమానాలే. జాతీయ జెండాను అవమానించింది సంఘీయులే. రాజకీయ లబ్ధి కోసం పుల్వామా లో సైనిక దాడి జరగనిచ్చారు. దానితో కుహనా దేశభక్తి రెచ్చగొట్టారు. బాలాకోట్ మెరుపు దాడుల నకిలీ నష్ట ప్రచారం చేశారు. పాకిస్తాన్ శత్రు బూచిని చూపారు. దేశంలో ముస్లింలను శత్రువులుగా ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో గెలవడానికి పన్నాగం పన్నారు. ఇప్పుడు ఎర్రకోటపై సిక్కు మత పతాకం ఎగుర వేయించారు. రైతులను దేశ ద్రోహులుగా చిత్రించారు. అద్భుత, ప్రపంచ స్థాయి రైతు ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మోడీ ఎత్తులు, జిత్తులు పారే కాలం ముగిసింది. జాతి జనులకు నిజాలు తెలిశాయి.
సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545