Monday, December 23, 2024

టర్కీ దారిలో నరేంద్ర మోడీ!

- Advertisement -
- Advertisement -

దేశమంతా ఒకే ఎన్నికలు, నేర శిక్షాస్మృతిని కాషాయీకరించడం, రాజ్యాంగ మౌలికసూత్రాలను తిరస్కరించడం, నూతన రాజ్యాంగం గురించి మాట్లాడడం, రహస్యంగా పార్లమెంటు ఎజెండా భారత దేశంలో అసలు ఏం జరుగుతోంది? టర్కీ అధ్యక్షుడిగా తయ్యీప్ ఎర్డోగన్ గత మేలో తిరిగి ఎన్నికయ్యాడు.ఆ సమయంలో ఆయన్ని తొలుత అభినందించింది భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఇరవై ఏళ్ళుగా పదవిలో కొనసాగుతున్న ఎర్డోగన్‌ను తొలుత ప్రధానిగా ఎన్నికైనప్పటికీ ఇప్పుడు దేశాధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఎన్నికల నియంతగా ఆయన్ని పశ్చిమ దేశాల విశ్లేషకులు అభివర్ణించారు. అధ్యక్ష తరహా పాలన కోసం 2017లో ప్రజాభిప్రాయ సేకరణ చేసి, ఆ పదవికి ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి ఆయన సర్వాధికారాలున్న దేశాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఎర్డోగన్ నుంచి కొన్ని విషయాలను మోడీ గ్రహించి, ఆయన్ని ఆదర్శంగా తీసుకోవడాన్ని కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఎర్డోగన్ మైనారిటీలైన కుర్దులను అణచివేసినట్టు గానే, మోడీ కూడా మైనారిటీలైన ముస్లింలను అణచివేయడం ఇద్దరిలోని సారూప్యతను తెలియచేస్తుంది.

ఎర్డోగన్ లాగానే మోడీ కూడా తనకనుకూలమైన వారికి చట్టబద్ధమైన కాపలాదారులుగా రాజ్యాంగ పదవులను కట్టబెట్టారు. భారత దేశంలో నియమితులైన వారి జాబితా కూడా టర్కీని పోలి ఉండడానికి ఇదే కారణం. ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ ఇలాంటి స్థానాలు కనిపించవు. మనం గమనించలేనంతగా మోడీ తన సహ నియంత నుంచి ముఖ్యమైన మూడు విషయాలను ఒంటబట్టించుకున్నారు: అవి మోసపూరిత వ్యవహారం, ఉపాయం, ఆశ్చర్యపరచడం. మోడీ పాలనలో ఇటీవల జరుగుతున్న ముఖ్యమైన సంఘటనలకు ఇదే నేపథ్యం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసిన తీరును గమనించినట్టయితే యావద్భారత దేశాన్ని తమ ప్రయోజనం కోసం డోలాయమానంలో ఎలా పడేశారో అర్థమవుతుంది. పార్లమెంటులో ఎవరి బలం ఏమిటో అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి చాలా విచిత్రంగా, ఉన్నట్టుండి సామాజిక మాధ్యమాల ద్వారా ఆగస్టు 31న ప్రకటించారు.

పార్లమెంటు సమావేశాల ఎజెండాను రహస్యంగా ఉంచడం వల్ల, దాని గురించిన ఊహాగానాలు మొదలయ్యాయి. డ్బ్భై అయిదు సంవత్సరాల పార్లమెంటు ప్రయాణంపై సమీక్ష చేయడానికే ఎజెండా అని ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. పార్లమెంటులో జరిగే చర్చనీయాంశాల గురించి ఇప్పటికే అచ్చయినప్పటికీ, అవి సమగ్రం కాదని ప్రభుత్వం ప్రకటించేసింది. రహస్యంగా ఉంచిన ఎజెండా పెద్దగా చెడ్డదేమీ కాకపోవచ్చు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అన్న అంశంపైన అధ్యయనం చేయడానికి మాజీ రాష్ర్టపతి రావ్‌ునాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీని వేసినట్టు ప్రహ్లాద్ జోషీ ప్రకటించారు. అమిత్‌షా సహా ఎనిమిది మంది సభ్యులు గల ప్యానెల్‌ను ఆ మరుసటి రోజే ప్రకటించారు.

ఈ ప్రకటన నియంతృత్వ మూల రూపాన్నంతా పుణికి పుచ్చుకున్నట్టుంది. కర్ణాటక రాష్ర్ట శాసనసభ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయం పాలైన తరువాత జూన్ 2 తేదీన రామ్ నాథ్ కోవింద్‌ను అమిత్ షా నియమించారు.అంతేకాకుండా ప్రతిపక్షాలు ఒక బలీయమైన రూపాన్ని సంతరించుకుంటున్న కాలం. రామ్ నాథ్ కోవింద్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ను, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను, ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్‌ను, ఒక అరడజను మంది రాష్ట్రాల గవర్నర్లను కలిసినట్టు సమాచారం. ఇలా కలవడం మాజీ రాష్ర్టపతికి ఒక పెద్ద అసాధారణమైన కార్యక్రమం. క్షేత్రస్థాయి పని ప్రారంభమైపోయినా చాలా వారాలకు కానీ అధికారికి ప్రకటన రాలేదు. ఇంత రహస్యం ఎందుకు? ప్రతిపక్షాల పాత్రను తగ్గించేయడానికా? ఏకపక్షంగా నియమించిన కమిటీలోని ఎనిమిది మంది సభ్యులు కూడా ప్రభుత్వ మద్దతుదారులనే సంగతి మరువకూడదు.

వీరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి నియమితులైన అధీర్ రంజన్ చౌదరి ఆ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మూడు రోజుల తరువాత నరేంద్ర మోడీ ఎన్నికల్లో తనకు లాభించే ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అంటూ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉన్నట్టుండి విదేశీ ప్రతినిధుల కోసం రాష్ర్టపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందులో రాష్ర్టపతి ద్రౌపది ముర్మును ‘భారత రాష్ర్టపతి’ (ప్రెసిడెంట్ ఆఫ్ భారత్) అని ప్రకటించారు. ఇది మరొక రకమైన అర్థంకాని నియంతృత్వ ధోరణి. మోడీ ఇండోనేషియా పర్యటనపై విడుదల చేసిన డాక్యుమెంట్లలో ఇండియా అన్న పదానికి బదులు ‘భారత్’ అని పేర్కొన్నారు. ప్రకటించని ‘జాతీయవాదాన్ని’ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, రాష్ర్టపతికి మాత్రమే ప్రకటించాలా? ప్రతి చోటా ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ అని మారుస్తారా? భిన్న భాషలు, భిన్న సంస్కృతులున్న ప్రజాస్వామిక విధానంలో ఇలాంటి నిర్ణయాలను చర్చల ద్వారా నిర్ణయించకుండా ప్రధాని కార్యాలయం ద్వారా దిగజారుస్తారా? ప్రతిపక్షాలు ఏకమై సవాలును విసరడం, కర్ణాటకలో ఓటమి దెబ్బ, అదానీ వ్యవహారాల చిక్కుముళ్ళు వంటి మూడు విషయాలు మోడీ వ్యవస్థీకృతాన్ని కుదిపేసింది. ఈ భయాందోళనలను దృష్టిలో ఉంచుకుని తన సర్వాధికారానికి అడ్డంకులుగా మారే మిగతా ఆటంకాలను అధిగమించడానికి ఇంత వేగంగా ఈ నిర్ణయాలు తీసుకున్న విషయం గమనించాలి.

రాజ్యసభకు నామినేటెడ్ సభ్యుడైన మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తొలిసారిగా సభలో మాట్లాడుతూ రాజ్యాంగ మౌలిక నిర్మాణం నిర్వహణపైప్రశ్నించారు. వెంటనే టివి యాంకర్ల నుంచి, పత్రికల్లో రాసే వారి నుంచి మద్దతు లభించింది. దాంతో భారత నూతన రాజ్యాంగ ప్రతిపాదన వచ్చేసింది. ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ ఒక వ్యాసం రాస్తూ భారత దేశానికి నూతన రాజ్యాంగం రావాలని కోరారు. రాజ్యాంగ మార్పుకు కారణాలు చెపుతూ ‘రాజ్యాంగ ఉపోద్ఘాతంలో ఉన్న సోషలిజం, లౌకికత్వం, ప్రజాస్వామ్యం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అన్న పదాలు అసలు ఏమిటి’ అని ప్రశ్నించారు. ఇది దేబ్రాయ్ వ్యక్తిగత అభిప్రాయం అని అధికారులు వివరణ ఇచ్చారు. ఇది దేబ్రాయ్ వ్యక్తిగత అభిప్రాయం కాదని స్పష్టమైంది.

అధికార వ్యవస్థకు అనుకూల రచయితల నుంచి కూడా దీనికి మద్దతు లభించింది. ఎన్నికల కమిషన్ ఎంపిక చేసే ప్యానెల్‌ను సవరించడానికి గత నెల కొత్త ప్యానెల్‌ను తయారు చేసింది. న్యాయస్థానం సూచించినట్టు ఆ ప్యానెల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరును తొలగించారు. తమకు అనుకూలమైన వ్యక్తిని ఎన్నికల కమిషన్‌గా నియమించడానికి దారి సుగమం చేసుకున్నారు. ఇప్పుడది చట్టబద్ధమైన మార్గంలో ఉండవచ్చు. ఎన్నికల కమిషన్‌పైన పూర్తి అదుపు వచ్చేశాక, ఇక చట్టాలను కాషాయీకరించడమే తరువాయి. నిజమైన అధికారిక రూపంలో అమిత్ షా ఇండియన్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో జాతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష, భారతీయ సాక్ష్యాల బిల్లును పరిచయం చేశారు.

ప్రతిపక్షాలను అసలు సంప్రదించకుండా, న్యాయ వ్యవస్థలో బాధ్యులతో మాట్లాడకుండా, ప్రజల మధ్య చర్చ పెట్టకుండానే ఈబిల్లులను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. వలసవాద చట్టాల కంటే కూడా ఇవి చాలా దారుణంగా ఉన్నాయని న్యాయకోవిదులు అంటున్నారు. జి 20 సదస్సు పేరుతో మోడీ అపూర్వమైన తన ప్రచారార్భాటం నీడలో ఈ ద్వంద్వ రాజ్య వ్యవహారాన్ని చర్చకు రాకుండా చేశారు. జి 20 సదస్సు సందర్భంగా ప్రతి వంద మీటర్లకు పౌరాణిక పాత్రల రూపాలతో, పెద్ద పెద్ద మోడీ బొమ్మలతో నిండిన ఢిల్లీ నగర గోడలను చాలా ఆడంబరంగా అలంకరించారు. భారత దేశంలో ఒక అతిపెద్ద ధనికుల ఇళ్ళలో జరిగిన పెళ్ళి ఆడంబరాన్ని ఇది తలపించింది. కామన్ వెల్త్ క్రీడల సమయంలో ఇలాంటి ఆడంబరాలను తీవ్రంగా విమర్శించిన భారత పత్రికా రంగం, ఇప్పుడు మాత్రం అధికారికంగా పైనుంచి ఎవరో ఒత్తిడి చేసినట్టు వీటిపైన ఏమాత్రం దృష్టి సారించలేదు.

విదేశీ ప్రతినిధుల దృష్టిలో పడకుండా వేలాది మంది తోపుడు బండ్ల వ్యాపారులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. వారిలో చాలా మంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రముఖులు వచ్చే ప్రాంతాలలోకి రాకుండా తొమ్మిది వేల మంది ప్రదర్శకులను దూరంగా తరిమేశారు. ప్రముఖులు ప్రయాణం చేసే ప్రాంతం నుంచి మురికివాడల సమూహాలను బుల్డోజర్లతో ధ్వంసం చేసి, మూటముల్లెలతో వారిని అక్కడి నుంచి తరిమేశారు.జి20 సదస్సులో మోడీ ప్రదర్శనకు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్టు విదేశీ ప్రచురణల్లో ఉండే స్వామినాథన్ అయ్యర్ చెప్పారు. మోడీకి సంబంధించిన ప్రకటనలు ప్రచురించడం వల్ల భారత పత్రికా రంగ కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించుకున్నాయి. ఈ సదస్సు మొత్తానికి అయిన ఖర్చు 4,100 కోట్ల రూపాయలని ఒక అంచనా. అనధికార అంచనా మేరకు అసలు ఖర్చు దీనికి రెట్టింపు ఉంటుంది. మోడీ ప్రభుత్వంలో మీడియా స్వేచ్ఛను అమెరికా మీడియా జి20 సదస్సులో చవిచూచింది.

‘మోడీ, జో బైడెన్ సమావేశం జరుగుతున్నప్పుడు, అమెరికా మీడియాను ఆ ప్రాంతానికి దూరంగా ఒక వ్యాన్‌లో నిర్బంధించారు. ఇది అనూహ్యమైనది. అమెరికాలో ఇలాంటివి జరగవు’ అని రాయిటర్‌కు చెందిన హుమెరాపాముక్ ట్వీట్ చేశారు. రాజులు, చక్రవర్తుల కాలంలో ఉన్నటువంటి ఘనమైన సంస్కృతికి ప్రతీకలుగా హోటళ్ళలో వెండి, బంగారు కంచాలలో, పాత్రలతో రకరకాల వంటకాలను వడ్డించారు. చివరగా భారతీయతను ఇలా చూపించారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి భగవద్గీత చాట్ జిపిటిని తెరిస్తే సమాధానాల కోసం చాట్‌బోట్‌లో ‘చరిత్ర’ పుస్తకంలో వారికి అన్నీ అరుపులు, కచ్చితత్వం లేనివి, అసత్యాలు కనిపించాయి. ఏ ప్రజాస్వామ్యంలోనైనా ఉన్నట్టుగానే, మోడీ పరిపాలనా కాలం అంతా వేగంగా అభివృద్ధి చెందిందని రాయడంలో పత్రికలు మునిగిపోయాయి. నవ భారత్ గురించి మాత్రం కాదు.

మూలం: పి.రమణ్
అనువాదం రాఘవశర్మ
9493226180
(‘ద వైర్’ సౌజన్యంతో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News