Monday, December 23, 2024

ఆత్మస్తుతి, పరనింద

- Advertisement -
- Advertisement -

వేదిక తనదైతే వెయ్యి అబద్ధాలైనా ఆడొచ్చని అంటారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రధాని మోడీ అనర్గళంగా, హావభావయుక్తంగా చేసిన ప్రసంగం దీనినే గుర్తు చేసింది. స్థూలంగా చెప్పాలంటే ఆత్మస్తుతి పరనిందగా హోరెత్తింది. దేశ ప్రగతికి సంబంధించి వాస్తవాలను ప్రజల ముందుంచడానికి, అంతర్జాతీయ స్థాయిలో మన పరువు తీసిన అదానీ స్టాక్ మార్కెట్ కుంభకోణం నిజానిజాలను తెలియజేయడానికి ప్రధాని మోడీ ఈ అవకాశాన్ని వినియోగించి వుంటే ఆయన ప్రతిష్ఠ పెరిగేది. తన అధికార పరిధులు దాటి అదానీకి అండగా నిలిచినట్టు ప్రతిపక్షం చేస్తున్న విమర్శకు సూటిగా సమాధానం చెప్పి వుంటే విలువైన పార్లమెంటు కాలాన్ని సద్వినియోగం చేశారనే మంచి పేరు దక్కేది.

కాని ప్రధాని మోడీ బూటకాల బురదతో తన ప్రసంగాన్ని అవధులు మీరి కంపు కొట్టించారు. బుధవారం నాడు లోక్‌సభలో చేసిన ప్రసంగంలో 140 కోట్ల మంది భారతీయుల ఆదరాభిమానాలే తనకు తిరుగులేని రక్షాకవచంగా వున్నాయని ప్రధాని చెప్పుకొన్నారు. భారతీయ జనతా పార్టీ పదే పదే ఎన్నికల విజయాలు సాధిస్తూ వుండడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజలు ఎంతగా చెప్పినా ఐక్యం కాని ప్రతిపక్షాలు ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్) దాడుల భయంతో ఏకమయ్యారని చమత్కరించారు. ఈ విధంగా ఏకపక్షంగా బుల్డోజర్ మాదిరిగా సాగిపోయిన ప్రధాని ప్రసంగం రెండో రోజు రాజ్యసభలో మరింత ఎదురులేని రీతిలో స్వైర విహారం చేసింది.

గత దాదాపు తొమ్మిదేళ్ళుగా తన ప్రభుత్వం చేసిన అకృత్యాలన్నింటినీ కప్పుకోడానికి మోడీ కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళి ఆనాటి కాంగ్రెస్ పాలకుల దుశ్చర్యలను తవ్విపోశారు. నువ్వు శుంఠవంటే నువ్వే శుంఠవనే పద్ధతిని ఆశ్రయించారు. అంతేగాని తాను కొత్త పుంతలు తొక్కిందెక్కడో, రాజకీయాల్లో ప్రజాస్వామిక విలువలను పోషించిందెప్పుడో చెప్పలేదు. కాంగ్రెస్ తన హయాంలో రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చడానికి ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసిందని మోడీ దుమ్మెత్తి పోశారు. రాష్ట్రాల్లో ప్రజలెన్నుకున్న ప్రతిపక్షాల ప్రభుత్వాలను 90 సార్లు కాంగ్రెస్ పాలకులు రద్దు చేశారని, ఇందిరా గాంధీ అయితే 50 సార్లు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని ప్రధాని మోడీ ఎద్దేవా చేయడం గురివింద సామెతనే గుర్తు చేసింది. తాము అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది సంవత్సరాల్లోనే ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను ఏ విధంగా కూల్చివేశారో ప్రధాని మోడీ మరచిపోయారు. ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం అందుకోలేకపోవడమో లేదా అధికారంలో కొనసాగలేకపోవడమో జరిగింది. అందుకు బిజెపి కుట్రలు దోహదం చేశాయి.

గోవాలో, మణిపూర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ దానిని చీల్చడం ద్వారా అక్కడ బిజెపి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడదోసిన ప్రతిభ కూడా దానిదే. రాజస్థాన్‌లో సచిన్ పైలట్‌ను మంత్రించడం ద్వారా అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చడానికి విఫలయత్నం చేసింది. మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని ఏ విధంగా మట్టికరిపించిందో తెలిసిందే. కర్నాటకలో కమలనాథులు నడిపించిన ఫిరాయింపు రాజకీయాల గురించి ఎంత చెప్పినా చాలదు. ప్రజల తీర్పు మీద బొత్తిగా గౌరవం లేని మోడీ ఆత్మరక్షణ కోసం ఎప్పుడో జరిగిన కాంగ్రెస్ కుట్ర రాజకీయాలను ప్రస్తావించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. రాష్ట్రాల అప్పుల గురించి ప్రధాని మోడీ చేసిన విమర్శ తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నట్టు వుంది. గురువారం నాడు రాజ్యసభలో చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ సంక్షేమ ఉచితాలపై తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు.

ప్రజాకర్షక విధానాలను అవలంబిస్తున్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేస్తున్నాయని, ఆ రాష్ట్రాలు ముందు ముందు ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఆయన హెచ్చరించారు. ఇది దేశానికి మంచిది కాదని ఇరుగుపొరుగు దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయాన్ని దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా అడుగులు వేయాలని హితవు చెప్పారు. ఉచితాలు అనే పేరిట సంక్షేమ పాలనను ఎద్దేవా చేయడంలోనే ప్రధాని మోడీ ఆంతర్యం వెల్లడవుతున్నది. దారిద్య్రంలో మునిగి వున్న కోట్లాది సాధారణ ప్రజలను మరిన్ని బాధలకు గురి చేసి కార్పొరేట్ శక్తుల సేవలో తరించడమే ఆయన లక్షమన్నది సుస్పష్టం. అందుచేతనే సంక్షేమం కింద ఖర్చు చేయడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల కుప్పలుగా మారుతున్నాయని వేలెత్తి చూపిస్తున్న మోడీ హయాంలో దేశ ప్రజల తలసరి రుణ భారం 2.53 రెట్లు పెరిగిందనే సంగతిని గమనించాలి. 2014లో మోడీ అధికారం స్వీకరించినప్పుడు రూ. 54 లక్షల 90 వేల 763 కోట్లుగా వున్న భారత ప్రభుత్వ అప్పు, 2022 అక్టోబర్ 15 నాటికి రూ. 155 లక్షల కోట్లకు చేరింది. ఎనిమిదేళ్ళలో మోడీ ప్రభుత్వం రూ. 100 లక్షల కోట్లకు పైగా అప్పు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News