ఢిల్లీ: తప్పుడు ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ 19 ఏళ్లు మౌనంగా భరించారని హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. 2002 గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు ఒక ఎంపితో సహా 68 మంది చనిపోయారు. అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఈ అల్లర్లతో సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి. అన్ని ఆరోపణలను కోర్టు కొట్టేసిందన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మీడియాతో మాట్లాడారు. 19 ఏళ్ల పాటు గరళకంఠుడిలా ప్రధాని నరేంద్ర మోడీ వేదనను అనుభవించారన్నారు. న్యాయ ప్రక్రియను మోడీ గౌరవించారని, సిట్ విచారణ సమయంలో ఎవరూ ఎలాంటి ధర్నాలు చేయలేదన్నారు. ఎంతో దృఢ సంకల్పం ఉంటేనే ఇలా ఉండడం సాధ్యమవుతుందన్నారు. రాజకీయ కోణంలోనే మోడీపై ఆరోపణలు వచ్చాయన్నారు. చివరికి బంగారంలా మెరుస్తూ నిజం బయటకు వచ్చిందని షా స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతోనే కేసులు పెట్టినట్టు తీర్పు ద్వారా వెల్లడైందన్నారు. తాను చాలా దగ్గర నుంచి మోడీని చూశానని, అన్నీ అబద్ధాలని తెలిసినా ఒక్క మాట మాట్లాడలేదన్నారు.